జగన్ దిగిపోతే అప్పులు తీరిపోతాయా

By KTV Telugu On 2 April, 2023
image

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ నోట వినిపించే మాట అప్పులు. రాష్ట్రానికి అప్పులు తీసుకురావడంలోనే జగన్ తన టాలెంట్ మొత్తాన్ని వినియోగిస్తున్నారని విపక్షాలు కోడై కూస్తున్నాయి. తాజాగా బాండ్ల వేలం ద్వారా మూడు వేల కోట్ల అప్పుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు కట్టుబడి ఉంటామని అంగీకరించడంతో అప్పు పుట్టడం సులభమైంది. గత ఆర్థిక సంవత్సరానికి అది ఆఖరి అప్పు అనుకోవాలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కొత్త అప్పు అనుకోవాలో కూడా ప్రత్యేకంగా చెప్పలేని పరిస్థితి ఉంది.

జగన్ హయాంలో ఏపీ అప్పులు పది లక్షల కోట్ల రూపాయలు దాటి పోయాయని ఒక అంచనా. వడ్డీలు కొట్టేందుకే వచ్చిన ఆదాయం సరిపోవడం లేదని కూడా లెక్కలు వేస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే ఏపీ ప్రభుత్వం 96 వేల కోట్ల రూపాయలు రుణం తీసుకుంది. అందులో ఎఫ్ఆర్బీఎం పరిధికి సంబంధించినది 44 వేల కోట్లు అయితే యాభై వేల కోట్లకు పైగా మిగతా రూపంలోకి వచ్చినదిగా భావించాల్సి ఉంటుంది. మద్యం ఆదాయాన్ని తాకట్టు  పెట్టి కూడా  9 వేల కోట్ల వరకు అప్పులు తీసుకొచ్చారు.

ప్రతీ నెల జీతాలు పెన్షన్లకే సాలిడ్ గా 5 వేల 500 కోట్లు అవసరమవుతుంది. దానితో కోసం నానా తంటాలు పడటంతో పదో తేదీన కూడా కొందరికి జీతాలు చెల్లించలేని పరిస్థితి వస్తోంది. పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. దీనిపై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. సంక్షేమ పథకాలతో పాటు జనానికి పంచుతామని చేసిన హామీల వల్లే వ్యయం పెరిగి ఖజానా ఖాళీ అవుతోందని ఆర్థికవేత్తలు ఓపెన్ గానే చెబుతున్నారు. పైగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జగన్ కొత్త పథకాలకు కూడా సిద్ధమవుతున్నారు. పరిశ్రమలు రాకపోవడం పారిశ్రామిక ప్రగతి లేకపోవడంతో కూడా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం రావడం లేదు. ఈ నెల జీతాలు ఇచ్చేందుకు అన్ని శాఖల వద్ద ఉన్న నిధులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ఆదేశించడం దౌర్భాగ్యంకాక మరేమవుతుందని విపక్షాలు ప్రశ్నించాయి. రిజర్వ్ బ్యాంకు మూడు వేల కోట్ల అప్పుకు ఆమోదముద్ర వేయకుంటే జీతాలే ఉండేవి కాదని వార్తలు వస్తున్నాయి. ఇది నిజంగా ఆందోళనకరమే అవుతుంది. కాకపోతే జగన్ అడిగినప్పుడల్లా అప్పు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించడమొక్కటే ఇప్పుడు పాజిటివ్ పరిణామంగా చెప్పాలి.

అప్పులు ఎలా తీరుతాయి కొత్త అప్పులు చేయకుండా ఆర్థిక కార్యకలాపాలు ఎలా నిర్వహించాలి జగన్ దిగిపోతే అప్పులు వాటంతట అవే తగ్గిపోతాయా. ఆయన లేకపోతే అప్పులు చేసే అవసరం ఉండదా ఇలాంటి ప్రశ్నలు కొత్త కాలంలో పబ్లిక్ డొమైన్ లో చర్చకు  వస్తున్నాయి. జగన్ రోజురోజుకు అన్ పాపులర్ అవుతున్న తరుణంలో 2024 ఎన్నికల తర్వాత ఆయన దిగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే పరిస్థితి వస్తే రాష్ట్రంలో ఏం జరుగుతుంది.

ఏపీలో జగన్ ఓటమి పాలైన పక్షంలో చంద్రబాబు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆ మాట చెప్పేందుకు ఎవరూ వెనుకాడాల్సిన పని కూడా లేదు. ఎంఏ ఎకనామిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన చంద్రబాబు గతం రాష్ట్రాన్ని ఆర్థిక రంగంలో ముందుకు తీసుకెళ్లిన మాట కూడా ఎవరూ కొట్టిపారెయ్య లేదు. ఓపికమంతుడిగా పేరు పొందిన టీడీపీ అధినేత పరిశ్రమలకు కావాల్సిన రాయితీలు ఇస్తూ వారిని తెలుగు గడ్డపైకి ఆహ్వానించే వారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తారన్న విశ్వాసం జనంలో కలుగుతోంది. ఆ సంగతి ఎలా ఉన్నా అప్పులు తీర్చడమెలా అప్పులు చేయకుండా ఉండటమెలాగో చంద్రబాబు చేసి చూపించగలరా అని కొందరు ప్రశ్నస్తున్నారు.

నిజానికి పది లక్షల కోట్ల అప్పును వెంటనే తీర్చేయ్యాల్సిన అవసరం లేదు. దానికో షెడ్యూల్ ఉంటుంది. రీ షెడ్యూల్ అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే జగన్ ఏడాదికి చేస్తున్న దాదాపు లక్ష కోట్ల అప్పును కొనసాగించాలా వద్దా అన్నదే పెద్ద ప్రశ్న. పైగా వేతనాలు పెన్షన్లు ఖచితంగా ఒకటో తారీఖున వేయడమెలాన్నది అంతకంటే పెద్ద ప్రశ్న. దానికి ఆర్థిక వేత్తలు చెబుతున్న సూచనలు సహేతుకంగానే ఉన్నాయి. పాపులారిటీకి పోకుండా కొన్ని పథకాలను తాత్కాలికంగానైనా ఆపెయ్యాలని వారంటున్నారు. రాష్ట్ర ఆదాయం పెరిగిన తర్వాత అవసరమైతే మళ్లీ ప్రారంభించే వీలుంటుంది. కొన్ని పథకాలవల్ల డబ్బువృథాను నియంత్రించలేకపోతున్నారు. అందులో పాఠశాల విద్యా శాఖలో చేస్తున్న ఖర్చు ప్రధానమైనదిగా చెబుతున్నారు. ప్రభుత్వ వ్యయాలను పూర్తిగా తగ్గించేయాలి. జగన్ ప్రారంభించిన సలహాదారుల వ్యవస్థను రద్దు చేస్తే ఖర్చులు తగ్గుతాయి.

పరిశ్రమలను ఆహ్వానించడమే తొట్ట తొలి ప్రాధమ్యం కావాలి. అదృష్టవశాత్తు రాష్ట్రంలో కావాల్సినంత ల్యాండ్ బ్యాంక్ ఉంది. ప్రాజెక్టులు కళకళలాడుతుండటంతో పారిశ్రామిక అవసరాలకు నీటి ఎద్దడి ఉండదనే చెప్పాలి. కొంచెం రాయితీలు ఇచ్చి ప్రోత్సహించే పరిశ్రమలు వాటంతట అవే వస్తాయి. రాజకీయ జోక్యం లంచాలు లేకుండా చూసుకుంటే పరిశ్రమలు షెడ్యుల్ కంటే ముందే ప్రారంభమవుతాయి. అప్పుడు ఉద్యోగావకాశాలు పెరిగి జాబ్ మార్కెట్ పై వత్తిడి తగ్గుతుంది. అందరికీ ఉపాధి అవకాశాలుంటే ఉచితాలపైనా ఆశపడటం తగ్గిపోతుంది. మాకొద్దీ ఫ్రీబీస్ అని జనమే ఎదురు సమాధానం చెబుతారు.

పకడ్బందీగా చర్యలు తీసుకుని ఖర్చులను నియంత్రిస్తే ఏదైనా సాధ్యమేనని చెబుతున్నారు. రెండు మూడు నెలలు ఇబ్బందిగా ఉన్నా ఆరునెలల కాలంలో టర్న్ ఎరౌండ్ ఖాయమని స్థూల ఆర్థిక విశ్లేషకుల వాదన. ఇంతకాలం ఓపిక పట్టిన జనం మరో ఆరు నెలలు ఆగుతారన్న నమ్మకమైతే ఉంది.