తెలంగాణ మొదటి మహిళా మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజల పరీక్షలో గట్టెక్కారా

By KTV Telugu On 3 April, 2023
image

 

ఎవరి విజయం వెనుక అయినా ఓ మహిళ ఉంటుందని నానుడి. అది టీమ్‌కు కూడా వర్తిస్తుంది. రాజకీయాల్లో మాత్రం ఇది వర్తిస్తుందో లేదో చెప్పడం కష్టం. ఎందుకంటే తెలంగాణ తొలి ప్రభుత్వంలో అసలు మహిళా మంత్రే లేరు. రెండో ప్రభుత్వంలో మాత్రం అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు. ఒకరు సబితా ఇంద్రారెడ్డి మరొకరు సత్యవతి రాథోడ్. సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవలేదు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ కండువా కప్పుకుని పదవి పొందారు. అయితే ఆమె కంటే ముందే సత్యవతి రాథోడ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎలా చూసినా తెలంగాణలో తొలి మహిళా మంత్రి సత్యవతి రాథోడ్. ఎస్టీ మహిళా శిశు సంక్షేమ శాఖలను ఇచ్చారు. మరి ఆమె తన శాఖలకు న్యాయం చేయగలిగారా పార్టీకి ప్రభుత్వానికి ప్లస్ అయ్యారా.

సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే కాదు. నిజానికి ఆమె తెలంగాణ తొలి మహిళా మంత్రి అవుతారని ఎవరూ అనుకోలేదు. గత ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్ కూడా దొరకలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరినప్పటికీ అవకాశం దక్కలేదు. అయితే ఆమె పార్టీకి విధేయంగానే ఉన్నారు. సమీకరణాలతో ఎమ్మెల్సీ పదవి రావడం వెంటనే మంత్రి పదవి కూడా దక్కడం అదృష్టం అనుకోవచ్చు. ఎమ్మెల్సీగా మంత్రిగా సత్యవతి రాథోడ్ తెలంగాణ తొలి మహిళా మంత్రిగా పదవిలో ఉన్నారు. అయితే ఆమె తన ఎక్కడా వివాదాస్పదం కాని తన పనితీరుతో పెద్దగా హైలెట్ కాకపోయినప్పటికీ హైకమాండ్ మన్ననలు పొందుతున్నారు.

ఆమె శాఖ ఎస్టీ సంక్షేమ శాఖ కొద్ది సవాళ్లతో కూడుకున్నదే. ఆ శాఖ ప్రధానమైన సమస్య పోడు భూములు. ఈ పోడు భూముల సమస్య ఇప్పటిది కాదు. ఇప్పుడు పరిష్కారమయ్యేది కాదు. కానీ కేసీఆర్ తాను పరిష్కరించేస్తానని గతంలో హామీలు ఇచ్చి ఉన్నారు. అందుకే సహజంగానే ఆ వర్గం నుంచి మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్ పై ఒత్తిడి పెరగడం సహజం. ఆ ఒత్తిడిని భరిస్తూ సత్యవతి రాథోడ్ ఎక్కడా ఎవర్నీ నొప్పించకుండా రాజకీయాలు చేస్తున్నారని అనుకోవచ్చు. నిజానికి పోడు భూముల అంశంపై మంత్రి సత్యవతి రాథోడ్ కు ఎలాంటి అధికారం లేదు. సలహాలు కూడా తీసుకుంటారో లేదో తెలియదు స్వయంగా సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని డీల్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే సందేశాన్ని ఎస్టీ వర్గాలుక చేర వేస్తూ సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకాన్ని మాత్రం కల్పిస్తున్నారు. ఇక మహిళా శిశు సంక్షేమం విషయంలోనూ సత్యవతి రాథోడ్ మంత్రిగా ప్లస్ మార్కులే తెచ్చుకున్నారని అనుకోవచ్చు. తన శాఖలో గొప్ప మైలేజ్ తెచ్చుకోలేకపోవచ్చు కానీ ఎలాంటి వివాదాలపాలు కాకుండా ఉండటం గొప్ప పనితీరుగా భావించవచ్చు.

ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆమెకు రాజకీయంగా పార్టీపై పట్టు లేదు. ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి పవర్ ఫుల్ లీడర్ మరో మంత్రిగా ఉన్నందున మొత్తం ఆయన చేతుల్లోనే ఉంటుంది. పార్టీని చక్కదిద్దేంత బాధ్యతలు ఆమెపై లేవు. టీఆర్ఎస్ హైకమాండ్ కూడా ఆమె జిల్లా మొత్తం చక్కదిద్దాలని అనుకోలేదు. ఎస్టీ వర్గాల్లో పార్టీకి ఉన్న పట్టు జారిపోకుండా చూడాలని అనుకున్నారు. ఈ విషయంలో ఆమె తన వంతు బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తున్నారని అనుకోవచ్చు. రాజకీయంగా సత్యవతి రాథోడ్ అంత బలవంతురాలు కాదు. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ లభిస్తుదా లేదా అన్నది కూడా డౌటే. మంత్రిగా ఉన్న వారికి కూడా టిక్కెట్ ఇవ్వకపోతే ఎలా అని హైకమాండ్ అనుకుంటే చాన్స్ ఇస్తారు. లేకపోతే సత్యవతి రాథోడ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం లేదు.

తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత సర్పంచ్‌ గా జడ్పీటీసీగా కూడా పోటీ చేయడానికి ఏ మాత్రం మొహమాటపడ లేదు. స్థాయిల గురించి పట్టించుకోలేదు. రాజకీయాల్లో ఇలాంటి మైండ్ సెట్ పదవుల్ని తెచ్చి పెడుతుంది. సత్యవతి రాథోడ్ విషయంలో అదే జరిగింది. 2009 సంవత్సరంలో టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు చాలా మందిలో పోటీ పడినప్పటికీ ఆమెకు టిక్కెట్ కేటాయించడానికి కారణం ఈ వ్యక్తిత్వమే. ఎమ్మెల్యే గా సీటు ఇవ్వడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపని కేసీఆర్ ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వడానికి కారణం ఆమె విధేయతే. తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది మంత్రుల్లాగే పవర్ లెస్ అయినప్పటికీ వీలైనంతగా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తూ మంచి మార్కులే తెచ్చుకున్నారు సత్యవతి రాథోడ్. ఆమెకు అటు మంత్రిగా పనితీరు ఇటు పార్టీకోసం చేసిన పనిని చూస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ మార్కులు వేయవచ్చు.