*ఏపీలో ముందస్తు ఊహగానాలకు చెక్
*ముందస్తుకు మొగ్గుచూపని జగన్
*బాబు, పవన్ ల ఆశలు ఆవిరి
*ఇంకా 19నెలల సమయముందన్న సీఎం
*కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకతే కారణమా?
ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహగానాలకు తెరపడిందా?ఇటీవల ఎమ్మెల్యేలతో సమావేశంలో ఎన్నికలకు ఇంకా 19నెలల సమయం ఉందంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి. ఐదేళ్ల పూర్తికాలం తర్వాత…అంటే 2024లోనే ఎన్నికలకు వెళ్లాని జగన్ డిసైడ్ అయ్యారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. సీఎం జగన్ ముందస్తుకు మొగ్గుచూపడం లేదనే సమాధానం వస్తోంది. సర్వేలో కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం వల్లే జగన్ ముందస్తుకు వెనకాడుతున్నారని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయి.. అందరూ సిద్ధంగా ఉండాలి… పనిచేసేవారికే టికెట్లు… ఈ సారి మనదే ప్రభుత్వం అంటూ… చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రతి జిల్లా పర్యటనలో, సమావేశాల్లో చెబుతూ వచ్చారు. ముందస్తుకు వెళ్లకుంటే జగన్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ప్రచారం జరిగింది.ఈ హడావుడి చూస్తే నిజంగానే ఎన్నికలు ముందే వచ్చేస్తున్నాయేమోనని సందేహం ప్రజల్లో కలిగింది. అయితే, ఒక్క సమావేశంతో ఆ ఊహగానాలన్నంటికీ చెక్ పెట్టారు జగన్.
జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని.. ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ఆశావహులు ఏడాదినుంచి తమకు తోచిన విధంగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత సైతం …. తమ నాయకులు, కార్యకర్తలు నిరాశకు లోనుకాకుండా ముందస్తు ఎన్నికలు తథ్యం అని చెబుతూ వస్తున్నారు. జనసేన సైతం అలాగే భావిస్తూ వచ్చింది. అయితే, సీఎం మాత్రం ఎక్కడా దానిపై ప్రకటనలు చేయలేదు.అయితే, ఇటీవల ఎమ్మెల్యేలతో భేటీ సందర్భంగా… ఎన్నికలకు సుమారుగా 19 నెలల సమయం ఉందని ఆయన స్పష్టం చేశారు. అంటే పూర్తికాలం సర్కారు కొనసాగుతుంది. గడపగడపకు కార్యక్రమంపై.. డిసెంబర్ లో మళ్లీ ఓసారి సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి అన్నారు. ఆ రకంగా గడపగడపకు వార్నింగ్‌లతో ఈ ఏడాది గడచిపోయినట్టే. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే.. ఆరునెలల ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తానన్న మాట ప్రకారం.. 2023 తొలి మూడు నెలల్లోనే అది జరగాలి. కానీ, అందుకు అవకాశం లేదు.
వచ్చే ఏడాది ప్రారంభంలో నారా లోకేష్ పాదయాత్రను, పవన్ కల్యాణ్ బస్సు యాత్రను ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ సమయంలో గనుక జగన్ అభ్యర్థుల జాబితాను ప్రకటించినా, ముందస్తు ఎన్నికలకు వెళ్లినా.. తమకు దక్కగల ప్రజాదరణ చూసి జడుసుకుని ముందస్తు ఎన్నికలకు వచ్చేశారని వారిద్దరూ చెప్పే అవకాశం ఉంది. అయితే, సీఎం జగన్ తన ప్రత్యర్థులకు అలాంటి అవకాశం ఇవ్వకపోవచ్చు. ఆ కోణంలోంచి చూసినప్పుడు.. ఏపీలో ముందస్తు ఎన్నికలు అనేవి వచ్చే అవకాశమే లేదని అర్థమవుతుంది. ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని తెలియడం వల్లే లోకేశ్, పవన్ కల్యాణ్ లు తమ యాత్రలను వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది.