ఆవు మూత్రం గాడిద పాలు.. క్లియోపాత్ర సౌంద‌ర్య ర‌హ‌స్యం అదేన‌ట‌

By KTV Telugu On 4 April, 2023
image

 

సెల‌బ్రిటీలు చెబితే ఎవ‌ర‌యినా ఠ‌కీమ‌ని న‌మ్మేస్తారు. ఆ సెల‌బ్రిటీలో సినీతార‌ల‌యినా రాజ‌కీయాల్లో త‌మ‌దైన ముద్ర వేసిన‌వార‌యినా. వాళ్ల నోటినుంచి ఓ విష‌యం వ‌చ్చిందంటే ఎంతోకొంత‌మంది నిజ‌మేనేమో అనుకుంటారు. ప‌దిమందికీ అదే విష‌యం షేర్ చేసుకుంటారు. దేశంలో ఇప్ప‌టికే ఆవు పేడ‌, మూత్రం ఎంత శ్రేష్ట‌మో కొంత‌మంది ప‌నిగ‌ట్టుకుని చెబుతున్నారు. అలాంటి ప్రాపంచిక జ్ఞానంతోనే ప‌తంజ‌లి బాబా చిత్రవిచిత్ర‌మైన ఉత్ప‌త్తుల‌తో ప్ర‌మోష‌న్ చేసుకుంటున్నారు. గాడిద‌పాల ప్ర‌మోష‌న్ బాధ్య‌త‌ను ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి మేన‌కాగాంధీ భుజాన వేసుకున్న‌ట్లున్నారు.

మేన‌కాగాంధీకి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఇందిరాగాంధీ పెద్ద‌కోడ‌లు సోనియాగాంధీకి తోడికోడ‌లు. ఇందిరా ఇంటినుంచి గెంటేసినా మేన‌కాగాంధీ ఆత్మ‌విశ్వాసం చెక్కుచెద‌ర‌లేదు. త‌న కాళ్ల‌పై తాను నిలుచున్నారు. రాజ‌కీయంగా నిల‌దొక్కుకున్నారు. కేంద్ర‌మంత్రిగా కూడా గ‌తంలో కీల‌క ప‌ద‌వి చేప‌ట్టారు. ప్ర‌స్తుతం ఆమె ఫిలిబిత్ బీజేపీ ఎంపీ. ఆమె త‌న‌యుడు వ‌రుణ్‌గాంధీ కూడా ఎంపీనే. మేన‌కాగాంధీకి రాజ‌కీయాల్లో ఓ ప్ర‌త్యేక ముద్ర ఉంది. ప‌ర్యావ‌ర‌ణం మూగ‌జీవాల విష‌యంలో ఆమెకంటూ ఓ పేరుంది. అలాంటి మేన‌కాగాంధీ ఇప్పుడో సంచ‌ల‌న విష‌యం చెబుతున్నారు. గాడిద‌పాలు ఆరోగ్యానికి మంచిద‌ని ఇప్ప‌టికే ఖ‌రీదు ఎక్కువైనా కొంద‌రు తాగేస్తున్నారు. కేవ‌లం తాగేందుకే కాదు సౌంద‌ర్య‌పోష‌కంగా కూడా ఆ పాలు శ్రేష్ట‌మ‌న్న‌ది మేన‌కాగాంధీ చెబుతున్న మాట‌.

గాడిద‌పాల‌తో చేసిన స‌బ్బువాడండి. మిల‌మిలా మెరిసిపోతార‌ని మ‌హిళ‌ల‌కు మేన‌కాగాంధీ ఉచిత స‌ల‌హా ఇస్తున్నారు. ప్రపంచంలో అందానికి కొల‌మానంగా ఇప్ప‌టికీ చెప్పుకునే ఈజిప్టు రాణి క్లియోపాత్ర సౌందర్య రహస్యం కూడా గాడిద‌పాలేన‌ట‌. చ‌రిత్ర‌లో ఎక్క‌డా రాయ‌లేదుకానీ మేన‌కాగాంధీ ఇదే మాట చెబుతున్నారు. కేవ‌లం గాడిద‌పాల స‌బ్బు వాడ‌మ‌న‌టంతోనే ఆగ‌లేదు మేన‌కాగాంధీ. లద్దాఖ్‌లోని ఓ వర్గం ప్రజలు గాడిద పాలతో సబ్బులు చేస్తారని మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. ఢిల్లీలో గాడిద పాల సబ్బు రూ.500 ప‌లుకుతోంది. మ‌నం మాత్రం గాడిద మేక‌పాల‌తో ఎందుకు స‌బ్బులు చేయ‌కూడ‌ద‌ని మేన‌కాగాంధీ అడుగుతున్నారు. అవును ఎందుకు ఆల‌స్యం మొద‌లుపెట్టేస్తే పోలా.