చట్టం అందరికీ సమానమే.. రామోజీరావుకు కూడా

By KTV Telugu On 5 April, 2023
image

వైట్‌ అండ్‌ వైట్‌ వేసినా ఆయనొస్తుంటే సింహం నడిచొస్తున్నంత గాంభీర్యం. దశాబ్ధాలపాటు ఆయనంటే అందరికీ భయంతో భక్తితో కూడిన గౌరవం. ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్‌గా, తెలగు మీడియా టైకూన్‌గా ఎదిగిన చెరుకూరి రామోజీరావుని టచ్‌ చేసే సాహసం కూడా ఇప్పటిదాకా చేయలేదెవరూ. ఆయన పచ్చడైనా ఫిల్మ్‌సిటీ అయినా అదో బ్రాండ్‌ అంతే కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు రూల్‌ ఈజ్‌ రూల్‌ అది అందరికీ సమానమే. మనం ఏంచేసినా ఈ భూప్రపంచం ఉన్నన్నాళ్లు మనల్ని ఎవరూ ప్రశ్నించలేరనుకుంటే పొరపాటు. సర్దుకుపోయేవాళ్లే కాదు జగన్‌లాంటి జగమొండి కూడా తగులుతారు.

మార్గదర్శి వ్యవహారంలో ఎప్పట్నించో ఆరోపణలున్నా విషయం కోర్టుదాకా పోయినా అది రామోజీ సామ్రాజ్యంలో భాగం కావటంతో ఏమీ కాదనే అనుకున్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అంతటి మేథావికి కూడా చివరికి కంఠశోషే మిగిలిందనుకున్నారు. కానీ సీఐడీ ఎంక్వయిరీకి ఆయన గదిదాకా పోతుందని ఆ సమయానికి ఆయన నడుముకో బెల్టుతో మంచంమీద కదల్లేని పరిస్థితుల్లో ఉంటారని ఎవరూ ఊహించనైనా లేరు. కానీ అంతటి మహామనిషి ఆ స్టిల్‌లో ఫొటో బయటికొచ్చాక నమ్మకుండా ఎలా ఉంటారు. నడిపేది కోడలయినా మార్గదర్శికి కర్త కర్మ క్రియ అన్నీ రామోజీరావే. పచ్చళ్ల తర్వాత చిట్‌ఫండ్‌తోనే మొదలైంది ఆయన ప్రస్థానం. ఇప్పుడా చిట్‌ఫండ్స్‌ విశ్వసనీయతే బోనులో నిలుచుకుంది. ఎంతటి సవాళ్లనైనా ఎదుర్కునే రామోజీరావుకు సీఐడికి భయపడి మంచం ఎక్కారన్న అపఖ్యాతి వద్దనుకున్నా వచ్చేసింది.

రామోజీరావుకి ఎనిమిదిపదుల వయసు. వృద్ధాప్యం మీదపడ్డాక అనారోగ్యాలు సహజం. ఆ కారణంతోనే ఆయన మంచం మీద ఉంటే అయ్యో అనాల్సిందే. కానీ సీఐడి ఎంక్వయిరీకి ముందే ఆయన ఈ స్టిల్‌ సహజంగానే కొన్ని అనుమానాలకు తావిస్తోంది. ఎల్లోమీడియాకి కేంద్రబిందువు అనుకునే రామోజీరావుని ఓ చూపు చూడాల్సిందేనని జగన్‌ అనుకున్నాక సీఐడీకి గేట్లూ తలుపులూ ఓ లెక్కా. ఆయన ముందు వాలిపోయింది. రఘురామరాజులాంటి వాడికైతే ట్రీట్మెంట్‌ మరోలా ఉండేది. ఎంతచెడ్డా మీడియా అధిపతి కదా అందుకే ఆ మాత్రం మర్యాద మిగిల్చినట్లుంది. మార్గదర్శి నిబంధనలకు లోబడి నిఖార్సుగా నడుస్తుంటే లీగల్‌ ఫైట్‌కి సిద్ధపడాలి. దానిజోలికి ఎవరూ రాకుండా చట్టపరమైన రక్షణపొందాలి. పైగా కేంద్రంతో కేంద్ర పెద్దలతో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పనిగట్టుకుని వేధిస్తుంటే అటువైపునుంచి కూడా నరుక్కురావచ్చు. కానీ సంస్థాగతంగా లోపాలుండటంతో ఏమీ చేయలేని పరిస్థితి రామోజీరావుది. పాపం పగవాడికి కూడా రాకూడదు ఇలాంటి కష్టం!