కాంగ్రెస్ పార్టీని రాజకీయ శత్రువులు ఏమీ చేయలేరు. అసలు ఎవరూ ఏమీ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ తనకి తానే శత్రువు కాంగ్రెస్ పార్టీ తలచుకుంటే కాంగ్రెస్ పార్టీని విజయతీరాల నుంచి కూడా పరాజయాల వైపు నెట్టేయగలదు. ఇంత కంగాళీ పార్టీ ప్రపంచ రాజకీయ చరిత్రలోనే మరోటి లేదంటారు రాజకీయ పండితులు. చేజేతులారా బంగారంలాంటి అవకాశాలను చేజార్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగే లేదు. ఎన్ని దెబ్బలు తిన్నా చేసిన పొరపాట్లే పదే పదే చేయడంలోనూ కాంగ్రెస్ కు ఎవరూ సాటిరారు. ఇపుడు తెలంగాణాలోనూ అదే జరుగుతోంది. తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ నాయకులు చాలా కష్టపడుతున్నారు పాదయాత్రలు చేస్తున్నారు ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నారు. కాని కొందరు నేతలు చేస్తున్న ప్రకటనలతో పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందనే ఆవేదన వ్యక్తం అవుతోంది. ఎంత శ్రమిస్తున్నా వారి మాటలతో తమ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతోందని వాపోతున్నారు. నోరు జారుతున్న ఆ నాయకులు పార్టీకి మేలు చేద్దాం అనుకుంటున్నారో కీడు తలపెడుతున్నారో అర్ధం కావడం లేదంటున్నారు పాత తరం నేతలు.
గడచిన 9 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పోరాడుతూనే ఉంది. మూడోసారి కూడా ఓడిపోతే ఇక పార్టీ పరిస్థితి మరింత జారుతుందని గ్రహించిన టీ.కాంగ్రెస్ నేతలు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీవ్రంగా శ్రమిస్తున్నారు. రకరకాల కార్యక్రమాలతో సీనియర్లంతా రోడ్ల మీద జనంతోనే ఉంటున్నారు. పాదయాత్రలు చేస్తున్నారు. ప్రజలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అయితే కొందరు సీనియర్లు చేస్తున్న వ్యాఖ్యలు మొత్తంగా పార్టీకి నష్టం చేసేవిగా ఉంటున్నాయని గాంధీభవన్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై వేసిన అనర్హతను ఖండించేదుకు ప్రెస్ మీట్ పెట్టారు సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి. అయితే ఇదే సమయంలో జాతీయ స్థాయిలో కలసి వచ్చే పార్టీలతో పనిచేస్తాం ప్రజలు నిర్ణయిస్తే బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని కామెంట్ చేశారు జానారెడ్డి. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కునేందుకు అన్ని పార్టీలను కలుపుకుపోతాం అని జానారెడ్డి చెప్పదలుచుకున్నారు. కానీ మరోరకంగా అర్థం వచ్చేలా వాఖ్యానించడంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణాలు లేకపోలేదు. గతంలోనే కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు అధికార బి.ఆర్.ఎస్. తరపున కోవర్టులుగా పనిచేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ లోని కొందరు సీనియర్ నేతలు కేసీయార్ కనుసన్నల్లో పనిచేస్తూ బి.ఆర్.ఎస్. ప్రయోజనాలు కాపాడేలా పనిచేస్తూ కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడుస్తున్నారన్నది ఆ ఆరోపణల సారాంశం. ఇపుడు జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తోంటే ఆ ఆరోపణలకు బలం చేకూరుతోందంటున్నారు రాజకీయ పండితులు.
ఇప్పటికే బీఆర్ఎస్ టీ కాంగ్రెస్ పొత్తు చర్చ కాంగ్రెస్ కు తీవ్ర నష్టం చేస్తుందని భావిస్తుంటే పొత్తుకు మరింత బలం చేకూర్చేలా జానారెడ్డి చేసిన వాఖ్యలు టీ కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టాయి. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వాఖ్యలు కూడా పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. తెలంగాణలో కాంగ్రెస్ కు 40 నుంచి 50 స్థానాలు వస్తాయని సెక్యులర్ పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని కోమటిరెడ్డి నిజానికి తెలంగాణాలో ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉందని గమనిస్తే ఉన్నంతలో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుందని తేలింది. పార్టీలోని భిన్న ధృవాల్లాంటి నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి కష్టపడితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కూడా అంటున్నారు. కాంగ్రెస్ బలోపేతం అవుతూ ఉంటే బి.ఆర్.ఎస్. బలహీన పడుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బి.ఆర్.ఎస్. తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని అర్ధం వచ్చేలా ఎవరు మాట్లాడినా అది కాంగ్రెస్ పార్టీ అవకాశాలను బుగ్గిపాలు చేయడమే అంటున్నారు రేవంత్ రెడ్డి వర్గీయులు. ఈ సీనియర్ నేతల వ్యాఖ్యలపై పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో వివిధ పార్టీలతో పొత్తుపై చర్చ జరిగేలా కొన్ని రోజులుగా బీఆర్ఎస్ వ్యవహార శైలి ఉంటోంది. రాహుల్ గాంధీపై పార్లమెంట్ లో అనర్హత వేటు విషయంలో సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఖండించారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటోందని సుప్రీం కోర్ట్ లో వేసిన పిటిషన్ లో కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కూడా ఉంది. ఇలా టీ కాంగ్రెస్ నేతలు అప్పుడప్పుడు చేసే వాఖ్యలు, వారు వ్యవహరిస్తున్న తీరు బీఆర్ఎస్ విధానాలు రెండు పార్టీల మధ్య పొత్తు గురించి ప్రజల్లో చర్చ జరిగేలా చేస్తున్నాయి. దీనిపైనే పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. శ్రేణుల్లోనూ ఇటువంటి నేతలపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. పొత్తు అంశంపై చర్చ జరిగితే అది కాంగ్రెస్ కే నష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ నాయకులు చేసే ప్రకటనలు వారి వ్యవహార శైలి వల్ల బీజేపీ పెరిగి అంతిమంగా కాంగ్రెస్‌కే నష్టం కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.