జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సడెన్‌గా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. బీజేపీ పెద్దల అప్పాయింట్‌మెంట్‌కోసం కొన్ని గంటలు వెయిట్ చేశారు. కొందరిని కలిశారు తిరిగొచ్చారు. అసలాయన ఎందుకు వెళ్లినట్లు ఎవరితో ఏం మాట్లాడినట్లు పవన్‌కళ్యాణ్ బీజేపీతోనే కలిసి సాగుతారా అదే జరిగితే టీడీపీ మాటేమిటి తెలుగుదేశంపార్టీని కూడా కలుపుకుని వెళ్లేలా కమలం పార్టీని ఒప్పిస్తారా దానికి బీజేపీ పెద్దలు ఒప్పుకుంటారా పవన్ నాదెండ్లల ఢిల్లీ టూర్ తర్వాత ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు మరిన్నిపెరిగాయి. పవన్‌కళ్యాణ్ టూర్లో ఏపీ రాజకీయాలమీదే ప్రధానంగా చర్చ జరిగిందని చెబుతున్నారు. పవన్‌కళ్యాణ్ కూడా చల్లకొచ్చి ముంత దాచకుండా మనసులో ఉంది చెప్పేశారట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో వైసీపీని ఓడించడమే తన ఏకైక లక్ష్యమని దానికోసం ఎంతదూరమైనా వెళ్తానని జనసేనాని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ బీజేపీ-జనసేన విడివిడిగా పోటీచేస్తే వైసీపీని ఓడించడం సాధ్యంకాదన్న విషయాన్ని మొహవాటం లేకుండా చెప్పేశారట పవన్‌కళ్యాణ్. టీడీపీని కూడా కలుపుకుని వెళ్లేలా వ్యూహం మార్చాలని పవన్‌కళ్యాణ్ చెప్పినట్లు జనసేన వర్గాలు చర్చించుకుంటున్నాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్‌కళ్యాణ్ భేటీ అయ్యారు. టీడీపీతో పొత్తుపై నడ్డా సానుకూలంగా స్పందించలేదని సమాచారం. ప్రస్తుతం ఎవరి పార్టీని వారు బలోపేతం చేసుకోవాలని ఆయన చెప్పారంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు మద్దతివ్వలేదన్న విషయం కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ఏపీ బీజేపీ నేతల తీరే దానికి కారణమని పవన్‌కళ్యాణ్ నడ్డా దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. టీడీపీకి దగ్గరవ్వాలనే ఆలోచనకు కూడా అదేకారణమని పవన్‌కళ్యాణ్ చెప్పారంటున్నారు.
విశాఖ పర్యటనకు వచ్చినప్పుడే ప్రత్యేకంగా పవన్‌కళ్యాణ్‌ని పిలిపించుకుని మాట్లాడారు ప్రధాని మోడీ. కానీ ఢిల్లీ టూర్లో ప్రధాని ఆయన్ని కలవలేదు. హోంమంత్రి అమిత్‌షా కూడా పవన్‌కళ్యాణ్‌కి అప్పాయింట్మెంట్ ఇవ్వలేదు. టీడీపీతో పొత్తు ప్రతిపాదన తీసుకొస్తారనే ఆ ఇద్దరూ పవన్‌కళ్యాణ్‌ని కలవలేదన్న మాట వినిపిస్తోంది. అంతదూరం వెళ్లాక చేతులూపుకుంటూ వస్తే బాగోదని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ని కూడా పవన్‌కళ్యాణ్ కలుసుకున్నారు. పోలవరం పనుల పురోగతిపై చర్చించారు. వాస్తవానికి దగ్గరివాళ్ల ఫంక్షన్లో పాల్గొనేందుకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కి వెళ్లారు పవన్‌కళ్యాణ్. అక్కడ ఉండగానే ఢిల్లీ పెద్దలనుంచి ఫోన్ వచ్చింది. దీంతో వెంటనే ఢిల్లీలో వాలిపోయారు. పొత్తుల విషయంలో ఇప్పుడే తొందరలేకున్నా కర్నాటక ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్ సేవలను వాడుకోవాలనుకుంటోంది బీజేపీ. దీనిపై కూడా పవన్‌తో మాట్లాడి ఉంటారని తన వీలును బట్టి ప్రచారంచేస్తానని పవర్ స్టార్ వారికి హామీ ఇచ్చారన్నది కూడా మరో టాక్.