*టెర్రరిజం పాఠాలు..ప్రమాద ఘంటికలు
*మిషన్-2047.. పీఎఫ్‌ఐ టార్గెట్ ఏంటో తెలుసా!
చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. పిల్లే కదానుకుంటే రేపదే అనకొండ కావచ్చు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై దేశవ్యాప్తదాడులు చూసినవారికి కాస్త అతిశయంగా అనిపించొచ్చుగానీ ఉగ్రజాడలను మొలకల దశాల్లోనే పీకేయాలనుకుంది ప్రభుత్వం. అందుకే అంత సీరియస్‌గా తీసుకుంది. తీగలాగి డొంకంతా కదిపింది. పీఎఫ్‌ఐ ప్రధాని హత్యకు కూడా స్కెచ్ వేసిందంటే నమ్మలేకపోయారెవరూ. ఆ సంస్థకు అంత సీన్ ఉందా అనుకున్నారు. కానీ మిషన్-2047 డాక్యుమెంట్స్‌తో పాటు మూలాలు బయటపడేసరికి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
ఆపరేషన్ అక్టోపస్ తర్వాత PFIతోపాటు దాని అనుబంద సంస్థలను కేంద్రం 5 ఏళ్లు నిషేధించింది. అతివాద ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను అన్‌లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ -1967 కింద బ్యాన్ చేసింది. అనుబంధంగా ఉన్న మరో ఏడు సంస్థలని కూడా నిషేధించింది. నిషేధిత ఉగ్రసంస్థ సిమికి మారుపేరుగా PFI పన్నాగాలు ఒక్కోటీ బయటపడుతున్నాయి. వారం వ్యవధిలో రెండు సార్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన ఎన్‌ఐఏ 250 మందిని అరెస్ట్ చేసింది.
పీఎఫ్‌ఐ పెట్టుకున్న లక్ష్యమేంటో తెలుసా. 2047 కల్లా భారత్‌ని ఇస్లామిక్ స్టేట్‌గా మార్చడం. సాధ్యమా కాదా? అనుకోగానే అయిపోతుందా? లాంటి ప్రశ్నలు తర్వాత. అసలు అలాంటి ఆలోచనే ప్రమాదకరం. దక్షిణభారతంలోని మూడు ముస్లిం సంస్థలు కలసి 2007లో పీఎఫ్‌ఐగా ఏర్పడ్డాయి. కేరళ నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్, కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ, తమిళనాడులోని మనితా నీతి పసరాయ్ సంస్థలు ఒక్కటికాగానే అలాంటి భావజాలం ఉన్న సంస్థలన్నీ వీటిలో కలిసిపోయాయి. సంస్థ హెడ్‌క్వార్టర్స్ కేరళ నుంచి న్యూఢిల్లీకి మారింది. 17రాష్ట్రాలకు విస్తరించిన పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థల జెండా, ఎజెండా ఒక్కటే. హింసని ప్రేరేపించడం, కల్లోలాన్ని సృష్టించటం. పాట్నాలో బీజేపీ ర్యాలీలో ప్రధానిపై దాడికి కూడా పీఎఫ్ఐ కుట్ర చేసింది. కొంత కాలంగా సంస్థ ఖాతాల్లోకి 120 కోట్లకుపైగా నగదు జమయింది. సేవా కార్యక్రమాల ముసుగులో టెర్రరిస్టులను తయారుచేసే ఫ్యాక్టరీగా మారిపోయింది. అందుకే పీఎఫ్‌ఐపై కేంద్రం ఉక్కుపాదం మోపింది.
– అన్నన్నా పెద్దన్నా.. ఇది న్యాయమేనా?
– USA అంటే యూజ్ అండ్ త్రో పాలసీ
– ఏ ఎండకాగొడుగు.. దటీజ్ అమెరికా!
అమెరికా మైండ్‌సెట్ ఎలా ఉంటుందో అప్పుడే అల్జీమర్స్ వచ్చేసిన ఆ దేశ అధ్యక్షుడు బైడెనే ప్రత్యక్ష నిదర్శనం. భారత్ మంచి మిత్రుడని ఆకాశానికి ఎత్తేయడమే కాదు.. మన శత్రువుల్ని ఒళ్లో కూర్చోబెట్టుకునేంత పెద్ద మనసుంది అగ్రరాజ్యానికి. నక్కజిత్తుల దాయాది దేశానికి అమెరికా ఆయుధాలు అందిస్తోంది. ఆర్థికసంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్‌కి తగుదునమ్మా అంటూ ఎఫ్-16 యుద్ధ విమానాలను సరఫరా చేస్తోంది. భారత్ అభ్యంతరం వ్యక్తంచేసినా భయపడాల్సిందేమీ లేదన్నట్లు బొంకుతోంది.
తినేందుకు తిండిలేకపోయినా, ఒంటిమీద చిరుగులచొక్కా మిగిలినా పాకిస్తాన్ బుద్ది మారలేదు. భారత్‌పై విషం చిమ్ముతూనే ఉంది. ఉగ్రవాదుల్ని కశ్మీర్‌లోకి ఉసిగొల్పుతోంది. ఇప్పటికే చైనాకి దగ్గరైపోయిన పాకిస్తాన్ అమెరికాతోనూ ఇచ్చిపుచ్చుకుంటోంది. ఆర్థికపరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన సమయంలో అమెరికానుంచి పాకిస్తాన్ ఆయుధాలు ఎందుకు తీసుకుంటోందో చంటిపిల్లాడికి కూడా తెలిసిపోతోంది. ఉగ్రవాదంపై పోరాడేందుకే ఫైటర్ జెట్‌లను ఇస్తున్నామని తన చర్యను అమెరికా సమర్థించుకుంటోంది. దొంగ చేతికి తాళాలిస్తూ భద్రంగా చూసుకోమన్నట్లే ఉంది అగ్రరాజ్యం వరస.
అనుమానమే లేదు. పాకిస్తాన్‌కు ఎఫ్-16 విమానాలు పిచ్చోడి చేతిలో రాళ్లలాంటివే. వందలమంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు పుట్టినిల్లుగా ఉంది పాకిస్తాన్. ఇప్పుడు ఆయుధసాయం చేస్తున్న అమెరికా కూడా బిన్‌లాడెన్‌ని పాకిస్తాన్ గడ్డపైనే మట్టుబెట్టింది. అయినా ఫైటర్ జెట్లు ఇస్తోందంటేనే అమెరికా దురుద్దేశం అర్ధమైపోతుంది. ప్రపంచ దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం, ప్రచ్ఛన్నయుద్ధాలను ప్రోత్సహించడం, ఆయుధాలు అమ్ముకోవడం అమెరికాకు గన్నుతో పెట్టిన విద్య. రష్యానుంచి మనం చమురు కొనుక్కోవడం అమెరికాకు అస్సలు ఇష్టంలేదు. అందుకే భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు పాకిస్తాన్‌ని దువ్వుతోంది.
1980కి ముందు అమెరికా పాకిస్థాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలు అమ్మింది. 2018లో ట్రంప్ హయాంలో ఎఫ్-16 ఫైటర్ జెట్‌లు నిలిపేశారు. ఉగ్రవాద గ్రూపులను పాక్ పెంచిపోషిస్తోందనే కారణంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. నాలుగేళ్లలో పాకిస్తాన్‌లో పరిస్థితులేం మారలేదు. అయినా అమెరికా మళ్లీ ఫైటర్ జెట్లు ఇస్తుండటం వెనుక దురుద్దేశమే కనిపిస్తోంది. 2019 మార్చిలో ఈ ఎఫ్-16 జెట్లతోనే సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపులకు దిగింది. పాకిస్తాన్ దగ్గర ఆ యుద్ధవిమానాలు పెరగడం భారత్‌కు ముప్పేననటంలో ఎలాంటి సందేహంలేదు. ఇప్పటికే ఆప్ఘన్‌లో తాలిబాన్ల రాజ్యం నడుస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆయుధసంపత్తి పెంచుకోవటం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. పాకిస్తాన్ హద్దుమీరితే దాని మెడలు ఎలావంచాలో భారత్‌కి తెలుసు. కానీ నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించే పెద్దన్న వైఖరే బాధాకరం.