భారత్‌లో మీడియా స్వేచ్ఛప్రమాదంలో ఉంది. అంతర్జాతీయ సంస్థలు పదేపదే వేలెత్తిచూపిస్తున్నా పాలకుల ధోరణిమారడం లేదు. మీడియా ప్రతినిధులను అరెస్ట్‌చేయడం జాతీయభద్రత పేరుతో గొంతునొక్కేయడం వంటిచర్యలు గతంలో ఎప్పుడూ చూడలేదు. ఎమర్జన్సీలో భావస్వేచ్ఛను హరించారని రాక్షసంగా వ్యవహరించారని గుర్తుచేసే కేంద్ర పెద్దలు తమ ఏలుబడిలో ఏం జరుగుతోందో మరిచిపోతున్నారు. అందుకే అత్యున్నత న్యాయస్థానం కూడా దేశంలో మీడియా స్వేచ్ఛపై తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీడియా సంస్థల గొంతు నొక్కుతారా కేంద్రానికి సుప్రీంకోర్టు వేసిన సూటి ప్రశ్న ఇది.
దేశప్రయోజనాలు ముఖ్యమే. కానీ అదే సమయంలో జాతీయభద్రత పేరుతో మీడియాకు సంకెళ్లువేసే ప్రయత్నం తగదంటోంది సుప్రీంకోర్టు. మలయాళ న్యూస్ చానెల్ మీద కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సుప్రీం రద్దు చేసింది. 2020లో పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ఆందోళనలను పదేపదే ప్రసారం చేసిందన్న కారణంతో మీడియా వన్ చానల్‌పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. దీనిపై చానల్ యాజమాన్యం న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో కేంద్రం చర్యను సుప్రీం తప్పుపట్టింది.
జాతీయభద్రతపై ఊహాగానాలతో వాదనలు చేయడం సరికాదని సుప్రీం తేల్చిచెప్పింది. ఆ ఛానల్‌పై మోపిన అభియోగాల్లో ఏ అంశం కూడా జాతీయ భద్రతకు విరుద్ధంగానో ప్రజా శాంతికి ముప్పు కలిగించేదో కాదని తీర్పు చెప్పింది. ప్రభుత్వంపై విమర్శలు టీవీ ఛానల్ లైసెన్సు రద్దుకు కారణం కాకూడదని సుప్రీం స్పష్టంచేసింది. ఈ ఒక్క ఘటనే కాదు దేశంలో ఈమధ్య జర్నలిస్టులను జైళ్లలో వేసే సంస్కృతి పెరుగుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో పడిందని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వరుసగా రెండు సంవత్సరాలు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో 2016నుంచి భారత్ స్థానం దిగజారుతూనే వస్తోంది.