చంద్రబాబు హైటెక్ ప్రసంగం

By KTV Telugu On 6 April, 2023
image

హై టెక్ సిఎంగా పేరు సొంతం చేసుకున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికీ టెక్నాలజీపై తనకున్న పట్టును చాటుకుంటున్నారు. విశాఖ జిల్లాలో పార్టీ నేతలతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు   సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోడానికి టెక్నాలజీలో ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలని శ్రేణులకు పిలుపు నిచ్చారు. డిజిటల్ ఫార్మేట్లతో పాటు సోషల్ మీడియాలో వస్తోన్న మార్పుల గురించీ కూడా ఆయన సాధికారికంగా మాట్లాడ్డం అందరినీ ఆకట్టుకుంది. n2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబు నాయుడు చాలా కష్టపడుతున్నారు. ఏడు పదుల వయసు దాటినా ఆయనలో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. విశాఖ జిల్లాలో నేతల పనితీరును సమీక్షించేందుకు ఉద్దేశించిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు చాలా ఓపిగ్గా సుదీర్ఢంగా ప్రసంగించారు. పాలకపక్షం ఎత్తులను ఎప్పటికప్పుడు చిత్తు చేయాలని బోధించిన చంద్రబాబు నాయుడు పార్టీలోపై స్థాయి నుండి కింది స్థాయి వరకు ఏదైనా ఓకార్యక్రమం గురించి చెప్పాలనుకున్నప్పుడు టెక్నాలజీని బాగా వినియోగించుకోవాలని చెప్పారు. ఫేస్ బుక్ ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ టెలిగ్రామ్ లతో పాటు యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్ ఫారాలను కూడా పూర్తిగా వాడుకోవాలని చంద్రబాబు సోదాహరణగా చెప్పి సాంకేతికంగా ఆయన యువత కన్నా కూడా అప్డేట్ గా ఉన్నారని చాటి చెప్పుకున్నారు.

ప్రతీ ఇంటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాన్ని చెప్పి మనకి ఓటు ఎందుకు వేయాలో వివరించాలని చెప్పిన చంద్రబాబు ప్రతీ వంద ఇళ్లకూ ఒక్కరు చొప్పున సాధికారిక సారధులను నియమించుకోవాలన్నారు. ఆ సారధితో పాటు ఒక మహిళను కూడా నియమించాలన్నారు. ప్రతీ ఇంటికీ కార్యకర్తలు తిరుగుతున్నారో లేదో తెలుసుకోడానికి కొన్ని యాప్ లను రూపొందించామని వివరించారు. ఆ యాప్ లను ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకుంటే కార్యకర్తలు ఓఇంటి ఎదురుగా నిలబడితే గూగుల్ మ్యాప్ ద్వారా అతను ఎక్కడ ఉన్నాడో కూడా పార్టీ నేతలకు తెలిసిపోతుందని చంద్రబాబు వివరించారు. గతంలో మాదిరిగా కార్యకర్తలు తమ ఇంట్లో కూర్చుని ఇళ్లన్నీ తిరిగేశాం అని చెప్పడానికి వీలు ఉండదని అన్నారు. గూగుల్ మ్యాపింగ్ లో ఇంటి చిరునామాతో పాటు ఆ ఇంట్లో ఉండే ఓటర్ల వివరాలు కూడా ఫోనులో కనిపించేలా యాప్ తయారు చేయిస్తున్నామన్నారు. సోషల్ మీడియా ద్వారా రియల్ టైమ్ లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయచ్చన్నారు. రెగ్యులర్ గా పార్టీ సమావేశాలు నిర్వహించుకుంటూనే అత్యవసర సమయాల్లో వర్చువల్ మీటింగ్స్‌ ద్వారా కీలక నేతలతో చర్చించి అప్పటికప్పుడు వారి అభిప్రాయాలను తెలుసుకుని వాటికి అనుగుణంగా నిర్ణయాలు కూడా తీసుకోవచ్చునని చంద్రబాబు నాయుడు వివరించారు.

ఇవన్నీ చెబుతన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ఐటీ ప్రొఫెసర్ లా సాధికారికంగా చెప్పడమే కాదు చిన్న పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పే మాస్టారిలా చాలా ఓపిగ్గా  చెప్పుకుపోయారు. పార్టీ గెలవడానికి కలిసొచ్చే ఏ చిన్న అంశాన్నీ వదలకూడదన్న పట్టుదల కసి ఆయనకు ఈ వయసులో కూడా ఉండడం నిజంగా అద్భుతమే అంటున్నారు రాజకీయ పండితులు. టెక్నాలజీ గురించి క్లాస్ తీసుకుంటూనే మరో వైపు పాలక పక్షం దాష్టీకాలకు తెగబడితే గట్టిగా ప్రతిఘటించాలని నూరిపోశారు. ప్రతీ కార్యకర్తా సుశిక్షితుడైన సైనికుడిలా పనిచేయాలని పిలుపు నిచ్చారు. పార్టీలో లీగల్ సెల్ చాలా పటిష్ఠంగా ఉందన్నారు చంద్రబాబు. ఏ పార్టీలోనూ లేనంత బలంగా టిడిపి లీగల్ సెల్ పనిచేస్తోందన్నారు. తన రాజకీయ జీవితంలో ఇంత వరకు లీగల్ సెల్ అవసరమే రాలేదన్న చంద్రబాబు నాయుడు 2019లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ నాలుగేళ్లలో లీగల్ సెల్ అవసరం రోజు రోజుకీ పెరిగిపోతోందన్నారు. పార్టీ నేతలు అచ్చెంనాయుడు అయ్యన్న పాత్రుడు కొల్లి రవీంద్ర పట్టాభి వంటి టిడిపి నేతలపై వివిధ ఆరోపణలపై కేసులు నమోదు చేసి దర్యాప్తులు చేస్తోన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు లీగల్ సెల్ ఆవశ్యకతను వివరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక ఈ సమావేశంలో అందరి దృష్టినీ ఆకర్షించింది ఇద్దరు నేతల మధ్య నడిచిన కోల్డ్ వారే. పార్టీలో సీనియర్లు అయిన అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావులు పరస్పరం ఒకరిపై ఒకరు చంద్రబాబు నాయుడికి ఫిర్యాదులు చేసుకుంటూ పోతున్నారని సమాచారం. ఈ సమావేశానికి అసలు గంటాను పిలవడంపైనే అయ్యన్న పాత్రుడు మండి పడుతున్నారని సమాచారం. 2019లో టిడిపి ఓటమి చెందిన మరుక్షణం నుంచే గంటా శ్రీనివాసరావు టిడిపికి దూరం జరిగిపోయారని అయ్యన్న అభియోగం. నాలుగేళ్లుగా పార్టీ సంక్షోభంలో ఉన్నా గంటా ఏనాడూ పట్టించుకోలేదని అయ్యన్న ఆరోపించారు. సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినపుడు కూడా గంటా అధినేత కార్యక్రమాలకు హాజరు కాకుండా ఇంట్లోనే కూర్చుని అవమానించారని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి గంటాకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది అయ్యన్న ప్రశ్న. ఎన్నికలు ఏడాది లో ఉన్న తరుణంలో ఇపుడు గంటా పార్టీలో యాక్టివ్ గా ఉన్నట్లు నటిస్తున్నారని ఆటువంటి నేతలను పక్కన పెట్టాల్సిందేనని అయ్యన్న పట్టుబట్టారట. గంటాను పిలిస్తే అసలు ఈ సమావేశానికి తాను రానని ఇంట్లోనే ఉంటానని కూడా అల్టిమేటం ఇచ్చారట. అయితే చంద్రబాబు మాత్రం గంటాను పిలవడం మానలేదు. ఇటు అయ్యన్న కూడా గంటా వచ్చినా తాను రావడం మానలేదు. ఎన్నికలు అయ్యే వరకు కూల్ గా ఉండి ఎన్నికల సమయంలోనే అప్పటి పరిస్థితులను బట్టి గంటాపై నిర్ణయం తీసుకోవాలన్నది చంద్రబాబు నాయుడి వ్యూహంగా చెబుతున్నారు.

ఒక వేళ గంటాకు టికెట్ ఇస్తేనే ఓ నియోజకవర్గంలో పార్టీ గెలుస్తుందని అనిపిస్తే గంటాకు టికెట్ ఇవ్వడానికి కూడా ఆయన వెనుకాడరని అంటున్నారు. పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చాక కావాలంటే గంటాకు మంత్రి పదవులు ఇవ్వకుండా పక్కన పెట్టచ్చన్నది చంద్రబాబు మార్క్ చాణక్యం అంటున్నారు. చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం పార్టీనేతల్లో ఉత్సాహాన్ని నింపింది. వారికి దిశానిర్దేశనం చేయడంలో చంద్రబాబు విజయవంతమయ్యారు. అనుకున్నది అనుకున్నట్లు పార్టీ నేతలకు తెలియ జెప్పడంలో సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ అడ్వర్టైజ్ మెంట్ లా చంద్రబాబు నాయడు పెర్ఫెక్ట్ గా వ్యవహరించారు. చాలా కాలం తర్వాత చంద్రబాబు లో ఇటువంటి స్పిరిట్ కనిపించందని పార్టీ నేతలు సైతం పొంగిపోతున్నారు. చంద్రబాబు నాయుడు ఇటువంటి విజన్ తో ఉంటే టిడిపిని కొట్టడం ఎవరి తరమూ కాదని టిడిపి సీనియర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అయ్యన్న పాత్రుడికి తెలీక కాదు. గంటాపై అలక ముసుగలో తన కుమారుడు చింతకాయల విజయ్ కు ఎంపీ సీటు తనకు ఎమ్మెల్యే సీటూ ఖరారు చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడిపై ఒత్తిడి పెంచడానికే ఇలా వ్యవహరిస్తున్నారని అయ్యన్న రాజకీయాల గురించి బాగా తెలిసిన వారు అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి మొదట్నుంచీ కూడా ఉత్తరాంధ్ర కంచుకోట. మొదటి సారి దాన్ని 2019లో జగన్ మోహన్ రెడ్డి బద్దలు కొట్టారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి ఉత్తరాంధ్రలో పాగా వేస్తేనే కానీ టిడిపి అధికారంలోకి రావడం కష్టమని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఉత్తరాంధ్రలో ప్రతీ ఒక్క నియోజకవర్గానికి ప్రత్యేక వ్యూహాలు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆయన పంతంగా ఉన్నారు.