ట్రంప్ అరెస్ట్.. పోర్న్ స్టార్ కు అనైతిక చెల్లింపులు

By KTV Telugu On 6 April, 2023
image

డొనాల్డ్ ట్రంప్ వివాదం రెండూ కూడా జంట పదాలే అంటారు అమెరికన్ భాషా శాస్త్రవేత్తలు. తరచుగా వివాదాలు రాజేసే ట్రంప్ తాజాగా కోర్టు గుమ్మం తొక్కి తానే ఓ సంచలన వార్త అయ్యారు. పూర్వాశ్రమంలో ఓ పోర్న్ స్టార్ తో ట్రంప్ కు ఉన్న సంబంధాన్ని 2016 ఎన్నికల్లో గోప్యంగా ఉంచేందుకు ఓన్యాయవాది ద్వారా ట్రంప్ పెద్ద మొత్తంలోనే డబ్బు చెల్లించారని ఆరోపణ. అది కూడా అనైతికంగా వ్యవహారాన్ని నడిపారని నిర్ధరణ కూడా అయ్యింది. దాంతో ట్రంప్ అరెస్ట్ అయ్యారు. ఆ వెంటనే విడుదల అయ్యారు. అమెరికాలో ఏ మాజీ అధ్యక్షుడిపైనా లేని ఓ మరక ఇపుడు డొనాల్డ్ ట్రంప్ పై పడిపోయింది. ఒక కేసులో అరెస్ట్ అయిన మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. ఇంతకీ ట్రంప్ పై వచ్చిన అభియోగాలు ఏంటి దానికి ఆయన సమాధానాలు ఏంటి అన్నవి చూస్తే డొనాల్డ్ ట్రంప్ తో తనకు అఫైర్ ఉందని అమెరికన్ యాక్ట్రెస్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ ఓపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. 2006లో ట్రంప్ తో తనకు పరిచయం అయ్యిందని ఆ తర్వాత ట్రంప్ కు సంబంధించిన హోటల్ రూమ్ లో ట్రంప్ తనతో గడిపారని డేనియల్ అంటోంది. అయితే తన అఫైర్ స్టోరీని ఓ మీడియాకు విక్రయించడానికి డేనియల్ సిద్ధ పడింది. ఇది జరుగుతోన్న సమయంలోనే 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార ఘట్టం చివరి దశలో ఉంది. దీంతో తనతో ఉన్న అఫైర్ గురించి ఎక్కడా మాట్లాడకూడదని ట్రంప్ ఒక లక్షా 30 వేల అమెరికన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించారని డేనియల్ ఆరోపించింది. ట్రంప్ తరపు న్యాయవాది మేకేల్ కోహెన్ ద్వారా ట్రంప్ ఈ డబ్బు పంపించాడని డేనియల్స్ చెప్పుకొచ్చింది.

2016 అధ్యక్ష ఎన్నికల్లో ఇబ్బందులు రాకూడదనే డేనియల్స్ నోరు మూయించిన ట్రంప్ ఆఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడయ్యారు. అయితే 2018లో ఆర్ధిక అవకతవకలతో పాటు కొన్ని నేరారోపణలపై ట్రంప్ తరపు న్యాయవాది కోహెన్ ను అరెస్ట్ చేశారు. అప్పుడు కోహెన్ ను పోలీసులు విచారించినపుడు డేనియల్ కు డబ్బుచెల్లింపు వ్యవహారంలో ట్రంప్ కు ఎలాంటి సంబంధం లేదని ముందుగా కోహెన్ దబాయించాడు. తానే తన సొంత డబ్బును డేనియల్స్ కు ఇచ్చానని కోహెన్ అన్నాడు. అయితే ఆ తర్వాత డేనియల్స్ కు చెల్లించిన లక్షా 30 వేల డాలర్ల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీసేసరికి ట్రంప్ చెబితేనే తాను ఆమెకు ఇచ్చానని కోహెన్ ఒప్పుకున్నాడు. ట్రంప్ ఈ డబ్బును ఎక్కడి నుంచి ఇచ్చారన్నది ఆరా తీశారు. ఈ డబ్బును ట్రంప్ ప్రచార నిధి నుంచి కాకుండా తన సొంత ఖాతాలోంచి ఇచ్చారని తేలింది. అకౌంట్స్ బుక్స్ లో మాత్రం ఆ ఖర్చును వేరే పేరుతో చూపించినట్లు కూడా తేలింది. కోహెన్ నేరాలు అంగీకరించడంతో మూడేళ్ల జైలు శిక్ష పడింది. 2019లో అనైతిక చెల్లింపుల కు సంబంధించిన రికార్డులను సమర్పించాల్సిందిగా మన్ హట్టన్ కోర్టు ఆదేశించింది. ఆ మరుసటి ఏడాదే ట్రంప్ పన్నుల ఎగవేత కుంభకోణానికి పాల్పడ్డారని నిర్ధరణ అయ్యింది.

ఈ ఏడాది జనవరిలో ట్రంప్ అనైతిక చెల్లింపుల వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని గ్రాండ్ జ్యూరీకి సమర్పించారు. గత మార్చ్ నెలలో జ్యూరీ ముందు హాజరు కావల్సిందిగా ట్రంప్ ను జ్యూరీ ఆదేశించింది. అయితే దానికి ట్రంప్ నిరాకరించి జ్యూరీ ముందు హాజరు కాలేదు. దీన్ని ఇలాగే సాగదీస్తే కఠిన చర్యలు తప్పవని భయపడ్డారో లేక ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దీన్ని అడ్డుపెట్టుకుని వార్తల్లోకి ఎక్కాలనుకున్నారో తెలీదు కానీ ట్రంప్ మాత్రం తన సొంత విమానంలో మన్ హట్టన్ కోర్టు కు స్వచ్ఛందంగా వచ్చి పోలీసులకు లొంగిపోయారు. వెంటనే పోలీసులు ట్రంప్ ను న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. ట్రంప్ పై అధికారులు మోపిన 34 అభియోగాలను న్యాయమూర్తి ట్రంప్ కు వినిపించారు. దీనికి ఏమంటావ్ అన్నట్లు చూశారు. తనపై మోపిన అభియోగాల్లో తాను ఏ తప్పూ చేయలేదని ట్రంప్ వివరణ ఇచ్చుకున్నారు. అమెరికా చట్టాల ప్రకారం ఇటువంటి కేసుల్లో రిమాండ్ విధించే వీలు ఉండదు కాబట్టి అరెస్ట్ అయిన ట్రంప్ కోర్టులో తన వాదన వినిపించిన తర్వాత విడుదలై ఇంటికి వెళ్లిపోయారు. ట్రంప్ అరెస్ట్ నేపథ్యంలో ముందస్తుగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాన రహదారుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ పాల్పడకుండా పోలీసులను మోహరించారు. మన్ హట్టన్ కోర్టు పరిసర ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున బలగాలు మోహరించారు. ట్రంప్ కు మద్దతుగా రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు ట్రంప్ అనుచరులు కొద్ది సేపు నినాదాలతో హడావిడి చేశారు. 2024లో అధ్యక్షుడు కాబోయేది ట్రంపేనని వారు నినదించారు. అధికారంలో ఉన్న డెమాక్రటిక్ పార్టీ కక్ష సాధింపు చర్యగానే తమ నాయకుడిపై కేసులు పెట్టి వేధిస్తోందని వారు ఆరోపించారు.

కోర్టు నుండి బయటకు వచ్చిన తర్వాత ట్రంప్ మాట్లాడుతూ  ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన అమెరికాలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని తాను కలలో కూడా ఊహించలేదని ట్రంప్ ఆక్రోశించారు. దేశాధ్యక్షుడు బైడెన్ పాలనలో అమెరికా సర్వనాశనం అయిపోయిందని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ట్రంప్. దుష్టశక్తుల బారి నుండి దేశాన్ని కాపాడుకోడానికి ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడ్డమే తాను చేసిన నేరమైపోయిందని ట్రంప్ సెటైర్ వేశారు. ఎవరు ఎన్ని విధాలుగా వేధించినా వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల అనంతరం వైట్ హౌస్ లో కొలువు తీరేది మనమే అని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ ప్రభుత్వంపై ట్రంప్ విరుచుకు పడ్డారు. రాజకీయంగా తనను ఉద్దేశ పూర్వకంగానే దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇదంతా బైడెన్ కనుసన్నల్లోనే జరుగుతోందని ట్రంప్ దుయ్యబట్టారు. ట్రంప్ ఆరోపణలపై అధ్యక్షుడు జో బైడెన్ ను ప్రశ్నించగా ఆయన నో కామెంట్ అని మాత్రమే అని మీడియా నుండి దూరంగా వెళ్లిపోయారు. అమెరికా చరిత్రలోనే ఓ మాజీ అధ్యక్షుడు నేరారోపణలతో అరెస్ట్ కావడం ఇదే మొదటి సారి. అయితే అమెరికా చట్టాల ప్రకారం వచ్చే ఎన్నికల్లో ట్రంప్ పై అనర్హత వేటు పడే అవకాశాలు లేవని నిపుణులు అంటున్నారు. కాకపోతే దేశ ప్రజలు ట్రంప్ గురించి ఏమనుకుంటున్నారన్నదే వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. అంచేత ట్రంప్ వచ్చే ఎన్నికల్లో దర్జాగా పోటీ చేసే అవకాశాలయితే ఉన్నాయంటున్నారు. నిజానికి అనైతిక చెల్లింపుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటోన్న డొనాల్డ్ ట్రంప్ స్వయంగా కోర్టు ముందు హాజరు కావల్సిన అవసరమే లేదు. తన తరపున న్యాయవాదిని పంపిస్తే సరిపోతుంది. అయినా ట్రంప్ తన నివాసం నుండి మన్ హట్టన్ వరకు ఆర్భాటంగా రావడం వెనుక బలమైన వ్యూహమే ఉంది. ఈ ఘటనను కూడా ట్రంప్ పెద్ద ఈవెంట్ గా మార్చేయాలని అనుకున్నారు. దాంతో తనపేరు ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా మార్మోగుతుంది. చాలా కాలంగా తనని మర్చిపోయిన వారు కూడా తనని తలచుకునే అవకాశం ఉంటుంది.

అదే సమయంలో బైడెన్ ప్రభుత్వం తనను రాజకీయంగా వేధిస్తోందన్న ఆరోపణతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ప్రజల నుండి సానుభూతి పొందచ్చని ట్రంప్ భావించి ఉండచ్చంటున్నారు. స్టార్మీ డేనియల్స్ తో ట్రంప్ కు ఉన్న అఫైర్ వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యవహారమే తప్ప అది నేరం కాదు. అమెరికా చట్టాలు కూడా అదే చెబుతున్నాయి. కాకపోతే ఇందులో నేతల నైతికత గురించి ఆలోచన చేసేది ప్రజలే. ఇటువంటి కేసుల్లో తమ పాలకులు ఎలాంటి పాలన అందింస్తారన్నదాన్నే ప్రజలు చూస్తారు కానీ నేతల వ్యక్తిగత జీవితాల్లోని అఫైర్ల గురించి పట్టించుకోరు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మోనికా లూయిన్ స్కీ కేసులో ప్రజలు క్లింటన్ ను తప్పు బట్టలేదు. మరి ట్రంప్ విషయంలో అమెరికా ప్రజలు ఎలా ఆలోచిస్తారనేది చూడాల్సి ఉంది. అమెరికాలో దర్యాప్తు సంస్థలు కూడా ట్రంప్ అఫైర్ గురించి ఆరాలు తీయలేదు. ట్రంప్ స్టార్మీ డేనియల్స్ తోనే కాదు చాలా మంది మహిళలతో అఫైర్లు కొనసాగించారు. ఆ విషయాన్ని ఆయనే సగర్వంగా చాలా సందర్బాల్లో చెప్పుకుని మురిసిపోయారు. డేనియల్స్ తో ట్రంప్ కు ఉన్న సంబంధాల జోలికి పోని అధికారులు ఆమె కు చేసిన చెల్లింపుల వ్యవహారాన్ని ట్రంప్ తన బిజినెస్ బుక్స్ లో చూపించారా దాచి పెట్టారా అన్న కోణంలోనే దర్యాప్తు చేశారు. రాజకీయ నేతలకు ఒక్కోసారి కేసులు కూడా అనుకోని వరాలు అవుతాయి. ట్రంప్ విషయంలో తాజా కేసు కూడా ఆయనకు సొంత పార్టీలో ఇమేజ్ పెరగడానికి దోహద పడుతుందన్నది ఓక లాజిక్. వాస్తవంలోకి వచ్చేసరికి ఆ లాజిక్ నిలబడుతుందా లేదా అన్నది కాలమే చెప్పాలంటున్నారు రాజకీయ పండితులు.