విచారణకు వెళ్లేముందు పిడికిలి బిగించినా సాక్ష్యాలు వెంటాడుతున్నాయి. మూడుసార్లు ఎంక్వయిరీకి వెళ్లి కొన్ని గంటల తర్వాత బయటికొచ్చినా ఈసారి ఎలా ఉంటుందో తెలీదు. కల్వకుంట్ల కవితకే కాదు కేసీఆర్ కుటుంబానికే పెద్ద సవాలుగా మారింది ఢిల్లీ లిక్కర్‌స్కామ్. స్కామ్‌లో కీలకంగా ఉన్న సౌత్‌గ్రూప్‌లో కవితే కేంద్ర బిందువంటోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మిగిలిన నిందితుల రిమాండ్ రిపోర్టుల్లోనూ పదేపదే కేసీఆర్ కూతురు పేరుని ప్రస్తావించింది. ఆమెపై తీవ్ర అభియోగాలు మోపింది. అందుకే విచారణకు వెళ్లిన ప్రతీసారీ ఆమె అరెస్ట్ ఖాయమన్న ప్రచారం జరిగింది. ఈ కేసులో నెక్ట్స్ ఎపిసోడ్ ఇప్పటిదాకా ఓ లెక్క ఇకపైన మరో లెక్క అన్నట్లు ఉండబోతోంది.
కవితను మళ్లీ ఏ క్షణమైనా ఈడీ విచారణకు పిలిచేలా ఉంది. కేసీఆర్ కూతురు కూడా దానికి మానసికంగా సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధికారిక ట్విటర్ హ్యాండిల్లో పోస్ట్ అయిన ఓ వీడియో కేసీఆర్ అండ్ కోకి కలవరం కలిగిస్తోంది. 96 సెకన్ల ఈ వీడియోలో కల్వకుంట్ల కవితతో పాటు కేసీఆర్ కుటుంబాన్నే టార్గెట్ చేసుకుంది బీజేపీ. బండి సంజయ్ అరెస్టుతో తెలంగాణ రాజకీయం వేడెక్కిన సమయంలోనే ట్విటర్లో ఈ వీడియోని బీజేపీ పోస్ట్ చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన కూతురు కవిత ఢిల్లీ పంజాబ్ ముఖ్యమంత్రులు ఈ యానిమేషన్ వీడియోలో కనిపిస్తున్నారు. ఆ వీడియో టైటిల్ తెలంగాణకా ఖజానా. ధనరాశుల మధ్య కవిత క్యారికేచర్ ఉన్నట్లు చూపించిన ఈ వీడియోలో TRS 51 KTR నెంబరు ప్లేట్ కారులో నుంచి కేసీఆర్ క్యారికేచర్ దిగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ సూట్ కేసులోంచి తీసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ పథకాల బాక్సుల్లో వేసి కేసీఆర్ తన ఖజానా నింపుకుంటున్నట్లు ఈ వీడియోని చిత్రీకరించారు.
నగలు నగదు కట్టల మధ్య కవిత క్యారికేచర్ ఆ సంపదని లెక్కపెట్టుకుంటున్నట్లు తర్వాతి సీన్ ఉంది. ఆమె ఎదురుగా ఉన్న ట్రేలోని ఏడు ఫోన్లు మోగుతుంటే ఆమె ఒక్కోటీ ఎత్తుతూ చిరాకుగా ఆఫ్ చేసి పక్కన పడేస్తుంటారు. రెండు ఫోన్లకు మాత్రం సమాధానం ఇచ్చి పక్కన పెడతారు. కేంద్రం ఇచ్చే నిధులను బీఆర్ఎస్ ఖజానాకు కేసీఆర్ మళ్లిస్తుంటారు. గ్రామ పంచాయతీ నిధుల సూట్ కేసును సైతం స్వాహా చేసినట్లు ఈ యానిమేషన్లో చూపించారు. కుప్పలుగా పోగైన నగదు నగలను లెక్కేసుకుంటూ మురిసిపోతుంటారు. ప్రధాని కుర్చీలో కూర్చున్నట్లు కేసీఆర్ క్యారికేచర్ కలలు కంటోందని చూపించారు. అక్రమంగా సంపాదించినదాన్నంతా జాతీయపార్టీకి మళ్లించినట్లు పార్టీ ప్రకటన వేళ ఢిల్లీ పంజాబ్ ముఖ్యమంత్రులతోపాటు కవిత చప్పట్లు కొడుతూ సంతోషపడ్డట్లు యానిమేషన్ ఉంది. ఇదే సమయంలో వెనుక నుంచి దర్యాప్తు సంస్థల అధికారి ఒకరు వచ్చి బేడీలు చూపించటంతో కవిత క్యారికేచర్ తెల్లమొహం వేయటంతో వీడియో ఎండ్ అవుతుంది. ఈ వీడియోతో బీజేపీ కేసీఆర్ కుటుంబ ఇమేజ్‌ని డ్యామేజ్ చెయ్యాలనుకుందా లేదంటే జరగబోయేదాన్ని సింబాలిక్‌గా ఇలా చెప్పదల్చుకుందా అన్నదే ప్రశ్న. యానిమేషన్‌పై చర్చ జరుగుతున్న సమయంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ మూడో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ అనుబంధ చార్జిషీట్‌పై ఏప్రిల్ 14న సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరపనుంది. సేమ్ టైమ్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తెలంగాణభవన్‌లో ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న కారులో అరుణ్పిళ్లైకి డబ్బిచ్చానంటూ మరో బాంబు పేల్చటంతో కవిత మెడకు ఉచ్చు మరింత బిగుసుకుంటోంది.