నీదో వ్యూహం నాదో వ్యూహం.. కేసీఆర్ ను జైలుకు పంపుతానన్న సంజయ్

By KTV Telugu On 7 April, 2023
image

కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని చెప్పి చెప్పి చివరకు టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తానే జైలుకు వెళ్లారు టెన్త్ పేపర్ లీక్ చేయడంలో ప్రధాన భూమిక పోషించారన్న ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వం బండి సంజయ్ ను అరెస్టు చేసింది. ఏ1గా రిమాండ్ రిపోర్టు రూపొందించి జైలుకు పంపింది. 24 గంటల్లో బెయిల్ రావడంతో సంజయ్ బయటకు వచ్చారు. లేకపోతే సెలవుల కారణంగా కనీసం నాలుగు రోజులు కరీంనగర్ కారాగారంలో ఉండాల్సి వచ్చేది.

తెలంగాణలో వరుస లీకులు జరుగుతున్నాయి. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీని పెద్ద స్కాంగా చూడాలి. కమిషన్లో పనిచేసే ఉద్యోగులే దాన్ని లీక్ చేసి మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. వందల మంది ఆ పేపర్ ను కొనుక్కున్న తర్వాతే పోలీసులకు ఆ విషయం తెలిసింది. దానితో వ్యవస్థలో డొల్లతనాన్ని విపక్షాలు ఎండగట్టాయి. కాంగ్రెస్ బీజేపీ ఆరోపణల క్షిపణులు వదులుతుంటే ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరైంది. ఎంత ఎదురుదాడి చేసినా విపక్షానిదే పైచేయి అయ్యింది. అంతలోనే టెన్త్ పేపర్ వ్యవహారం బయట పడింది. వరుసగా రెండు రోజులు పరీక్ష మొదలైన నిమిషాల్లోనే వాట్సాప్ లో పేపర్ వచ్చేసింది. ఇదీ ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని విపక్షాలు ఎండగట్టాయి. సరిగ్గా అప్పుడే బండి సంజయ్ రూపంలో ప్రభుత్వానికి ఆటవిడుపు లభించిందనుకోవాలి. బండి సంజయ్ కు పేపర్ వచ్చిందని ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ఆయన లీకేజీకి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఆర్థికమంత్రి హరీష్ రావు అయితే పేపర్ లీకేజీ దొంగ అంటూ బండి సంజయ్ కు కొత్త పేరు పెట్టారు. అర్థరాత్రి బండి సంజయ్ ను అరెస్టు చేస్తే రాష్ట్రమే అట్టుడికింది.

నిజానికి అదీ పేపర్ లీకేజీనే కాదు అదో మాల్ ప్రాక్టీస్. ప్రశ్నాపత్రాల సీల్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని బయటకు పంపగలిగితే ఆన్సర్లు రాసి మళ్లీ లోపలకు చేర్చి కొందరు విద్యార్థులకు ప్రయోజనం కలిగించే అవకాశాన్ని వెదుక్కోవడమే ఆ మాల్ ప్రాక్టీస్. తెలంగాణ టెన్త్ తెలుగు హిందీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో కూడా అదే జరిగింది. ప్రభుత్వం ఏంతో తెలివిగా దాన్ని లీకేజీగా చిత్రీకరించింది. అప్పటికే టీఎస్పీఎస్పీ పేపర్ లీకు కావడంతో జనం కూడా నమ్మే పరిస్థితి వచ్చింది సంజయ్ అరెస్టుతో వివాదం తారా స్థాయికి చేరింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగానూ డైవర్షన్ టాక్టిస్ తో సంజయ్ ను అరెస్టు చేయించారు రెండు రోజుల పాటు టీఎస్పీఎస్సీ వ్యవహారాన్ని మరిచిపోయారు. సంజయ్ బెయిల్ పిటిషన్ పై ఎనిమిది గంటల పాటు విచారణ జరగడంతో మీడియా దృష్టి ప్రజల ఆలోచన మొత్తం దానిపైనే ఉంది. సంజయ్ కు బెయిల్ వచ్చిన కేసీఆర్ వ్యూహాం ఫలించింది. సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీపై సిట్ విచారణ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆలోచన నుంచి జనం డైవర్ట్ అయ్యారు.

బెయిల్ పై విడుదలైన సంజయ్ వాట్సాప్ లో షేర్ అయిన పేపర్ కు తనకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. మొత్తం వ్యవహారంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించే దమ్ముందా అని ఆయన సవాలు విసిరారు. ఈ లోపే ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ వచ్చేస్తోంది. బీజేపీ వాళ్లతో పాటు మీడియా కూడా ఈ టూర్ కు సంబంధించిన అంశాల్లోనే బిజీగా ఉంది. మోదీ మీటింగ్ జరిగే శనివారం రోజున బీజేపీ నేతల తీరు ఎలా ఉంటుందనే చర్చ ఇప్పుడు వేగం పుంజుకుంది. బహిరంగ సభలో వక్తలు బీఆర్ఎస్ ప్రభత్వాన్ని తూర్పార పట్టడం ఖాయం. అప్పుడు టెన్త్ పేపర్ వ్యవహారంపై హైకోర్టు వ్యాఖ్యలు కూడా ప్రధానంగా ప్రస్తావనకు వస్తాయి. పేప‌ర్స్ లీకేజీ వ్య‌వ‌హారంలో బండి సంజ‌య్ పాత్ర‌పై తెలంగాణ హైకోర్టు ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా నిల‌దీసిందని మరిచిపోకూడదు. ప్ర‌శ్న ప‌త్రం బ‌య‌ట‌కు వ‌చ్చాక వాట్స‌ప్‌లో స‌ర్క్యూలేట్ చేశాడే త‌ప్ప‌ అత‌ని ప్ర‌మేయం ఎక్క‌డ‌ని హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ ప్రభుత్వాన్ని నిల‌దీయడం ప్ర‌శ్నా ప‌త్రం ఒక్క‌సారి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత అది లీకేజ్ ఎలా అవుతుందని ధ‌ర్మాస‌నం ప్రశ్నించడం కూడా బీజేపీ నేతలు గుర్తుచేసే వీలుంది. బండి సంజయ్ బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చని సూచించడం కూడా ఇప్పుడు బీజేపీ దూకుడుకు ఉపయోగపడుతుంది.

మోదీ టూరే బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టొచ్చు. ప్రోటోకాల్ పాటించే అలవాటు లేని కేసీఆర్ ఎయిర్ పోర్టుకు వెళ్లకుండా కమలనాథుల విమర్శల పాలవుతారు. పైగా మాటకారి అయిన మోదీ వేసే సెటైర్లు నేరుగా కేసీఆర్ వైపు గురిపెట్టి ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల వేళ బీజేపీ కేడర్ ను ఉత్సాహ పరచాలంటే ప్రత్యర్థులను తిట్టాలి. నాలుగు రోజుల పాటు మోదీ డైలాగులు గుర్తు పెట్టుకుని బీజేపీ కార్యకర్తలు ఉప్పొంగి పోతారు. అంతకు మించి సంజయ్ కు కూడా మంచి మైలేజీ వచ్చినట్లే చెప్పాలి. అరెస్టు తర్వాత తక్షణ బెయిల్ ఆపై మోదీ పొగడ్తలు ఆయన కాన్ఫిడెన్స్ ను పెంచేస్తాయి. పైగా మోదీకి బండి సంజయ్ ఇష్టమైన అనుచరుడు ముందే బండి సంజయ్ దూకుడున్న నాయకుడు. ఇప్పుడిక ఆయనకు ఆకాశమే హద్దు అవుతుంది. దానితో రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ రసకందాయంలో పడతాయనడంలో సందేహించాల్సిన పని లేదు