టిడిపి అధినేత విశాఖ నగరంలో పార్టీ నేతల సమీక్షా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఉత్తరాంధ్ర తమ్ముళ్లను వణికిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందని అధినేత అనడంతో అయితే మనకి టికెట్లు టిక్ పెట్టేసినట్లేనా అని సీనియర్లు కంగారు పడుతున్నారు. ఫలానా వారికి టికెట్లు ఇవ్వను అని చెప్పకుండా చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా నేతలకు చెక్ పెట్టారని రాజకీయ పండితులు భావిస్తున్నారు.
ఉక్కు నగరంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతల పనితీరును సమీక్షించేందుకు ఉద్దేశించిన సమావేశం హాట్ హాట్ గా సాగింది. కొంతమంది నేతలను ఉద్దేశించి మీ పనితీరు ఏమీ బాగాలేదని నివేదికలు చెబుతున్నాయి. ఇలా అయితే ఎలా సిగ్గుగా లేదా మీకు అని మండి పడ్డంతో సీనియర్ నేతలు హర్ట్ అయ్యారని సమాచారం. పార్టీ గెలిచి తీరాలంటే అందరూ కష్టపడి పనిచేయాలి. పార్టీలో కష్టపడి పనిచేసే వారికే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఉంటాయి అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇది అందాల్సిన వారికి అందాల్సిన సంకేతాలు అందించింది.
ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు పార్టీలోని సీనియర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే కొత్త వారిని ప్రోత్సహించాలని అన్నారు. ఇది ఆయన ఏదో ముక్తసరికగా అన్న వ్యాఖ్య కాదు. చాలా లోతుగా ఆలోచించే పార్టీలో కొందరు నేతలకు గుచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే గురి చూసి కొట్టిన బాణంలాంటి వ్యాఖ్య అంటున్నారు రాజకీయ పండితులు. చంద్రబాబు నాయుడు ఏ వ్యాఖ్య చేసినా దాని వెనుక ఏదో ఒక అంతరార్ధం ఉంటుందని కాకపోతే అది అంత తొందరగా అర్ధం కాదని పార్టీలోని పాత తరం నేతలే అంటున్నారు. అయితే ఇపుడు చంద్రబాబు వ్యాఖ్యల మర్మం ఏంటి అని వారు కంగారు పడుతున్నారు. ఇక పార్టీలో భిన్న ధృవాలుగా ఉంటూ ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటూ తనకు పెద్ద తలనొప్పి తెచ్చిపెడుతోన్న సీనియర్ నేతలు చింతకాయల అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావుల విషయంలోనూ చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వేదికపై చంద్రబాబు నాయుడి పక్కన కొందరు నేతలకు అవతల గంటా శ్రీనివాసరావు కూర్చున్నారు. అయితే వేదిక ఎక్కిన చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుణ్ని పిలిచి దగ్గరకు తీసుకున్నారు. కానీ గంటాను మాత్రం మాట మాత్రంగా కూడా పిలవలేదు ఆయన వైపు చూడలేదు. చంద్రబాబు దృష్టిలో పడ్డానికి గంటా మాత్రం చాలా తాపత్రయ పడ్డారు. వేదిక ఎక్కిన తర్వాత అందరినీ కూర్చోమని సైగ చేసిన చంద్రబాబు నాయుడు అయ్యన్న వైపు చూసి కూర్చో అన్నారు కానీ గంటాను మాత్రం పట్టించుకోలేదు. ఇదే ఇపుడు గంటాలో ఉక్కపోత పెంచిందని అంటున్నారు. నిన్నటి వరకు అయ్యన్న పాత్రుడు కూడా టెన్షన్ గానే ఉన్నారు. పార్టీని పట్టించుకోని గంటాను సమావేశానికి పిలిస్తే తాను ఇంట్లోనే ఉంటాను తప్ప మీటింగ్ కు రానని అనుచరులతో అన్నారు.
అయితే అది తప్పుడు సంకేతాలు పంపుతుందని భయపడి సమావేశానికి వచ్చారు. గంటాను పలకరించకపోడానికి కారణాలు లేకపోలేదు. 2019 ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓటమి చెందిన తర్వాత గంటా శ్రీనివాసరావు టిడిపికి పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు. నిజానికి 2019 ఎన్నికలకు ముందే ఆయన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నించారు. ఆయన్ను చేర్చుకోడానికి ఆ పార్టీ కూడా ఆసక్తి చూపింది. కానీ ఎక్కడ తేడా జరిగిందో కానీ చివరి నిముషంలో ఆయన టిడిపి అభ్యర్ధిగానే బరిలో దిగారు. ఎన్నికల తర్వాత వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ గంటా శ్రీనివాసరావు అధికార పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. ప్రత్యేకించి విశాఖ వ్యవహారాలు చూస్తోన్న విజయసాయి రెడ్డితో గంటా టచ్ లో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల ముందు వైసీపీలో చేరిన గంటా శిష్యుడు అవంతి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నారు. ఆయనే గంటా రాకను అడ్డుకున్నారని అంటారు.ఈ నాలుగేళ్లలో టిడిపి అధినేత పిలుపు నిచ్చిన ఏ కార్యక్రమంలోనూ గంటా పాల్గొనలేదు. చివరకు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినపుడు మర్యాద పూర్వకంగా కూడా గంటా రాలేదు. గంటాకు పార్టీలో కీలక పదవులు ఇచ్చి ప్రోత్సహించినా తనని శత్రువులా చూసినట్లు ఇలా వ్యవహరించడం ఏంటని చంద్రబాబు నాయుడు పార్టీలో సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధ పడ్డారట. ఆ తర్వాత టిడిపి కార్యాలయంపై దుండగులు దాడి చేసినపుడు కూడా గంటా మౌనంగానే ఉండిపోయారు. ఇవన్నీ కూడా చంద్రబాబుకు మంట తెప్పించాయని అంటారు పార్టీ నేతలు.
తనపై అధినేతకు ఆగ్రహం ఉందని గంటాకీ తెలుసు. అందుకే బాస్ ని కూల్ చేసుకోడానికి ఈ మధ్యనే లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా గంటా కూడా లోకేష్ తో పాటు కొంత దూరం నడిచారు. టిడిపిలో ఇక నుంచి తాను యాక్టివ్ గా ఉంటానని చెప్పుకొచ్చారు. పార్టీ మారే ఉద్దేశం కూడా లేదని వివరణ ఇచ్చుకున్న ధోరణిలో అన్నారు. అయితే లోకేష్ కూడా ఉత్తి పుణ్యానికి సీనియర్లను దూరం చేసుకోవడం ఎందుకు ఎన్నికల వరకు కూల్ గా ఉంటేనే మంచిది అని వ్యూహాత్మకంగా గంటాతో మర్యాదగా ఉన్నట్లు నటించారని అంటారు. అయ్యన్న పాత్రుడి వంటి కొందరు తనను సమావేశానికి పిలవద్దని వారించినా తనకు పిలుపు రావడంతో గంటా శ్రీనివాసరావు అధినేత తనకు ప్రాధాన్యత ఇస్తున్నారని మురిసిపోయారట. అయితే నాయకుడు వేదిక ఎక్కిన తర్వాతి నుంచి గంటాను పట్టించుకోకపోవడంతో ఆయన కాస్త డీలా పడ్డట్లు కనిపించిందంటున్నారు. దీన్ని కడిగేసుకోడానికి కార్యక్రమం అనంతరం చంద్రబాబు నాయుడితో పాటు ఎయిర్ పోర్టుకు బయలుదేరారట గంటా. అయితే తనతో పాటు ఎవరూ ఎయిర్ పోర్టుకు రావద్దని చంద్రబాబు నాయుడు నేతలందరికీ వినపడేలా చెప్పేసరికి గంటా వెనుతిరిగి ఇంటికి వెళ్లిపోయారని అంటారు.
మొత్తానికి ఉత్తరాంధ్రలో సీనియర్ నేతలు కొందరిని వచ్చే ఎన్నికల బరి నుండి తప్పించాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయిపోయారని అంటున్నారు. ఉత్తరాంధ్రే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను అవమాన భారంతో బాధపడుతున్నప్పుడు మానవత్వం కోసమైనా తనను పరామర్శించడానికి ప్రయత్నం చేయని చాలా మంది సీనియర్ల విషయంలోనూ ఇదే నిర్ణయంతో ఉన్నారట చంద్రబాబు. వారి స్థానంలో కొత్తగా యువనేతలను రంగంలోకి దింపి కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో చంద్రబాబు నాయుడు ఉన్నారని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో 40 శాతం పదవులు టికెట్లు కూడా యువతకే ఇస్తామని గత మహానాడులోనే చంద్రబాబు హామీ ఇచ్చారు. నాలుగేళ్లుగా తోక జాడిస్తోన్న సీనియర్ నేతల స్థానంలోనే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని తనకు విధేయంగా ఉన్న సీనియర్లకు యథాతథంగా వారి నియోజకవర్గాల్లో అవకాశాలు కొనసాగించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. మరి రానున్న రోజుల్లో చంద్రబాబు గుడ్ లుక్స్ లో లేని సీనియర్ తమ్ముళ్ల భవిష్యత్ ఏంటనేది పార్టీలో ఆసక్తికర చర్చగా మారింది.