* బీజేపీ, టీఆర్ఎస్ నేతలే టార్గెట్
* ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన పోలీసులు
దసరా పండగ నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ ఎత్తున విధ్వంసం సృష్టించాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. నగరంలో పలు చోట్ల బాంబుదాడులు చేయాలని ప్లాన్ చేసిన ఐఎస్ఐ ప్లాన్ చేసింది. ఈ విషయం పసిగట్టిన పోలీసులు అబ్దుల్ జాహిద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతనికి పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. విచారణలో మరిన్ని కీలకమైన విషయాలు వెలుగుచూశాయి. హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించాలని ఐఎస్ఐ నుంచి జాహిద్‌కు అదేశాలు అందినట్లు తేలింది. ఐఎస్స ఆదేశాలకు అనుగుణంగా దసరా ఉత్సవాలను జాహిద్ బృందం టార్గెట్ చేసుకుంది. జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో మూకుమ్మడిగా దాడి చేయాలని కుట్ర పన్నింది. ఏకకాలంలో పలు చోట్ల బాంబు పేలుళ్లు జరిపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలనుకున్నారు. ఇందుకోసం ఐఎస్ఐ ఏజెంట్లు జాహిద్‌కు నాలుగు గ్రనేడ్లు పంపించారు. అతనివద్దన నుంచి ఆ గ్రనేడ్లతో పాటు ఆరు లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలపై దాడులకు కూడా జాహిద్ అండ్ టీమ్ కుట్ర పన్నారు. గతంలోనూ పలు బ్లాస్ట్ కేసుల్లో జాహిద్ నిందితుడిగా ఉన్నాడు.
2002లో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ వద్దకు కుట్రకు ప్లాన్ చేశాడు. అలాగే 2005లో బేగంపేట టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై సూసైడ్ అటాక్‌కు జాహిద్ ప్లాన్ చేసి కలకలం సృష్టించాడు. ఇప్పుడు పోలీసులు సకాలంలో స్పందించడంతో హైదరాబాద్‌కు మరో పెద్ద ముప్పు తప్పినట్లయింది. జాహిద్‌తో పాటు మరో ఏడుగురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.