సంక్షేమపథకాలతో ప్రతి గడపనీ టచ్ చేసిన వైసీపీ ఎన్నికలనాటికి ప్రతీ ఇంట్లో తన ముద్రపడేలా చూసుకుంటోంది. ఏపీలో వాలంటీర్ వ్యవస్థని ఈ కార్యక్రమంకోసం పూర్థిస్థాయిలో రంగంలోకి దించుతోంది. మొన్నటిదాకా గడపగడపకీ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఇప్పుడు ప్రతీ ఇంటి తలుపునీ వాలంటీర్లు తడుతున్నారు. వైసీపీని ప్రజలతో అనుసంధానించబోతోంది అంబికాదర్బార్ బత్తిలాంటి గృహ సారధుల వ్యవస్థ. భారీ పీపుల్స్ సర్వేతో ప్రతి ఓటరు గుండె చప్పుడు వినాలనుకుంటోంది. 7నుంచి వారంపాటు సాగుతున్న ఈ బృహత్తర కార్యక్రమంతో కోటీ అరవై లక్షల కుటుంబాలను వైసీపీ నేరుగా టచ్ చేస్తుంది. ఐదు లక్షల మందికి పైగా గృహ సారధులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటున్నారు. ఒక్కోటీంకి యాభై ఇళ్లు అప్పగించటంతో ఈ వారంలో అందరూ తమకు అప్పగించిన పని పూర్తిచేయబోతున్నారు.
గృహసారధుల్లో ఒక పురుషుడు మహిళతో పాటు వీరి వెంట వాలంటీర్ ఉంటారు. అదరబదరా చేయకుండా అరకొర సమాచారంతో సరిపెట్టకుండా పక్కాగా ఉండేలా ప్రోగ్రాం డిజైన్ చేసుకున్నారు. గృహసారధులు ఇళ్ళకు వెళ్ళి ప్రభుత్వ పథకాలను విడమరిచి చెబుతారు ఆ ఇళ్లకు జగనన్న మా భవిష్యత్తు స్టిక్కర్లు అంటిస్తారు. ప్రభుత్వంమీద వారికున్న అభిప్రాయమేంటో తెలుసుకుంటారు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కూడా విజ్ఞప్తిచేస్తారు. ఈ ప్రక్రియలో ఆ ఇంట్లోనివారి అభిప్రాయాలను రికార్డు చేసుకుంటారు. మాటల సందర్భంలోనే గత ప్రభుత్వానికి ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వానికి తేడా ఏమిటో తెలుసుకుంటారు. వైసీపీ ప్రభుత్వం నుంచి ఇంకా ఏమేం ఆశిస్తున్నారో కూడా గృహసారధులు అడుగుతారు.
ఈ కార్యక్రమంతో కోటీ అరవై లక్షల కుటుంబాల అభిప్రాయం నేరుగా ప్రభుత్వానికి చేరుతుంది. అంతా బాగుందని ఊహాజనితంగా ఉండకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మనసులో ఏముందో వారు ఏం కోరుకుంటున్నారో విశ్లేషించుకునే అవకాశం ఉంది. ఎక్కడైనా ఎక్కువమంది అసంతృప్తితో ఉన్నట్లు తేలితే దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు వీలుంటుంది. ఎన్నికలకు ఏడాది ముందు భారీగా చేపట్టిన పబ్లిక్ సర్వేలాంటి కార్యక్రమం వైసీపీకి మేలు చేస్తుందన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే వందలు వేల శాంపిల్స్‌తో పల్స్ చెప్పే సర్వే సంస్థలకంటే నేరుగా తమ మనిషి ప్రతీ గడపనీ తొక్కడం ద్వారా కచ్చితమైన ఫీడ్‌బ్యాక్ వస్తుంది. అందుకే ఏప్రిల్ 20దాకా సాగే ఈ కార్యక్రమాన్ని వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం 7 లక్షలమంది కోసం ప్రత్యేకంగా కిట్‌బ్యాగులు అందించారు. ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యేలా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వైసీపీ ఇంచార్జిలు సమన్వయం చేయాలని పార్టీ పెద్దలు ఆదేశించారు.
ప్రజా మద్దతు పేరుతో ఉండే పుస్తకంలో ప్రజల సర్వేకు సంబంధించిన ఐదు ప్రశ్నల స్లిప్ మీద కుటుంబ పెద్ద పేరు ఫోన్ నెంబరు నమోదు చేస్తారు. అనంతరం ఐదు ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేస్తారు ఆ కుటుంబానికి రసీదు ఇస్తారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారిని 8296082960 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని గృహసారధులు కోరతారు. మిస్డ్ కాల్ ఇచ్చిన నిమిషంలోనే ముఖ్యమంత్రి నుంచి థ్యాంక్స్ సందేశంతో ఆ కుటుంబానికి ఐవీఆర్ఎస్ కాల్ వస్తుంది. తర్వాత జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారి ఇంటి తలుపుకు వారి అనుమతితో జగన్ ఫోటోతో ఉండే స్టిక్కర్ అతికిస్తారు. అదే సమయంలో ఇంటి పెద్ద మొబైల్ ఫోన్ వెనుక భాగంలో జగన్ బొమ్మ ఉన్న మొబైల్ స్టిక్కర్ అతికించటంతో ఆ ఇంటి సర్వే కార్యక్రమం పూర్తవుతుంది. క్షేత్రస్థాయిలో పక్కాగా జరిగే ఈ ప్రోగ్రాంతో ప్రజల మనసులో ఏముందో ఓ అంచనాకు రాబోతోంది జగన్ ప్రభుత్వం.
ప్రజలను అడిగే ఆ ఐదు ప్రశ్నలు
1. గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే జగనన్న పాలనలో మీకు మంచి జరిగిందా.
2. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి ప్రతి సామాజికవర్గానికి ప్రతి కుటుంబానికి గతం కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా.
3. గత ప్రభుత్వం కంటే జగనన్న ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన పింఛన్ అమ్మఒడి అసరా చేయూత లాంటి పథకాల ద్వారా డబ్బులు నేరుగా మీ ఖాతాలో వేయడం వాలంటీర్లతో నేరుగా అందించడం బాగుందా.
4. జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరుకుంటున్నారా.
5. సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కొనసాగించేందుకు మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా.