బండి సంజయ్ అరెస్ట్ వ్యూహాత్మక తప్పిదమా మాస్టర్ స్ట్రోకా

By KTV Telugu On 9 April, 2023
image

నయా భారతంలో ఎవరితోనై పెట్టుకోవచ్చు కానీ భారతీయ జనతా పార్టీతో మాత్రం పెట్టుకోకూడదన్న ఓ అప్రకటిత రూల్ నడుస్తోంది. దీనికి కారణం వాళ్లతో పెట్టుకున్న వారికి శంకరగిరి మాన్యాలు తప్పవు. లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర్నుంచి చిదంబరం వరకూ అందరికీ జైలే. అందుకే చాలా మంది నేతలు అణిగిమణిగి ఉంటున్నారు. కానీ భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మాత్రం బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎంతగా అంటే ఆ పార్టీ హైకమాండ్‌కు కోపం తెప్పించేలా ఆ పార్టీ కీలక నేతల్ని అరెస్ట్ చేయిస్తున్నారు. కొద్దిగా తప్పిపోయింది కానీ బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన బీఎల్ సంతోష్ అరెస్టయి ఉండేవారే. బండి సంజయ్ అరెస్ట్ నుంచి తప్పించుకోలేకపోయారు. మరి ఇప్పుడు బీజేపీ హైకమాండ్ సైలెంట్‌గా ఉంటుందా తమ అహం మీద దెబ్బకొట్టిన కేసీఆర్‌పై రివెంజ్ తీర్చుకోకుండా ఉంటుందా.

నీ బిడ్డ జైలుకు పోతాది నీ కొడుకుకు కూడా జైలు రెడీ చేస్తున్నాము అని టెన్త్ పేపర్ లీక్ కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన తర్వాత బండి సంజయ్ జైలు ముందే చేసిన హెచ్చరిక ఇది. బండి సంజయ్‌ అరెస్ట్ తర్వాత బీజేపీ హైకమాండ్ చేసిన ప్రకటనలు స్పందించిన విధానం చూస్తే ఈ అంశంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అనుకోవచ్చు. నిజానికి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉప్పు నిప్పులా పరిస్థితి ఉంది. ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ జుట్టు బీజేపీ చేతుల్లో ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాంపై దర్యాప్తు చేస్తున్నాయి. కల్వకుంట్ల కవిత ఇచ్చిన పది ఫోన్లను విశ్లేషిస్తున్నట్లుగా తెలుస్తోంది. మళ్లీ నోటీసులు ఇస్తారా లేదా అన్నది స్పష్టత లేదు కానీ అరెస్ట్ మాత్రం చేయలేదు అరెస్ట్ వరకూ వచ్చిందని అందరూ అనుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక వ్యక్తులంతా అరెస్టయ్యారు వారికి బెయిల్ దక్కడం కూడా గగనంగా మారింది. ఆ రెండు దర్యాప్తు సంస్థలు అనుకుంటే ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది.

ఫామ్ హౌస్ కేసు కూడా సీబీఐ చేతిలో ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు కాదు తదుపరి దర్యాప్తు చేయవద్దని చెప్పింది. ఇవాళ కాకపోతే రేపైనా సీబీఐనే దర్యాప్తు చేయాల్సి ఉంది. ఫామ్ హౌస్ కేసు అత్యంత క్లిష్టమైనదేమీ కాదు కానీ ట్రాప్ అని స్పష్టంగా తెలుస్తోంది. పెద్దగా బీజేపీతో సంబంధాల్లేని ముగ్గుర్ని తెరపైకి తెచ్చి ఏకంగా బీజేపీ హైకమాండ్‌తో లింక్ పెట్టి కేసు కట్టేశారు. వందల కోట్లు అన్నారు కానీ రూపాయి కూడా పట్టుబడలేదు. కానీ సీఎం కేసీఆర్ అత్యుత్సాహం వల్ల ఆయన కూడా ఇప్పుడు ఇరుక్కునే పరిస్థితి ఏర్పడింది. సాక్ష్యాలను ఆయన మీడియా సమావేశం పెట్టి రిలీజ్ చేశారు. వాటిలో ఉన్న కంటెంట్ వైరల్ కాలేదు కానీ ఆయన ఇలా చేయడం మాత్రం సీబీఐ దృష్టిలో పడటం ఖాయమని ఇప్పటికే స్పష్టమయింది. సీబీఐ విచారణ అంటూ జరిగితే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగానే ఉంటుంది.

వరుసగా జరుగుతున్న పేపర్ లీక్‌ల విషయంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తగ్గించుకునేందుకు బండి సంజయ్‌పై ప్రభుత్వం కుట్ర చేసిందని బీజేపీ అగ్రనాయకత్వ నమ్ముతున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అరెస్టుపై ప్రధాని మోదీ కూడా వివరాలు తెలుసుకున్నారని అంటున్నారు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పార్టీ భారీగా పుంజుకుంది. అందుకే ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాలకు బండి సంజయ్‌పై ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇప్పుడు బండి సంజయ్‌నే అరెస్టు చేశారంటే వారు తేలికగా తీసుకోరని అంటున్నారు. కరీంనగర్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బండి సంజయ్ కేటీఆర్ ప్రస్తావన కూడా తీసుకు వచ్చారు. ఆయనకు కూడా జైలు సిద్ధం చేస్తామన్నారు. కేటీఆర్‌కు సంబంధించి వారి వద్ద ఏమైనా సమాచారం ఉందేమోనన్న అనుమానాలు ఈ ప్రకటనతో ప్రారంభమయ్యాయి.

బీజేపీ అగ్రనాయకత్వ ప్రతీకారం తీర్చుకోవాలంటే వెంటనే ఏమీ చేసేయదని సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని అంటున్నారు. తాము కక్ష సాధింపులకు పాల్పడ్డామని ప్రజలు అనుకోకుండా పద్దతిగా ప్రతీకారం తీర్చుకుంటుందని చెబుతున్నారు. ఈ తరహాలో కేటీఆర్ కవితలను టార్గెట్ చేశారా అన్న సందేహాలు ప్రారంభమవుతున్నాయి. కారణం ఏదైనా బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారం టైమింగ్ కరెక్ట్ కాదన్న అభిప్రాయం బీఆర్ఎస్ క్యాడర్‌లో వినిపిస్తోంది. అయితే అన్నీ ఆలోచించే బీఆర్ఎస్ చీఫ్ రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారని బీజేపీ ట్రాప్‌లో పడుతోందని త్వరలోనే అసలు విషయం వెలుగులోకి వస్తుందని కొంత మంది విశ్లేషిస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ డేంజరస్ గేమ్ ఆడుతున్నారన్న అభిప్రాయం అయితే ఎక్కువగా వినిపిస్తోంది.