నంది అవార్డులంటే కమ్మ అవార్డులంట

By KTV Telugu On 9 April, 2023
image

నంది అవార్డులు. ఒకప్పుడు తెలుగుసినీపరిశ్రమకు అవే ఆస్కార్‌ అవార్డ్‌ అన్నంత గౌరవం. కాలక్రమంలో కొన్ని లోటుపాట్లు జరిగుండొచ్చు కొందరు అర్హులకు దక్కకపోయి ఉండొచ్చు కొన్నిసార్లు కొందరికి అర్హతకు మించి కూడా నందులు వరించి ఉండొచ్చు. అంతమాత్రాన ఆ అవార్డులను పూచికపుల్లలా తీసిపారేస్తే ఎలా మన అవార్డులను మనం తప్పుపట్టటమంటే మన సినీపరిశ్రమను మనం అగౌరవపరుచుకున్నట్లే. కానీ నోరుతెరిస్తే ఎమోషనే తప్ప లాజిక్‌ లేని మెంటల్‌ కృష్ణకు మాట్లాడేది తప్పా ఒప్పా అన్న విచక్షణ ఎక్కడేడ్చింది. తాను కేవలం నటుడిని కాదన్న విషయాన్ని ఆయన మర్చిపోయినట్లుంది. వైసీపీ ప్రభుత్వం పోసాని కృష్ణమురళికి ఈమధ్యే ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టింది. ఆ పదవితో తనకు అన్నంపెడుతున్న సినీపరిశ్రమకు ఏదన్నా మేలు చేయొచ్చు. కలకాలం గుర్తుండిపోయేలా ప్రభుత్వాన్ని ఒప్పించి కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. అబ్బే అలా చేస్తే మెంటల్‌ తగ్గిందని అంతా అనుకోరూ.

నంది అవార్డులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి. ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ పదవిలో ఉన్న నటుడు చేసిన కామెంట్స్‌ తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు రేపుతున్నాయి. నంది అవార్డులు కావు అవి కమ్మ అవార్డులంటూ కాంట్రవర్సీకి తెరలేపాడు పోసాని. అంటే ఆయన దృష్టిలో సినీపరిశ్రమలో ఉన్న కమ్మ సామాజికవర్గానికి చెందినవారికే అవార్డుల్లో పెద్దపీట వేస్తున్నారన్నమాట. గతంలో నంది అవార్డులను గ్రూపులవారీగా కులాల వారీగా పంచుకున్నారన్నది పోసాని అభియోగం. అలాంటిదే కమ్మ అవార్డు తనక్కూడా వచ్చిందని అయితే టెంపర్‌ సిన్మాలో తనకు వచ్చిన ఆ అవార్డును తిరస్కరించానని పోసాని గొప్పగా చెప్పుకున్నారు. నంది అవార్డుల కమిటీలో ఉన్న 12మంది సభ్యుల్లో 11మంది కమ్మ సామాజికవర్గానికి చెందినవారేనంటూ పోసాని విమర్శించడం కలకలం రేపుతోంది.
వందకుపైగా సినిమాలు తీస్తే ఎన్నడూ నంది రాలేదంటున్నారు పోసాని. 37 ఏళ్ళల్లో ఒక్కనందినైనా ఇంట్లో ఉంచుకోవాలని ఉన్నా తనకెందుకో మనసొప్పలేదంటున్నారు మెంటల్‌ కృష్ణ. గ్రూపులవారీగా నందులు పంచుకోవటంతో అర్హత ఉన్న ఎంతోమంది దర్శకులు రచయితలు అవార్డులకు నోచుకోలేకపోయారని పోసాని నిందిస్తున్నారు. మరి వాళ్లెవ్వరూ ఎప్పుడూ ఎందుకు మాట్లాడలేదో ఎవరికి భయపడి నోరు విప్పలేదో దానికి కూడా పోసాని దగ్గర తనదైన లాజిక్‌ ఉంది. నందులు ఎందుకిస్తారో ఎందుకు ఆపేస్తారో ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరూ సమాధానం చెప్పరు. ఏమిటిది అని ఎవ్వరూ ప్రశ్నించరు. ప్రశ్నిస్తే తనలాగే నంది అవార్డులు అందుకోలేన్నది పోసాని ఉవాచ. ఆయన దృష్టిలో నందులు కమ్మ అవార్డులే అనుకుందాం. మరి వాటిని సామాజికఅవార్డులుగా సర్వసమాన అవార్డులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయొచ్చుగా. దాని సంగతేమిటంటే నందుల అవార్డుల విషయంలో అన్నీ చర్చించి నిర్ణయం తీసుకుంటామంటున్నారు.

పోసాని కామెంట్స్‌కి ఇండస్ట్రీ నుంచి కౌంటర్స్‌ మొదలయ్యాయి. వైసీపీకి కోసం పనిచేస్తున్న పోసాని పార్టీలో తన మనుగడ కోసం సిన్మాని వాడుకోవడం తగదంటున్నారు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్‌. నంది అవార్డుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు. అప్పట్లో నంది అవార్డు కమిటీలో జీవితా రాజశేఖర్‌ పరుచూరి బ్రదర్స్‌ ఉన్నారని గుర్తుచేశారు. పోసానికి సీనియర్‌ నటుడు మురళీమోహన్‌ కూడా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. ఇండస్ర్టీలో ఏ రోజూ కులాల ఆధారంగా అవార్డులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అన్నదమ్ముల్లా ఉండే కళాకారుల మధ్య కులాల చిచ్చు సరికాదంటున్నారు మురళీమోహన్‌. కమ్మ అవార్డులన్న కామెంట్‌ గతంలో అవార్డులు తీసుకున్నవారిని అవమానించినట్లే. తప్పులు సరిదిద్దొచ్చుగానీ అవార్డులకే కులాన్ని ఆపాదించడం పోసానికే చెల్లింది.