ఆ మధ్య తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన చేరాక బీజేపీ బలం పెరిగింది లేదు ఉన్నది పోయిందీ లేదు ఎందుకంటే ఆయన డిప్లొమాట్ లీడర్ పెద్దమనిషిగా పనికొచ్చే కటౌట్. జనంలో విపరీతమైన క్రేజ్ ఉన్న నాయకుడేం కాదు. తన సొంత సెగ్మెంట్ సనత్‌నగర్‌లో పోటీచేస్తే ఎన్ని ఓట్లు పడతాయో కూడా తెలీదు. ఇప్పుడు ఏపీలో బీజేపీకి అలాంటి తురుపుముక్కే దొరికింది పేరు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి. ఇదివరకు బాగా విన్నపేరే కదూ. ఎస్ ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా ఘనకీర్తి పొందిన నాయకుడే. అదృష్టం కలిసొచ్చి అప్పట్లో ముఖ్యమంత్రి పదవి దక్కినా ఆ పోస్టునుంచి దిగిపోయాక ఆయన కూడా రాజకీయంగా అడ్రస్ లేరు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ జనంలో లేని లీడర్‌గానే కిరణ్‌కుమార్‌రెడ్డికి పేరు. మాజీ ముఖ్యమంత్రి పార్టీలోకి రావడంతో బీజేపీ చంకలు గుద్దుకుంటోంది. ఏపీ బీజేపీని సోమువీర్రాజు పురందేశ్వరిలాంటి నేతలు గట్టెక్కించలేరని బీజేపీకి ఇప్పటికే అర్ధమైపోయింది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలతో తనకు క్షేత్రస్థాయిలో ఉన్న బలమేంటో ఆ పార్టీకి తెలిసిపోయింది. అందుకే సీమనుంచి మాజీ ముఖ్యమంత్రి రాగానే సంబరపడుతోంది. కానీ నల్లారివారికి సొంత జిల్లా చిత్తూరులోనే ఓ సీటన్నా సొంతంగా గెలిపించే సత్తా ఉందా అన్నదే అనుమానం. కానీ చెప్పుకోడానికైనా కాస్త గుర్తుపట్టే నాలుగు మొహాలు పార్టీలో ఉండాలిగా. అందుకే తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ అంటూ కమలనాథులు ఆయన్ని కౌగిలించుకున్నారు.
ముఖ్యమంత్రి పదవినుంచి దిగిపోయాక ఎక్కడా రాజకీయంగా కిరణ్‌కుమార్‌రెడ్డి కనిపించలేదు. ఆయన తమ్ముడు కిశోర్‌కుమార్‌రెడ్డి టీడీపీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడన్నా కనిపిస్తున్నాడేమోగానీ కిరణ్‌కుమార్‌రెడ్డి అయితే అస్త్ర సన్యాసం చేశారనే అంతా అనుకున్నారు. అలాంటి నాయకుడు లేననుకున్నారా రాలేననుకున్నారా అంటూ కాషాయకండువా కప్పుకునేసరికి అంతా హాశ్చర్యపోతున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి ఏపీ ప్రజల్లో కాస్తంత సానుకూలత ఏదన్నా ఉందంటే అది విభజన సమయంలో ఆయన తీసుకున్న స్టాండ్ వల్లే. అప్పట్లో కాంగ్రెస్ అధినాయకత్వ నిర్ణయాన్ని నల్లారి తప్పుపట్టారు. తాను అడ్డంపడ్డా విభజన ఆగదని ఆయనకు తెలుసు. అందుకే ఆ ప్రక్రియలో పాలుపంచుకోవడం ఇష్టంలేక నాలుగురోజుల ముందే ముఖ్యమంత్రి హోదా వదులుకోవడానికి సిద్ధపడ్డారు. తర్వాత జై సమైక్యాంధ్ర అని కొత్త జెండా ఎత్తినా ఆయన్ని ఎవరూ పట్టించుకోలేదు. 2019 ఎన్నికల సమయంలో ఆయన ఎవరికీ కనిపించలేదు. విభజన తర్వాత మళ్లీ ఇన్నేళ్లకి ఆయనకు రాజకీయం గుర్తుకొచ్చింది. జాకీలేసి లేపినా కాంగ్రెస్‌ని నిలబెట్టడం కష్టమనుకున్నట్లుంది ఆయన. పోనీ తమ్ముడున్న టీడీపీలో చేరడానికి చంద్రబాబు నాయకత్వానికి జైకొట్టడానికి ఆయనకు మనస్కరించలేదు. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న మరోసారి అధికారంలోకి వస్తుందన్న ఆయన నమ్ముకున్న బీజేపీలో చేరిపోయారు. సైలెంట్‌గా కండువా కప్పుకోలేదు నల్లారి. తనని సీఎంని చేసిన కాంగ్రెస్‌పార్టీపై విమర్శలుచేశారు. కాంగ్రెస్ వాస్తవ పరిస్థితులను అర్ధంచేసుకునే స్థితిలో లేదన్నారు. కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాలతోనే దేశంలో ఆ పార్టీ ప్రాభవం క్షీణించిందన్నారు. తానే కరెక్ట్ ప్రజల ఆలోచనే తప్పన్న ధోరణితో కాంగ్రెస్ ఉండటం వల్లే ఆ పార్టీనుంచి బయటికొచ్చానన్నారు నల్లారి. బీజేపీ కోరుకున్నది కూడా అదే.
కిరణ్‌కుమార్‌రెడ్డి సేవలు రాయలసీమలో ఉపయోగపడతాయన్న ఆశతో ఉంది బీజేపీ. ఆ ప్రాంతంలో పార్టీ బలోపేతానికి ఆయన సేవలను వాడుకోబోతోంది. మరి కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీకి ఎంతవరకు ఉపయోపడతారో ఆయన రాజకీయ అస్థిత్వానికి ఆ పార్టీ ఎంతవరకు అక్కరకు వస్తుందోగానీ ఆయనపై మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికీ తెలంగాణ అసెంబ్లీలో అప్పుడప్పుడూ కిరణ్‌కుమార్‌రెడ్డిని బీఆర్ఎస్ గుర్తుచేసుకుంటోంది. ఒక్క పైసా ఇచ్చేది లేదని అప్పుడెప్పుడో ఆయన అన్న మాటలను ఆంధ్రా పెత్తనానికి ఉదాహరణగా చెబుతూనేఉంది. ఇప్పుడాయన బీజేపీలో చేరగానే తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎలా బీజేపీలో చేర్చుకున్నారంటూ బీఆర్ఎస్ ప్రశ్నించింది. ఏపీ కాంగ్రెస్ కూడా నల్లారి ఫిరాయింపుపై ఘాటుగానే స్పందించింది. ఏపీకి ఏం చేసిందని నల్లారి బీజేపీలో చేరారని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు. కేసులకు భయపడే ఆయన బీజేపీతో రాజీపడ్డారన్నది ఏపీ కాంగ్రెస్ నేత ఆరోపణ. నల్లారి కొత్త ఇన్నింగ్స్ సంగతెలా ఉన్నా ఈ చేరిక కార్యక్రమానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు దూరంగా ఉండటం మరో ట్విస్ట్. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కండువా కప్పినా ఏపీ బీజేపీ నేతలు నల్లారి రాకపై అంత సంతృప్తిగా లేనట్లే కనిపిస్తోంది. మరి సైనికుడిలా పనిచేస్తానన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి బీజేపీ ఏ పదవి ఇస్తుందో ఎలా పెద్దపీట వేస్తుందో చూడాలి.