తెలంగాణ ప్రజలకు అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లల్లో ఉండాల్సిన అవసరం ఏంటి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తా. ఒక్క పైసా కట్టాల్సిన పని లేదు అని కేసీఆర్ ఎనిమిదేళ్ల నుంచి చెబుతున్నారు. కానీ ఎనిమిదేళ్లలో ఎంత మందికి ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారంటే చెప్పడం కష్టం. ఈ పేరుతో కేంద్రం ఇచ్చే ఇళ్ల నిధుల్ని కూడా తీసుకోవడం లేదు. కానీ పేదలు మాత్రం ఆశల పల్లకీలో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇదిగో ఇచ్చేసినట్లే అంటారు కానీ ఇవ్వరు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. అసలు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూంల విషయంలో ఎంత ముందడుగు వేశారు పేద ప్రజలకు ఆశపెట్టి అసలు ఇళ్లు లేకుండా చేశారా.
2014 ఎన్నకిల తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చాయి. అంతకు ముందు జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయలేకపోయింది దానికి కారణం బలం లేకపోవడం. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రేటర్ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు పోటీ చేయడమే కాదు అత్యధిక సీట్లు గెల్చుకోవాల్సి ఉంది. అందు కోసం కేసీఆర్‌కు వచ్చిన ఆలోచన డబుల్ బెడ్ రూం ఇళ్లు. టీడీపీ తరపున గెలిచి టీఆర్ఎస్‌లో చేరడానికి చర్చలు జరుపుతున్న తలసానిని ముందు పెట్టి ఆయన నియోజకవర్గంలో పాడైపోయిన ఇళ్ల స్థానంలో శరవేగంగా ఇళ్లు కట్టి ఇచ్చేశారు. అంటే మోడల్ ఫ్లాట్స్ అవి చూపించి గ్రేటర్‌లోని పేద ప్రజలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఖాయమని ప్రచారం చేశారు. అప్పటికప్పుడు దరఖాస్తులు తీసుకున్నారు. ఆ మోడల్ ఫ్లాట్స్ స్కెచ్ సక్సెస్ అయింది. టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించింది. తర్వాత రాష్ట్రమంతటా ఈ స్కీమ్ అమలుచేస్తున్నట్లుగా ప్రకటించారు.
కేసీఆర్ మాటలకు తెలంగాణ ప్రజలు ఫ్లాట్ అయిపోతారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలోనూ అదే జరిగింది. గవర్నమెంటు ఇచ్చే ఇళ్లంటే ఒక గదితో ఉండేలా కాకుండా రెండ్ బెడ్ రూమ్‌లు రెండు బాత్రూమ్లు ఉండేలా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు. దానికి డిగ్నిటీ హౌసింగ్ అనే పేరు పెట్టి 2015లో అక్టోబరులో ప్రారంభించారు. కానీ డబుల్ బెడ్ రూమ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. సాధారణంగా ప్రభుత్వాలు ఇచ్చే ఇళ్లు 260 చదరపు అడుగుల్లో ఉంటాయి. కానీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మాత్రం 560 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా ఉంటుంది. ఇండిపెండెంట్ ఇళ్లకు అయితే ప్లాట్ 125 చదరపు గజాలు ఉంటుంది. ఒకవేళ అపార్టమెంటు తరహా అయితే ఒక ఫ్లాట్‌కు 36 చదరపు గజల వాటా వచ్చేలా ఉంటుంది. మొత్తంగా భారతదేశంలో ఇంత పెద్ద ఇళ్లను పేదలకు నిర్మిస్తోన్న రాష్ట్రం తెలంగాణ ఒకటే అని ప్రచారం చేశారు.
ఈ పథకాన్ని ముందుగా కేసీఆర్ సొంత నిజయోజకవర్గం గజ్వేలులో పైలట్ ప్రాజెక్ట్ కింద మొదలుపెట్టారు. ఎర్రవల్లిలో మోడల్ కాలనీ కట్టారు. 2016 మార్చి 5న ప్రారంభించారు. అక్కడ తప్ప మిగిలిన చోట్ల అంత వేగంగా ఎక్కడా పూర్తి కాలేదు. ఆర్భాటంగా ప్రకటించారు కానీ ముందు నుంచీ చాలా ఆలస్యం అవుతూనే వచ్చింది ఈ పథకం. అనేక సందర్భాల్లో ఇళ్ల నిర్మాణం సగంలో ఆగిపోయాయి. తెలంగాణలో చాలా పట్టణాల శివార్లలో జిల్లా కేంద్రాల శివార్లలో సగం పూర్తయిన, 80 శాతం పూర్తయిన భారీ కాలనీలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లు పూర్తయినా కేటాయింపులు ఆలస్యం అయ్యాయి. చాలా చోట్ల కాలనీలోని ఇళ్ల సంఖ్య కంటే లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ ఉంది. అందరికీ సరిపడా ఇళ్లు పూర్తయ్యే వరకూ కేటాయింపులు ఆపించారు రాజకీయ నాయకులు. ఇప్పటివరకూ తెలంగాణ వ్యాప్తంగా 19 వేల 328 కోట్లను డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కేటాయించారు. ఎన్ని పూర్తి చే్శారో తెలియదు కానీ గత గ్రేటర్ ఎన్నికల సందర్భంగా
1 లక్షా 29 వేల 528 ఇళ్లు పూర్తయినట్లుగా హడావుడి చేశారు. ఈ అంశంపై అప్పట్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లు కూడా నడిచాయి.
అసలు తెలంగాణ ప్రభుత్వం 2016 నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇళ్లు అసలు నిర్మించలేదు. ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని కేంద్రం తెలిపింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రం రూ. లక్షా 80వేలు ఇస్తుంది. మిగతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. దీనికి కూడా రుణ ప్రాతిపదికిన లబ్దిదారులకు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే తెలంగాణ కేసీఆర్ ఇలాంటి సమస్యలు వద్దని చిన్న చిన్న ఇళ్లు అవసరం లేదని చెప్పి డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని ప్రవేశ పెట్టారు. కేంద్రం నుంచి పైసా కూడా తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నారు చాలా చోట్ల ఇవి పూర్తయ్యాయి. త్వరలో పేదలకు పంపిణీ చేయనున్నారు. ఈ కారణంగానే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణ ఎలాంటి ఇళ్లు నిర్మించలేదని రికార్డుల్లో ఉంది. అయితే అసలు కేంద్రం ఇచ్చే సాయం తీసుకోకుండా పేదలకు ఇళ్లు లేకుండా చేశారన్న విమర్శలు మాత్రం ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఎప్పటికప్పుడు మభ్యపెట్టి చేసేది రాజకీయం. కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకుని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు నిర్మించి ఉంటే ఇప్పటికి లక్షల మంది పేదలకు ఓ మాదిరి ఇల్లు వచ్చి ఉండేది. కానీ కేసీఆర్ చూపించిన అరచేతిలో వైకుంఠంతో కొంత మందికి మాత్రమే ఇప్పుడు డబుల్ బెడ్ రూం ఇళ్లు వస్తాయి. ఎక్కువ మందికి ఎదురు చూపులు తప్పవు. అయితే ఇలాంటి ఎదురు చూపులే రాజకీయ నేతల విజయ రహస్యం. కేసీఆర్ కూడా అదే ఫాలో అవుతున్నారని అనుకోవచ్చు.