కిరణ్ కు రాచ మర్యాదలు మరి పవన్ కు

By KTV Telugu On 10 April, 2023
image

ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఊరికే అనలేదు. నాలుగేళ్లుగా బిజెపితో అంటకాగుతోన్న పవన్ కళ్యాణ్ కు దక్కని గౌరవం నిన్న కాక మొన్న బిజెపిలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డికి దక్కడం చూస్తే పూర్వీకుల సామెతలు ఎంత యధార్ధంగా ఉండేవో అర్ధం అవుతుంది. ఇలా చేరారో లేదో అలా కర్నాటక ఎన్నికల బాధ్యతలు భుజాలపై పెట్టేసింది బిజెపి అగ్రనాయకత్వం. అది కూడా సముచిత గౌరవంతో. ఇపుడు దీనిపైనే సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఏపీలో బిజెపి మిత్రపక్షం అయిన  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తుల వ్యవహారంపై  ఓ మాట అనుకుందామనే పవన్ వెళ్లారు. తనతో పాటు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను కూడా తీసుకుని వెళ్లారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసిన పవన్ కళ్యాణ్ ను మొదటి రోజు కీలక నేతలెవరూ కలవనే లేదు. రాజకీయ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోగలిగిన నేతలెవరూ పవన్ తో చర్చించనూ లేదు. చివరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో భేటీ అయ్యారు. అంతే కానీ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షాను కలవడం కుదరలేదు. కర్నాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడం వల్లనే కలవడం కుదరలేదని అన్నారు. అది కూడా నిజమేనేమో అని అందరూ అనుకున్నారు.

సీన్ కట్ చేస్తే పవన్ ఢిల్లీ నుండి ఏపీ వచ్చేసిన తర్వాత ఏపీ నుండి మాజీ కాంగ్రెస్ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. బిజెపి లో చేరారు. ఆయన పార్టీలో చేరిన మర్నాడే అమిత్ షా రాజ్ నాథ్ సింగ్ వంటి దిగ్గజ నేతలు కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపారు. జేపీ నడ్డా కార్యాలయంలోనే ఈ భేటీ నిర్వహించారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఎంతో సాదరంగా స్వాగతించిన అమిత్ షా చర్చల అనంతరం కర్నాటక ఎన్నికల బాధ్యతను కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించేశారు. ప్రత్యేకించి కర్నాటకలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎన్నికల ప్రచారం తీరును కిరణ్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తారు. అవసరమైన సూచనలు సలహాలు ఇస్తారు. అంతే కాదు అక్కడ అభ్యర్ధుల జాబితా రూపకల్పనలోనూ కిరణ్ కుమార్ రెడ్డి తన అనుభవం మేరకు సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ తో పోలీస్తే బిజెపితో అనుబంధంలో కిరణ్ కుమార్ రెడ్డి సీనియర్ కాదు. జనాకర్షణ శక్తి విషయంలో చూసుకుంటూ అసలు పవన్ కు కిరణ్ దరిదాపుల్లో కూడా పోటీకి రాలేరు. ఏపీలోనే చిత్తూరు జిల్లా దాటితే కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారం చేసి ఓసీటు గెలిపించింది లేదు. సొంత జిల్లాలోనూ తన నియోజకవర్గంలో తాను గెలవడమే తప్ప ఇతర నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించింది లేదు. తన సొంత నియోజకవర్గంలో గెలిచింది కూడా కాంగ్రెస్ వేవ్ లోనే.

2004, 2009 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి పెరిగిన గ్రాఫ్ కారణంగానే కిరణ్ కుమార్ రెడ్డి గెలిచారు.
1994 ఎన్నికల్లో ఎన్టీయార్ ప్రభంజనంలో ఓడిన కాంగ్రెస్ నేతల్లో కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.
ఎటొచ్చీ వై.ఎస్.ఆర్. మరణానంతరం కాలం కలిసొచ్చి రోశయ్యను సిఎం పదవి నుండి తప్పించాల్సి వచ్చినపుడు చిదంబరం అండతో హైకమాండ్ ను మెప్పించి సిఎం పదవిని సంపాదించుకోగలిగారు కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ను వీడి జై సమైక్యాంధ్ర పార్టీని పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలోనూ తన పార్టీ అభ్యర్ధిని గెలిపించుకోలేకపోయారు. ఆయనకు జనసమ్మోహన శక్తి లేదని చెప్పడానికే ఇదంతా. అదే పవన్ కళ్యాణ్ ను తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీయార్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు పవన్. తన అన్న చిరంజీవికి గతంలో గ్లామర్ ఉన్నా ఇపుడు పవన్ కు ఉన్న ఫాలోయింగ్ తో పోలిస్తే చిరంజీవి జనాకర్షక శక్తి కూడా తక్కువే అంటారు రాజకీయ విశ్లేషకులు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరిన రెండో రోజునే అమిత్ షా రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ కావడం కీలక అసైన్ మెంట్ తీసుకోవడం జరిగిపోయాయి.

కానీ నాలుగేళ్ల క్రితమే బిజెపితో పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ నాలుగేళ్లలో పలు ఎన్నికల్లో బిజెపి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొని వారికి అండగా నిలిచారు పవన్. జనసేనాని తమతో ఉన్నాడంటేనే బిజెపికి వెయ్యేనుగుల బలం వచ్చేస్తుందని ఏపీ బిజెపి నేతలే ఒప్పుకుంటున్నారు. బిజెపికి రాజీనామా చేసిన మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా పవన్ ను బిజెపి సరిగ్గా వాడుకోలేకపోతోందనే అనేవారు. జనసేనతో మంచి సంబంధాలను కొనసాగిస్తే బిజెపికి తిరుగుండదని కన్నా అభిప్రాయ పడ్డారు. అయితే ఏపీ బిజెపిలో వాతావరణం సరిపడక గుడ్ బై చెప్పి టిడిపిలో చేరారు కన్నా. ఆయన ముందుగా జనసేనలో చేరాలని అనుకున్నారు. తెరచాటున ఏం జరిగిందో తెలీదు కానీ సడెన్ గా ఆయన చంద్రబాబు సమక్షంలో పచ్చకండువా కప్పేసుకున్నారు. nబిజెపితో ఏళ్ల తరబడి నమ్మకంగా ఉన్న పవన్ ఢిల్లీ వెళ్లినపుడు  అమిత్ షా వంటి నేతలు కలవకపోవడం నిజంగా తప్పిదమే అంటున్నారు రాజకీయ పండితులు. అణువణువునా ఆత్మాభిమానం నింపుకుని ఉన్న పవన్ కళ్యాణ్ నిజానికి ఎక్కడా రాజీ పడరు. బిజెపి అగ్రనేతలు వ్యవహరించిన తీరు ఆయనకు నచ్చలేదు. ఏపీలో వైసీపీని ఓడించడమే అజెండాగా పెట్టుకున్న తాను టిడిపితో కలిసిపోదామని చేసిన ప్రతిపాదనకు బిజెపి నాయకత్వం నో చెప్పడం కూడా పవన్ కు నచ్చలేదు. ఆయన బిజెపితో తెగతెంపులు చేసేసుకుంటారన్న ప్రచారం  కూడా జరిగింది. ఢి

ల్లీలోనే బిజెపి నేతలతో భేటీ అనంతరం వపన్ బిజెపికి కటీఫ్ చెబుతున్నట్లు మీడియా సమావేశం పెట్టి చెబుతారని అంతా అనుకున్నారు. దానికి భిన్నంగా పవన్ ఏపీలో బిజెపి సంస్థాగతంగా బలపడాల్సింది ఉందని మాత్రమే అన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ కవళికలు చూసిన వారికి ఆయన బిజెపి వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారని అర్ధమవుతుంది. అయినా ఆయన బిజెపితో ఎందుకు తెగతెంపులు చేసుకోలేదా అని ఆయన అభిమానులు కుత కుత లాడిపోతున్నారు. జనసైనికులు పవన్ అభిమానులైతే తమ నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వని బిజెపిని చూస్తే ఒళ్లు మండిపోతోంది.
వాళ్లకే కాదు పవన్ కళ్యాణ్ కు కూడా  కోపం ఉంది. కాకపోతే రాజకీయ పరిణతితో పవన్ దాన్ని దిగమింగుకుంటున్నారంతే అంటున్నారు రాజకీయ పండితులు. బిజెపితో జనసేన కటీఫ్ చెప్పడం బిజెపి నేతలకన్నా కూడా చంద్రబాబు నాయుడికి అస్సలు ఇష్టం లేదంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే బిజెపి తో పొత్తు ఉండాల్సిందే అని చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కోరుకుంటున్నారు. అందుకే బిజెపితో పొరపాటున కూడా తెగతెంపులు చేసుకోవద్దని ఎన్నికల వరకు చాలా సమయం ఉంది కాబట్టి ఓపిగ్గా టిడిపితో పొత్తుకు ఒప్పించుకోచ్చునని చంద్రబాబు నాయుడు పవన్ కు చెప్పారని ప్రచారం జరుగుతోంది.

కాబోయే భాగస్వామి కాబట్టే చంద్రబాబు మాటలకు విలువనిచ్చి పవన్ తగ్గి ఉన్నారే తప్ప లేదంటే బిజెపికి ఎప్పుడో గుడ్ బై చెప్పేసి ఉండేవారని జనసైనికులు అంటున్నారు. చంద్రబాబు భయం ఏంటంటే బిజెపితో జనసేన తెగ తెంపులు చేసుకుంటే 2024 ఎన్నికల్లో టిడిపి-జనసేన కూటమి ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డా ఎన్నికల సంఘం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చంద్రబాబు కంగారు పడుతున్నారు. అదే విధంగా ఓట్లను కొనుగోలు చేయడానికి డబ్బుల తరలింపును కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎప్పటికప్పుడు పసిగట్టి వాటికి అడ్డుకట్ట వేస్తాయని చంద్రబాబు అనుకుంటున్నారు. అందుకే ఆత్మ గౌరవానికి పెద్ద పీట వేసే పవన్ బిజెపికి గుణపాఠం చెప్పేలా గుడ్ బై చెబుతారని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి అయిష్టంగా బిజెపిలో కొనసాగుతున్నా మునుముందు తనకి తగిన గౌరవాన్ని బిజెపి నేతలు ఇవ్వకపోతే మాత్రం ఆ దేవుడే దిగి వచ్చి వారించినా పవన్ రాజీ పడే ప్రసక్తే ఉండదంటున్నారు జనసైనికులు. పవన్ దూరం అయితే ఏపీలో బిజెపి గురించి మాట్లాడుకునే వాళ్లే ఉండరని వారంటున్నారు. సో ప్రస్తుతానికి పవనాల కన్నా కిరణాలకు ఎక్కువ విలువనిస్తోన్న కమలనాథులు తమ తీరు మార్చుకుంటారో లేదో చూడాలంటున్నారు పరిశీలకులు.