పార్టీ వేటు వేయదు వాళ్లు రాజీనామాలు చేయరు కానీ ధిక్కారస్వరం వినిపిస్తూనే ఉంటుంది. దమ్ముంటే చర్య తీసుకోండి అన్నట్లు అసంతృప్త నేతలు కవ్విస్తుంటారు. మీరున్నా లేనట్లే మా లెక్కలోంచి ఎప్పుడో తీసేశాం మీరే వెళ్లిపోండన్నట్లు గులాబీపార్టీ సంకేతాలు. ఈ దాగుడుమూతలతో వారు పార్టీలో ఉన్నట్లో లేనట్లో తెలీక కేడర్ గందరగోళం. కొన్నేళ్లుగా కేసీఆర్ పార్టీలో ఇదే జరుగుతోంది. డీఎస్‌తో తేడావచ్చింది ఆయన్ని పక్కనపెట్టేశారు. పార్టీనుంచి సస్పెండేమీ చేయలేదు ఆయనే నిదానంగా దూరమైపోయి, చివరికి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరబోయి ఫ్యామిలీ గొడవల్లో ప్యాక్ అయిపోయారు. అంతా డీఎస్‌లాగే జరిగిపోతుందనుకుంటే ఎలా కుదురుతుంది ఎవరి లెక్క వారికుంటుంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ మొన్నటిదాకా అందరినీ ఆశ్చర్యపరిచింది. కొన్ని నెలలుగా పార్టీ నాయకత్వంతో విభేదిస్తున్న పొంగులేటి కొత్త సంవత్సరంనుంచీ దాచుకోడానికేమీ లేదన్నట్లు బయటపడ్డారు. ఆత్మీయ సమ్మేళనాలతో ప్రధాన పార్టీలకు సవాళ్లు విసురుతున్నారు. ఇంకా జెండా ఎజెండా తేలకపోయినా నియోజకవర్గాలవారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. ఖమ్మం బీఆర్ఎస్‌లో ఎవరు కారుపార్టీతో ఉన్నారో ఎవరు పొంగులేటి వెంట వెళ్తారో తెలీనంత గందరగోళం ఏర్పడేదాకా నాయకత్వం స్పందించలేదు. ఆయనకు మద్దతిస్తున్న నాయకులపై వేటు వేసిందేగానీ పొంగులేటి జోలికి వెళ్లలేదు. ఆయనే రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నది కేసీఆర్ పార్టీ వ్యూహం.
ఆ అవసరం నాకేముందన్నట్లు పొంగులేటి పార్టీలో ఉంటూనే పొగబెట్టేశారు. దాంతో ఉక్కిరి బిక్కిరైన బీఆర్ఎస్ చివరికి ఆయనపై వేటు వేసింది. ఆయనకూడా దీనికోసమే చూస్తున్నట్లు ఆనందంగా స్పందించారు. బీఆర్ఎస్ వేటు వేసిన మరోనేత కేసీఆర్ సామాజికవర్గానికే చెందిన జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కూడా. ఇండిపెండెంట్‌గానే గెలిచిన సత్తా ఉన్న నాయకుడు. కాంగ్రెస్‌నుంచి కారుపార్టీలోకి వచ్చినా తగిన గుర్తింపు దక్కలేదన్నది ఆయన అసంతృప్తి. పైగా కొల్లాపూర్ నుంచి గెలిచిన అధికారపార్టీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డితో జూపల్లికి ఏమాత్రం పడటం లేదు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ నుంచి బీరంకే మరో ఛాన్స్ దక్కేలా ఉంది. ఎందుకంటే ఫాంహౌస్ ఎమ్మెల్యేల కుట్ర కేసులో చాకచక్యంగా బీజేపీ కుట్రను ఛేదించిన ఎమ్మెల్యేల్లో ఒకరిగా బీరంకు గుర్తింపు వచ్చేసింది. దాదాపు ఏడాదిన్నరనుంచీ జూపల్లి-బీరం మధ్య కొల్లాపూర్‌లో పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. వీరిద్ధరి మధ్య సయోధ్యకు ప్రయత్నించిన అధికారపార్టీ పెద్దలు జూపల్లి రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇవ్వలేక పోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచో ఇండిపెండెంట్‌గానో పోటీచేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి భారీగా అనుచరులతో తరలి వెళ్లటంతో ఇక లాభంలేదని ఆయనపై కూడా బీఆర్ఎస్ అధిష్ఠానం వేటు వేసింది.
బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న నేతలకు పొంగులేటి జూపల్లి రోల్ మోడల్స్‌లా కనిపిస్తున్నారు. ఏడాదిలోపే ఎన్నికలు ఉండటంతో మిగిలినవాళ్లు కూడా వీళ్లని ఆదర్శంగా తీసుకుంటే కొంప కొల్లేరు అవుతుందని కేసీఆర్ పార్టీకి అర్ధమైంది. అందుకే ఎప్పుడూ లేనివిధంగా పార్టీనుంచి బహిష్కరించాలన్న నిర్ణయానికి వచ్చారు. అసలే బీజేపీ కంట్లో నలుసులా తయారైంది. దీనికి పార్టీలోని అసమ్మతి తోడైతే వచ్చే ఎన్నికల్లో కొంప కొల్లేరు అయ్యేలా ఉంది. పార్టీ సస్పెండ్ చేయగానే దీనికోసమే వెయిటింగ్ అన్నట్లు ఇద్దరు నేతలు స్పందించారు. ఈ ఇద్దరూ తమ టికెట్ల కోసం మరో పార్టీ గూటికి చేరితే బీఆర్ఎస్‌కు నష్టం ఆ నియోజకవర్గాలకే పరిమితం అవుతుంది. కానీ ఇద్దరూ కూటమికట్టి బీఆర్ఎస్ అసంతృప్తి నేతలందరినీ ఓ గూటికిచేర్చే ప్రయత్నంచేస్తే మాత్రం కేసీఆర్‌కి పెద్ద సవాలే. ఈ భయానికి తగ్గట్లే పొంగులేటి జూపల్లి కాంబినేషన్‌లో కొత్త రాజకీయపార్టీనో వేదికనో తెరపైకి రావచ్చన్న ప్రచారం మొదలైంది. అదే జరిగితే రెడ్డి వెలమ కాంబినేషన్ కేసీఆర్ పార్టీకి కొత్త సమస్యలు సృష్టించవచ్చు.