మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల..

By KTV Telugu On 3 October, 2022
image

* నవంబర్ 3న పోలింగ్..నవంబర్ 6న కౌంటింగ్
* అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌

తెలంగాణాలో మూడు ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. దేశంలోని పలు రాష్ట్రాల ఉప ఎన్నికలతో పాటు మునుగోడుకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ని వెలువరించింది. దీనికి సంబసంధించిన నోటిఫికేషన్ ఈ నెల 7వ తేదీన విడుదలవుతుంది. 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 17 చివరి తేదీ. నవంబర్‌ 3వ తేదీన పోలింగ్ జరుగుతుంది. 6న ఓట్ల లెక్కిస్తారు. ఇప్పుడు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల కావడంతో తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
మునుగోడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఈ ఉప ఎన్నికలో బీజేపీ తరపున మళ్లీ కోమటిరెడ్డి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పాల్వాయి స్రవంతి రెడ్డి పోటీ చేయబోతున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనేది ఇప్పటివరకు ప్రకటించలేదు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో తమ పార్టీ నుంచి పోటీచేయబోయే అభ్యర్థి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉంది.
త్వరలో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న కేసీఆర్ కు ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ పేరుతో పోటీ చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. మరోవైపు దూకుడు మీదున్న బీజేపీ ఈ ఉప ఎన్నికలో గెలవాలనే పట్టుదలతో ఉంది. మునుగోడులో విజయం సాధించి పునర్వైభవాన్ని చాటుకోవాలని ఆలోచనలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది.