వైఎస్ వివేకా మర్డర్ మిస్టరీ హాలీవుడ్ థ్రిల్లర్ సిన్మాలా రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటిదాకా కొత్తకొత్త పేర్లు తెరపైకొచ్చాయి. సీబీఐ కొందరిని అనుమానిస్తే కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ తీరునే నిందితులు అనుమానించారు. ఈ దాగుడుమూతల మధ్య నెలాఖరులోగా కేసు విచారణ తేల్చాలని కోర్టు ఆదేశించటంతో కొత్త కొత్త వాదనలు తెరపైకొస్తున్నాయి. తాజాగా హైకోర్టులో వివేకా హత్యకేసులో కొత్త కోణాన్ని ప్రస్తావించారు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి న్యాయవాది. మొన్నటిదాకా డబ్బు వివాదానికి తోడు రాజకీయంగా అడ్డొస్తున్నాడనే వివేకాను హతమార్చారన్న కన్క్లూజన్కి వచ్చింది సీబీఐ. ఇప్పుడు అవే కాదు వేరే కారణాలు ఉన్నాయంటూ కొత్త వాదనలు వినిపిస్తున్నారు నిందితులు. వైఎస్ వివేకా హత్యకేసులో దస్తగిరి కూడా నిందితుడే. అయితే అతను అప్రూవర్‌గా మారటంతో బయట ఉన్నాడు. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న దస్తగిరిని అప్రూవర్‌గా అంగీకరించడాన్ని సవాల్ చేస్తూ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి హైకోర్టులో పిటిషన్ వేశారు. సీబీఐ టీడీపీ వివేకా కూతురు సునీత కలిసిపోయి దస్తగిరిని అప్రూవర్‌గా మార్చారని ఆరోపించారు. సునీత సాయంతో టీడీపీ నేతలు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిలపై కుట్ర పన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు. వివేకా హత్యకు ఆయన లైంగిక వేధింపులే కారణమంటున్నారు భాస్కర్ రెడ్డి తరపున వాదిస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి.
వివేకాను హత్యచేసిన సునీల్ యాదవ్ తల్లిని వైఎస్ వివేకా లైంగికంగా వేధించారన్న నిందితుల న్యాయవాది వాదనతో కేసు మరింత ఆసక్తి కలిగిస్తోంది. తల్లిని వేధించినందుకే సునీల్ యాదవ్ వివేకా హత్యకు కుట్రపన్నాడన్నది నిందితుల లాయర్ కొత్త వాదన. రెండో భార్య కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించడంతో కుటుంబంలో విబేధాలు తలెత్తాయని వివేకా హత్యకు అది కూడా కారణమని వాదించారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని సీబీఐ పరిగణనలోకి తీసుకోవడం లేదని భాస్కర్‌రెడ్డి లాయర్ ఆరోపించారు. దస్తగిరిని అప్రూవర్‌గా గుర్తిస్తూ కడప మేజిస్ర్టేట్ కోర్టు క్షమాభిక్ష పెట్టడానికి సవాల్ చేస్తూ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి వైఎస్ భాస్కర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో వేర్వేరుగా వేసిన పిటిషన్లపై ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. రేపు ఎవరు నిందితులని తేలుతుందో ఎవరికి శిక్ష పడుతుందో తెలీదుగానీ దారుణహత్యకు గురైన వైఎస్ వివేకా క్యారెక్టర్ని కించపరిచేలా కోర్టులో నిందితుల వాదనలు ఉన్నాయని కుటుంబసభ్యులు ఆవేదనకు గురవుతున్నారు. ఆయనకు ఓ ముస్లిం మహిళతో సంబంధాలున్నాయని ఆమెను 2011లో పెళ్లి కూడా చేసుకున్నారని గతంలో నిందితులు ఆరోపించారు. వివేకా మతంగా కూడా మార్చుకున్నారని స్వయంగా ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పారు. ఆస్తి తగాదాలతోనే బాబాయ్ హత్య జరిగి ఉండొచ్చని అనుమానించారు. ఇప్పుడేమో ఆయన తండ్రి తరపు లాయర్ లైంగిక వేధింపులకు గురించేసినందుకే ఓ మహిళ కొడుకు ఆయన్ని హతమార్చాడని చెబుతున్నారు. ఇలాంటి ఆరోపణలు వైఎస్ కుటుంబానికి తలవంపులు తెస్తాయని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. వివేకాపై అక్రమ సంబంధాల ఆరోపణలను వైఎస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.