నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు. మొన్నటిదాకా హిజాబ్ హలాల్ లాంటి వివాదాలు. తర్వాత రిజర్వేషన్ చిచ్చు. కానీ ఇప్పుడు వాటన్నింటినీ మించిపోయింది పాల సెంటిమెంట్. కర్నాటకలో పాల వ్యవహారం అక్కడి రాజకీయాల్ని కుదిపేస్తోంది. ఈ నెల 5న అమూల్ చేసిన ట్వీట్ కర్నాటక రాజకీయాల్లో రచ్చ రాజేసింది. కర్నాటకలో అమూల్ చాలా కాలంగా వ్యాపారం చేస్తోంది. హుబ్లీ బెళగావి ప్రాంతంలో 2015 నుంచి అమూల్ ప్యాకెట్ మిల్క్ అమ్ముతోంది. త్వరలో బెంగళూరులో తాజా పాలు అందుబాటులోకి రానున్నాయని ఆ ట్వీట్‌లో అమూల్ ప్రకటించింది. ఇప్పటికిప్పుడు అమూల్ స్టోర్స్ పార్లర్లు ఏమి ఏర్పాటు చేయదని చెప్తున్నారు. బెంగళూరు సిటీలో Eకామర్స్ క్విక్ కామర్స్ ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారానే ప్రొడక్ట్స్ విక్రయిస్తామని చెప్తోంది అమూల్. మామూలుగా అయితే ఓపెన్ మార్కెట్‌లో ఎవరు ఏదన్నా అమ్ముకోవచ్చు. కానీ సెంటిమెంట్ పాలు కాస్త ఎక్కువగా ఉండే కన్నడిగులకు అమూల్ ప్రకటన ఏమాత్రం రుచించలేదు.
అమూల్ ప్రకటనను కన్నడవాద సంస్థలు విపక్షాలు తప్పుబట్టాయి. కర్నాటక్ మిల్క్ ఫెడరేషన్ కూడా అమూల్ ప్రకటనను తప్పుపట్టింది. మిగులు పాలు ఉన్న రాష్ట్రంలో రెండు విజయవంతంమైన సహకార సంస్థలు పోటీపడటం నష్టం కలిగిస్తుందంటోంది కర్నాటక మిల్క్ ఫెడరేషన్. హైదరాబాద్ చెన్నై ముంబయి గోవా మార్కెట్లలో నందిని అమూల్ పోటీపడుతుంటాయి. ఈ క్రమంలో కర్నాటకలో అమూల్ రాకుండా చూడాలని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు లేఖ రాయబోతోంది కేఎంఎఫ్. అమూల్ రాకతో కర్నాటక మిల్క్ ఫెడరేషన్ అభివృద్ధిచేసిన నందిని బ్రాండ్ దెబ్బతింటుందన్న ఆందోళనలు మొదలయ్యాయి. బెంగళూరు హోటల్స్ యూనియన్ ఓ అడుగుముందుకేసి అమూల్ ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలనుకుంటోంది.
అమూల్ ప్రకటనతో ఇంత దుమారం రేగడానికి నేపథ్యం ఉంది. వాస్తవానికి అమూల్-నందిని వివాదం 2022 డిసెంబర్ 30న కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనతోనే వివాదం రాజుకుంది. కర్నాటకలో గ్రామగ్రామాన పాడి పరిశ్రమ సాఫీగా సాగేందుకు అమూల్-కేఎంఎఫ్ కలిసి పనిచేస్తాయని అప్పట్లో అమిత్ షా ప్రకటించారు. నందిని-అమూల్ సహకారం డెయిరీ రంగంలో అద్భుతాలు సృష్టిస్తుందని అన్నారు. అయితే ఈ ప్రకటన నందినిని అమూల్‌లో విలీనం చేసే ప్రయత్నమని అంతా అనుమానించారు. అందుకే అమూల్ ప్రకటనలతో కర్నాటకలో దానికి వ్యతిరేకంగా ఓ ఉద్యమమే మొదలైంది. బీజేపీని ఇరకాటంలోపెట్టేందుకు ఈ అవకాశాన్ని కాంగ్రెస్ జేడీఎస్ ఆయుధంలా వాడుకుంటున్నాయి. అమూల్-నందిని గురించి తప్పుడు ప్రచారం జరుగుతోందని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించినా ఆందోళనలు సద్దుమణగడంలేదు.
బెంగళూరులో అమూల్ రాకను నిరసిస్తూ కన్నడ రక్షణ వేదిక సంస్థ కార్యకర్తలు నిరసనలకు దిగారు. అమూల్ ఉత్పత్తులను బహిష్కరిస్తూ కన్నడిగులంతా ప్రతిజ్ఞ చేయాలని కాంగ్రెస్‌కి చెందిన మాజీ సీఎం సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. బలవంతంగా హిందీ భాషను రుద్దుతున్న బీజేపీ ఇప్పుడు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కర్నాటక మిల్క్ ఫెడరేషన్‌ని సంక్షోభంలో పడేసేందుకు ప్రయత్నిస్తోందని సిద్దరామయ్య ఆరోపించారు. 87 ఏళ్ల చరిత్ర ఉన్న మంగళూరు విజయా బ్యాంకును బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ ఆయన అగ్నికి ఆజ్యంపోస్తున్నారు. గుజరాత్‌కు చెందిన అమూల్ పాలు పెరుగుని కన్నడనాట అమ్మనివ్వమని కాంగ్రెస్ జేడీఎస్ పోటీలుపడి సవాళ్లు చేస్తున్నాయి. అమూల్ పాల ఉత్పత్తులకు లైన్ క్లియర్ చేసేందుకు కర్నాటకలో పాలకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న వాదన మొదలైంది. రోజుకు 90 లక్షల లీటర్లు ఉత్పత్తి కావాల్సి ఉండగా 75 లక్షల లీటర్లు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నామని బెంగళూరు మిల్క్ యూనియన్ లిమిటెడ్ ప్రతినిధులు చెబుతున్నారు.
పాల ఉత్పత్తిలో దేశంలో అమూల్‌దే అగ్రస్థానం. కర్నాటక మిల్క్ ఫెడరేషన్ రెండో స్థానంలో ఉంది. అమూల్ రోజూ 1.8 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంటే కేఎంఎఫ్ రోజుకు 90 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తుంది. 22వేల గ్రామాల్లో విస్తరించిన కర్నాటక మిల్క్ ఫెడరేషన్ 24 లక్షల మంది సభ్యులతో బలంగా ఉంది. ఆ ఫెడరేషన్ చైర్మన్ పదవిని కర్నాటక నేతలు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఎన్ని వివరణలు ఇచ్చినా అమూల్‌పై వ్యతిరేకత పెరుగుతుండటంతో కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. పరిస్థితి ఇలాగే ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో కొంప మునుగుతుందని ఎన్నికలయ్యేదాకా అయినా అమూల్ ఉత్పత్తులకు బ్రేక్ వేయాలన్న ఆలోచనతో ఉంది.