ఎప్పుడో రాష్ట్ర విభజన జరిగిపోయింది ఉద్యమకాలంలో నేతలు మాటలు తూలారు. రెండు తెలుగురాష్ట్రాల మధ్య విభజనరేఖలు గీశారు. నాయకులు నాయకులు తిట్టుకోవడమే కాదు ప్రజలను కూడా నిందించారు. సంస్కృతులను అవహేళన చేశారు వంటకాలను కూడా వివాదాల్లోకి లాగారు అదంతా గతం. రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నా ద్వేషమైతే లేదు. రెండురాష్ట్రాల ప్రజల మధ్య సంబంధాలు మునుపటిమాదిరే ఉన్నాయి. ఆంధ్రా-తెలంగాణ అన్న తేడా ఎక్కడా లేదు కానీ మళ్లీ ఎన్నికలొస్తున్నాయి నేతల రాజకీయం మొదలైంది. దీంతో తెలుగురాష్ట్రాలమధ్య మళ్లీ మాటల మంటలు ఎగసిపడుతున్నాయి. ఎవరు మొదలుపెట్టారు ఎవరు కొనసాగించారన్నది కాదు సమస్య. అసలు రాష్ట్రాలు పరస్పరం నిందించుకోవాల్సిన రావడమే దురదృష్టకర పరిణామం. విశాఖ స్టీల్‌ప్లాంట్ దగ్గర మొదలైంది సంవాదం. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయించింది కార్మికుల ఉద్యమాల్ని రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ని పట్టించుకోకుండా ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభించింది. స్టీల్‌ఫ్యాక్టరీని కాపాడుకునే విషయలో ఏపీ వాదనకు తెలంగాణ కూడా మద్దతు పలికింది. ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న ఆలోచనని తప్పుపట్టింది. ఎవరెన్ని చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే. ప్రైవేటీకరణ ఆగదన్న విషయం అర్ధమైపోయింది అయితే విశాఖ స్టీల్‌ప్లాంట్ బిడ్‌లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించటంతో రెండు రాష్ట్రాల నేతల మధ్య మాటలయుద్ధం మొదలైంది. స్టీల్‌ప్లాంట్ గొడవ జరుగుతుండగానే అభివృద్ధిపై వాదులాడుకుంటున్నారు ఏపీ తెలంగాణ నేతలు.
సంగారెడ్డి కార్మికుల సభలో తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన కామెంట్స్ చిచ్చు రాజేశాయి. ఏపీ తెలంగాణ రెండు ప్రాంతాలను ప్రత్యక్షంగా చూసిన మీకు అక్కడి రోడ్లు ఆసుపత్రుల పరిస్థితి తెలిసే ఉంటుందని హరీష్ వ్యాఖ్యానించారు. ఏపీ కంటే తెలంగాణనే అన్నివిధాలా ఉత్తమమని అందుకే అక్కడ ఓటు వదిలేసి తెలంగాణలోనే నమోదు చేసుకోవాలని హరీష్ పిలుపునిచ్చారు. ఏపీ పాలనకు తెలంగాణ పాలనకు నింగికీ నేలకీ ఉన్నంత తేడా ఉందంటూ తెలంగాణ మంత్రి చేసిన కామెంట్స్‌తో ఏపీ అధికారపార్టీ నేతలు ఉలిక్కిపడ్డారు. ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలంగాణ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మంత్రులు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు. హరీష్‌రావు ఏపీకొచ్చి చూస్తే వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు కారుమూరి. స్కూళ్లనుంచి ఆస్పత్రుల దాకా ఏపీలో జరిగిన అభివృద్ధి గురించి చెబుతూ తెలంగాణలో ఆ రంగాల పరిస్థితేంటని ప్రశ్నించారు ఏపీ మంత్రి కారుమూరి. దీంతో బీజేపీ ప్రాపకం కోసం అధికార ప్రతిపక్షాలు పాకులాడటం తప్ప మీ రాష్ట్రంలో ఏముంది అంటూ బీఆర్‌ఎస్ నేతలు ఎదురు ప్రశ్నించారు. గతంలోనూ కేటీఆర్ ఓ సందర్భంలో ఏపీ రోడ్లపై చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య మాటల మంటలు రాజేశాయి. ఇప్పుడు హరీష్‌రావు మరోసారి అదే మంటపెట్టారు. ఆయన కావాలనే అన్నారా లేదా ఫ్లోలో వచ్చేసిందా అన్నది పక్కనపెడితే ఎన్నికలముందు రెండు తెలుగురాష్ట్రాల మధ్య ఈ పరిణామాలు ప్రభావం చూపబోతున్నాయి.
టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా మారింది. పార్టీని దేశమంతా విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు. పొరుగు తెలుగురాష్ట్రమైన ఏపీలో పార్టీ విస్తరణకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ సెంటిమెంట్‌ని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడం రెండు రాష్ట్రాల అభివృద్ధిని పోల్చడం రాజకీయ వ్యూహంలో భాగంలాగే ఉంది. తెలంగాణ అభివృద్ధిని ఏపీలో నమూనాగా చూపాలనుకుంటోంది కేసీఆర్ పార్టీ. హరీష్‌రావు వ్యాఖ్యలు ఆ ప్రయత్నంలో భాగమేనంటున్నారు. ప్రజల్లో అభివృద్ధిపై చర్చ జరగాలని బీఆర్‌ఎస్ కోరుకుంటున్నట్లుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఉత్సాహం చూపుతుండటం కూడా ఏపీ సర్కారుని ఇబ్బందిపెడుతోంది. అవకాశం ఉంటే తామే ఆపేవాళ్లమని తెలంగాణ ప్రభుత్వమే కాదు సింగరేణి సంస్థకు కూడా బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం లేదని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. జాతీయపార్టీగా విస్తరణ బీఆర్‌ఎస్‌కి రాజకీయంగా అనివార్యం. ఉత్తరాదిలో అద్భుతాలు సృష్టిస్తామన్న ఆశలేం లేవు. అందుకే ఏపీపై ఫోకస్‌పెడుతోంది బీఆర్‌ఎస్-వైసీపీ మధ్య పొలిటికల్ ఫైట్ మొదలైతే దాని ప్రభావం రెండురాష్ట్రాలమీద ఉంటుంది.