ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్తుల విలువెంతో తెలుసా. కేవలం 510 కోట్లే. అదేంటో లక్షకోట్లు లక్షకోట్లని తెలుగుదేశం ఎప్పట్నించో గోల చేస్తోందిగా అనుకుంటున్నారా మరి అవన్నీ ఎక్కడున్నాయో చెప్పాల్సింది చంద్రబాబుపార్టీనే. అధికారికంగా మాత్రం జగన్మోహన్రెడ్డి ఆస్తుల విలువ 510 కోట్లు. మరీ ఇంత తక్కువా అనుకునేరు. ఆమాత్రం ఆస్తులకే ఆయన దేశంలోనే నెంబర్‌వన్ పొజిషన్లో ఉన్నారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లోనే అత్యంత ఆస్తిపరుడు వైఎస్ జగన్మోహన్రెడ్డినే. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అధికారికంగా నమోదుచేసుకున్న ఆస్తుల ప్రకారం చూసినా దేశంలోనే జగన్ నెంబర్‌వన్.
దేశంలోని మొత్తం 30 మంది సీఎంలలో ఒక్కరు తప్ప మిగిలిన 29 మంది ముఖ్యమంత్రులూ కోటీశ్వరులే. ఆ ఒక్కరు ఎవరంటే పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ. ఆమె ఆస్తుల విలువ కేవలం 15 లక్షలేనట. సాధారణ కుటుంబాలకు కూడా ఆమాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందే మరీ అంతేనా అనుకుంటే అధికారికంగా అంతేమరి. ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మందికి సగటున రూ.33కోట్ల 96 లక్షల ఆస్తులు ఉన్నాయి. ఏపీ సీఎం తర్వాతి స్థానంలో 163కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమ ఖండూ ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆస్తుల విలువ 63 కోట్లు. బీహార్ సీఎం నితీష్‌కుమార్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆస్తుల విలువ మూడేసి కోట్ల రూపాయలంటోంది ఏడీఆర్ నివేదిక. ఇక కేరళ సీఎం పినరయి విజయన్ హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఆస్తులు చెరో కోటి రూపాయలు ఉన్నాయంతే.
ఎన్నికల అఫిడవిట్లో నేతలు చెప్పేదంతా నిజం కాదు. అధికారికంగా నేతలు వెల్లడించే ఆస్తులు కూడా అంతే. ఆస్తులు అలా ఉంచితే దేశంలోని 30 మంది సీఎంలలో 13 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. వీరిలో 43 శాతంమంది హత్య హత్యాయత్నం కిడ్నాప్ బెదిరింపులు ఆస్తుల ధ్వంసం వంటి నేరపూరిత కేసులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్లలో వాళ్లే ఆవిషయాన్ని అంగీకరించారు. విచారణకు వచ్చి నేరనిరూపణ అయితే ఐదేళ్లు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక కేసులు ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ టాప్‌లో ఉన్నారు. ఆయనపై 64 కేసులు నమోదయ్యాయి. తర్వాత 47 కేసులతో తమిళనాడు సీఎం స్టాలిన్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. 38 కేసులతో ఏపీ సీఎం జగన్ మూడో స్థానంలో నిలిచారు. ఫోర్జరీ బెదిరింపులు దాడులతోపాటు అక్రమాస్తులపై సీబీఐ ఈడీ కేసులు కూడా ఏపీ సీఎంపై ఉన్నాయి. మొత్తానికి తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆస్తులు కేసుల్లో టాప్ త్రీ స్థానాలతో తగ్గేదేలేదన్నట్లు రాజకీయం చేస్తున్నారు.