సెంటిమెంట్ ను ఆయింట్ మెంట్ గా వాడుకునేవాళ్లున్నారు. సెంటి మెంట్ ను మంటలుగా మార్చి చలికాచుకునే వారూ ఉన్నారు. సెంటిమెంటే పెట్టుబడిగా రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిన వారు ఉన్నారు. సెంటి మెంట్ తో మనుషుల మధ్య చిచ్చు మాత్రం రేపడం న్యాయం కాదంటున్నారు మేథావులు. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో సెంటిమెంట్ పాలిటిక్స్ ఎన్నో అనర్దాలకు కారణమవుతున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ రావ్ చేసిన వ్యాఖ్యలు కూడా తెలుగు రాష్ట్రాల మధ్య మంటలు రాజేసేలా ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు.
తెలంగాణ మంత్రి హరీష్ రావు సంగారెడ్డిలో ఓ సభలో తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్రా కార్మికులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు భగ్గుమన్నాయి. మీకు ఆంధ్రాలో ఓటు హక్కు ఉంది. మీరు అర్జంట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మీఓటు హక్కును రద్దు చేసుకుని తెలంగాణాలో ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోండి అని అన్నారు. మీరు ఎలాగూ ఉండేది ఇక్కడే. తెలంగాణాలో చెమట చుక్క కార్చే ప్రతీ కార్మికుడూ మా బిడ్డలే అని కేసీయార్ ఎప్పుడో చెప్పారు. మేడే రోజున మీరు ఊహించని మంచి వార్తను వింటారు. అంచేత మీరు తెలంగాణాలోనే ఓటు హక్కు ఉంచుకోండి. ఇక్కడ లేకపోతే కొత్తగా ఓటు హక్కు కోసం అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆంధ్రతో పోలిస్తే తెలంగాణాలో మీ జీవితాలు చాలా బాగుంటాయి. ఆంధ్ర-తెలంగాణాలను పోలిస్తే భూమికీ ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఇక్కడి పాలనతో అక్కడి పాలనను పోల్చి చూసుకోండి. అక్కడ రోడ్లు లేవు ఆసుపత్రులు అధ్వాన్నంగా ఉన్నాయి తెలంగాణా మీకు భూతల స్వర్గంలా ఉంటుంది అని హరీష్ రావు పిలుపు నిచ్చారు.
హరీష్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మండి పడుతున్నారు. మిగులు బడ్జెట్ తో తెలంగాణా రాష్ట్రాన్ని ఇస్తే మీరేం చేశారో మాకుతెలీదనుకున్నారా మీకూ మాకూ పోలికేంటి మా దగ్గర ఉన్నన్ని సంక్షేమ పథకాలు మీ దగ్గర ఎక్కడున్నాయసలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి హరీష్అ ని ఏపీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. సరే దానికి హరీష్ రావు మరో కౌంటర్ ఇస్తే రేపు దానికి ఏపీ మంత్రులు ఇంకోటి ఇస్తారు. ఇక్కడ విషయం ఏపీ గొప్పదా తెలంగాణా గొప్పదా అన్నది కాదు రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య చిచ్చు రేపేలా హరీష్ రావు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారన్నదే ప్రశ్న. ఏ సెంటిమెంట్ కోసం హరీష్ తాపత్రయ పడుతున్నారో అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ పండితులు. కొన్నేళ్ల క్రితం ప్రత్యేక తెలంగాణా సెంటిమెంట్ తోనే టి.ఆర్.ఎస్. ను స్థాపించారు కేసీయార్. ఏళ్ల తరబడి సెంటిమెంట్ తోనే పోరాటాలు చేశారు. చివరకు 2014లో రాష్ట్రాన్ని సాధించుకున్నారు. రాష్ట్రం వచ్చే వరకు ఆంధ్ర ప్రాంత ప్రజలపైనా వారి ఆచార వ్యవహారాలపైనా విద్వేష పూరిత వ్యాఖ్యలు విమర్శలు చేశారు కేసీయార్. ఆయనే కాదు టి.ఆర్.ఎస్. నేతలంతా అలానే వ్యవహరించారు. సరే రాష్ట్ర సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకోసం వారు సెంటిమెంట్ ను అస్త్రంగా మలుచుకున్న కారణంగా అలాంటి వ్యాఖ్యలు చేశారని అనుకున్నారు అప్పట్లో. రాష్ట్రం ఏర్పాటుతోనే తెలంగాణ సెంటిమెంట్ తో పని అయిపోయింది.
ఇక తెలంగాణా అభివృద్ధిపైనే వారు దృష్టి సారించాలి. తెలంగాణా సాధించి తొమ్మిదేళ్లు పూర్తయిపోయింది. పైగా కొద్ది నెలల క్రితమే కేసీయార్ టి.ఆర్.ఎస్. పేరును బి.ఆర్.ఎస్. గా మార్చారు. ఇకపై తమది జాతీయ పార్టీ అన్నారు. దేశ వ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. జాతీయ పార్టీ అని చెప్పుకున్న బి.ఆర్.ఎస్. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ పైనే ఇప్పటికీ విషం చిమ్మితే ఇక ఇతర రాష్ట్రాలను ఎలా కలుపుకుపోగలుగుతుందని ప్రశ్నలు వస్తున్నాయి. సాటి తెలుగు రాష్ట్రంతోనే కయ్యం తెచ్చుకునేలా అక్కడి ప్రజలను ప్రభుత్వాన్నీ అవమానించేలా హరీష్ రావు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో దాని వెనుక వ్యూహం ఏంటో అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ పండితులు. ఆంధ్రప్రదేశ్ లోనూ బి.ఆర్.ఎస్. ను బలోపేతం చేస్తామని చెప్పిన ఆ పార్టీ నేతలు ఆంధ్ర ప్రజలను అవమానిస్తే అక్కడ బి.ఆర్.ఎస్.ను ఎవరు ఆదరిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఏపీలోనే కాదు అసలు ఏ ఓట్లకి గేలం వేయాలని హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారో ఆ ఓటర్లే బి.ఆర్.ఎస్. కు ఎదురు తిరిగే ప్రమాదం కూడా ఉందంటున్నారు విశ్లేషకులు. ఉదాహరణకు ఏపీలో అధికారంలో ఉన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టేలా హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలోనూ అభిమానులు ఉన్నారు. తెలంగాణాలో స్థిరపడ్డ ఆంధ్రప్రాంత ఓటర్లలో పెద్ద సంఖ్యలో జగన్ మోహన్ రెడ్డి అభిమానులు ఉన్నారు. ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు కూడా ఉన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలతో ఆ ఓటర్లంతా హరీష్ పై మంటతో బి.ఆర్.ఎస్.కు దూరం అయ్యే అవకాశాలు కచ్చితంగా ఉంటాయంటున్నారు మేథావులు.
హరీష్ రావు వివాదస్పద వ్యాఖ్యల వల్ల బి.ఆర్.ఎస్.కు లాభం లేకపోగా తీవ్రమైన నష్టం మాత్రం తప్పదంటున్నారు వారు.
అయినా ఇపుడు ఏపీలో పాలననీ అక్కడి మౌలిక సదుపాయాలనీ వెక్కిరించడం వల్ల బి.ఆర్.ఎస్. కు ఏ విధంగా లాభం
ఇలా సెంటిమెంట్ మంటల్లో చలికాచుకోవడం మంచిది కాదంటున్నారు రాజకీయ పండితులు. ఇటువంటి రాజకీయాలు మన దేశంలో కొత్త కాదు. మహారాష్ట్రలో మహారాష్ట్ర నవ నిర్మాణసేన అన్న పార్టీ ఇటువంటి సెంటిమెంట్ లోంచే పుట్టింది. శివసేన పార్టీకి పోటీగా అవతరించిన ఎం.ఎన్.ఎస్. మహారాష్ట్రలోని ఇతర రాష్ట్రాల ఉద్యోగులు కార్మికులపై విద్వేషం రగిల్చేలా రాజకీయాలు చేస్తూ ఉంటుంది. దీని వల్ల గతంలో మరాఠాలో ఇతర రాష్ట్రాల ప్రజలపై దాడులు విధ్వంసాలు జరిగాయి కూడా. తమిళనాడులోనూ ఇటీవల అక్కడి బిజెపి అధ్యక్షుడు సెంటిమెంట్ తోనే రాజకీయం చేసి డిఎంకేని దెబ్బతీయాలనుకున్నారు. తమిళనాడులో వలస కూలీలకు రక్షణ లేకుండా పోయిందని వారిపై నిత్యం దాడులు జరుగుతున్నాయంటూ తమిళనాడు బిజెపి అధ్యక్షుడు సోషల్ మీడియాలో ఓ పోస్టింగ్ పెట్టారు. అది బాగా వైరల్ కావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అప్రమత్తమైన డిఎంకే ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో ఆరా తీసేసరికి సోషల్ మీడియాలో వచ్చింది ఫేక్ న్యూస్ అని తేలింది. అటు బిహార్ ప్రతినిథుల బృందం కూడా తమిళనాడులో పర్యటించి నిజం తెలుసుకుంది. తమ రాష్ట్రా కార్మికులపై ఎలాంటి దాడులు జరగలేదని నిర్ధరించుకుని ప్రకటన కూడా చేసింది.
ఇలా సెంటిమెంట్ ను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం దుర్మార్గమే అంటున్నారు రాజకీయ పండితులు. తమ దగ్గర ప్రజలను ఆకట్టుకునే విషయం లేనపుడు మాత్రమే ఇటువంటి అడ్డదారులు తొక్కుతారని వారు ఆరోపిస్తున్నారు. కాంటెంట్ లేనపుడే కటౌట్ తో పని పడుతుందని వారు సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం హరీష్ రావు చేస్తున్నది కూడా అలానే ఉందంటున్నారు వారు. తెలంగాణాలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. బి.ఆర్.ఎస్. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉంది కాబట్టి సహజంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతో కొంత ఉంటుంది. ఈ సారి బి.ఆర్.ఎస్.కు అటు కాంగ్రెస్ నుండి ఇటు బిజెపి నుండి తీవ్ర పోటీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి కొంత అడ్వాంటేజ్ కూడా ఉంది. దాన్ని ఎలా అధిగమించాలో చూసుకుని అందుకు తగ్గట్లుగా వ్యూహాలు రూపొందించుకోవలసిన బి.ఆర్.ఎస్. తెలంగాణ ఎన్నికలతో ఏ మాత్రం సంబంధం లేని ఆంధ్రప్రదేశ్ పాలనపైనా అక్కడి రోడ్లపైనా అకారణంగా అనవసరంగా విమర్శలు చేయడం తెలివి తక్కువ తనమే అవుతుంది. మరి హరీష్ రావు తన సొంత ఆలోచనతోనే అన్నారో ఇంకెవరైనా అనమన్నారో తెలీదు కానీ బి.ఆర్.ఎస్.కు మాత్రం ఇది నష్టదాయకమే అంటున్నారు విశ్లేషకులు. హరీష్ రావు వ్యాఖ్యలకు ముందు కేసీయార్ ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారం బిడ్డింగ్ లో పాల్గొంటానంటూ సంచలన వ్యాఖ్య చేయడం కూడా చర్చనీయాంశమే. తెలంగాణాలో మూతపడ్డ పలు ప్రభుత్వ రంగ సంస్థలను తెరిపించడానికి కానీ పునరుద్ధరించడానికి కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయని కేసీయార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఊసెత్తడం కూడా ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికే కావచ్చునన్న విమర్శలూ వస్తున్నాయి. కాకపోతే వీటి వల్ల బి.ఆర్.ఎస్. కు ఒరిగేదేంటో అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ పండితులు.