ఎప్పుడో రాష్ట్ర విభజన జరిగిపోయింది ఉద్యమకాలంలో నేతలు మాటలు తూలారు. రెండు తెలుగురాష్ట్రాల మధ్య విభజనరేఖలు గీశారు. నాయకులు నాయకులు తిట్టుకోవడమే కాదు ప్రజలను కూడా నిందించారు. సంస్కృతులను అవహేళన చేశారు వంటకాలను కూడా వివాదాల్లోకి లాగారు అదంతా గతం. రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నా ద్వేషమైతే లేదు. రెండురాష్ట్రాల ప్రజల మధ్య సంబంధాలు మునుపటిమాదిరే ఉన్నాయి. ఆంధ్రా తెలంగాణ అన్న తేడా ఎక్కడా లేదు కానీ మళ్లీ ఎన్నికలొస్తున్నాయి నేతల రాజకీయం మొదలైంది దీంతో తెలుగురాష్ట్రాలమధ్య మళ్లీ మాటల మంటలు ఎగసిపడుతున్నాయి.
ఎవరు మొదలుపెట్టారు ఎవరు కొనసాగించారన్నది కాదు సమస్య ఎవరి రాజకీయం వారు చేసుకోక ఈ క్రెడిట్ గోల ఏంటన్నదే ప్రశ్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఏపీ వ్యతిరేకిస్తోంది. తెలంగాణకూడా దీనికి సంఘీభావం పలికింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా జరిగే బిడ్లలో పాల్గొనాలని తెలంగాణ నిర్ణయించటంతో వివాదం మొదలైంది. సాంకేతికంగా రాష్ట్ర ప్రభుత్వమో సింగరేణి సంస్థనో స్టీల్‌ప్లాంట్ బిడ్‌లో పాల్గొనడం సాధ్యమా అన్న చర్చ జరిగింది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామంటున్న తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేయాలన్న ఆలోచన తప్పన్నారు ఏపీ ప్రభుత్వ పెద్దలు. దీనిపై చర్చ నడుస్తుండగానే విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి ఫగ్గన్‌సింగ్ కీలక ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్‌ని ఇప్పట్లో ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంలేదని చెప్పారు. అంటే కేంద్రం ఆనిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు కాదు. ప్రైవేటీకరణకంటే ముందు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL)ని బలోపేతం చేయాలన్నది కేంద్రం ఆలోచన. దానిమీద స్టీల్‌ప్లాంట్ యాజమాన్యంతో పాటు కార్మికసంఘాలతో చర్చించాలనుకుంటోంది కేంద్రప్రభుత్వం. మొదట పూర్తిస్థాయిలో పనిచేసేలా స్టీల్ ప్లాంట్‌ని బలోపేతం చేయాలన్న ఆలోచనతో కేంద్రం ఉంది.
మొన్నటిదాకా ప్రైవేటీకరణపై వెనక్కితగ్గేది లేదన్నట్లు వ్యవహరించిన కేంద్రం ఉన్నట్లుండి వెనక్కితగ్గటంతో ఇది తమ ఘనతేనంటోంది తెలంగాణ ప్రభుత్వం. తాము బిడ్‌లో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవటంతో కేంద్రం ప్రైవేటీకరణపై పునరాలోచనలో పడిందంటున్నారు గులాబీపార్టీ నేతలు. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకమైన కేటీఆర్ హరీష్‌రావు లాంటి మంత్రులే ఈ ప్రకటన చేయటంతో వైసీపీ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. అదే సమయంలో తెలంగాణ బాగోగులు పట్టించుకోకుండా బయ్యారం ఉక్కు పరిశ్రమపై భరోసా ఇవ్వకుండా ఆంధ్రాలో రాజకీయం ఏంటంటే తెలంగాణలోని విపక్షపార్టీలు విమర్శలు గుప్పించాయి. అయినా విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం వెనక్కితగ్గటానికి తామే కారణమని బల్లగుద్ది చెబుతున్నారు బీఆర్‌ఎస్ నేతలు. ఏపీలో బీఆర్‌ఎస్ రాజకీయంగా బలపడటానికి స్టీల్ ప్లాంట్ పరిణామాలు ఉపయోగపడతాయన్న ఆలోచనతో ఆ పార్టీ ఉంది.
తెలంగాణ అభివృద్ధితో పోలుస్తూ ఇంతకుముందే హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి కారుమూరి తీవ్రంగా తప్పుపట్టారు. స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర నిర్ణయాన్ని కూడా బీఆర్‌ఎస్ తన క్రెడిట్‌గా తీసుకోవటంతో మిగిలిన మంత్రులు వైసీపీ నేతలు గట్టిగా గొంతెత్తుతున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య రచ్చ కాస్తా మరోసారి రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీగా మారిపోయింది. కేసీఆర్ వల్లే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందన్న ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విజయోత్సవ సభకు రావాలని కేసీఆర్‌ని కార్మిక సంఘాలు ఆహ్వానించాయన్నారు. దీంతో వైసీపీ నేతలనుంచి స్ట్రాంగ్ కౌంటర్ మొదలైంది. తెలంగాణ దెబ్బకు కేంద్రం దిగొచ్చిందన్న వాదన నిజమైతే సింగరేణి విషయంలో కేంద్రం ఎందుకు వెనక్కితగ్గలేదని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌పై బీఆర్‌ఎస్ నేతల అత్యుత్సాహాన్ని మంత్రి బొత్స తప్పుపట్టారు. మాట్లాడకపోతే వెనకబడతానేమోనని మరో మంత్రి సీదిరి అప్పలరాజు ఫ్లోలో నోరు జారేశారు. బీఆర్‌ఎస్‌ది ప్రాంతీయ ఉగ్రవాదమంటూ కవిత లిక్కర్‌స్కామ్‌పై తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో వ్యవహారం శృతిమించేలా ఉందని వైసీపీ ప్రభుత్వ పెద్దలు జోక్యంచేసుకున్నారు. వ్యక్తిగత విమర్శలు వద్దంటూ సీఎంవో నుంచి మంత్రి సీదిరికి ఫోన్ వచ్చింది. అయినా విడిపోయి ఎవరి సంసారాలు వాళ్లు చేసుకుంటుంటే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఒకర్నొకరు కెలుక్కోవడం అవసరమా బీఆర్‌ఎస్ కెలుకుతానంటే రేపు వైసీపీ తెలంగాణ ఎన్నికల్లో వేలుపెట్టకుండా ఉంటుందా.