ఆధ్యాత్మిక దేశంగా మారిపోతున్న కమ్యూనిస్ట్ చైనా

By KTV Telugu On 16 April, 2023
image

చైనాలో ఆలయాలు భక్తులతో కిట కిట లాడుతున్నాయి. ప్రత్యేకించి యువతీ యువకులు పెద్ద సంఖ్యలో నచ్చిన దేవాలయాలకు వెళ్లి భక్తిగా పూజలు చేసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాకుండా ఖాళీగా ఉన్న వారే ఎక్కువగా గుళ్లు వెతుక్కుంటూ వెళ్తున్నారు. హఠాత్తుగా వచ్చిన భక్తులను చూసి బుద్ధుడు కూడా ఆశ్చర్యపోతూ ఉండచ్చు. దేవుడా నువ్వే ఇక మమ్మల్ని కాపాడాలి అని దేవుళ్లకు ఓ మొక్కు మొక్కి వినయంగా తలలు వంచి శాంతి పొందుతున్నారు చైనీయులు. ఇదే ఇప్పుడు అక్కడి కొత్త ట్రెండ్. కొద్ది వారాలుగా చైనాలో ఏ గుడికి వెళ్లినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. బుద్ధిస్ట్ టావోయిస్టు దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నాస్తికత్వం రాజ్యమేలే కరడు గట్టిన కమ్యూనిస్టు దేశమైన చైనాలో దేవాలయాల చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేయడానికి కారణాలు లేకపోలేదు. గతంలో ఏదైనా పండగ రోజున మాత్రమే కొద్ది పాటి రద్దీ ఉండేది దేవాలయాల్లో. అటువంటిది ఇపుడు రోజూ గుళ్లు భక్తులతో రద్దీగా ఉంటున్నాయి. వచ్చిన భక్తులు ఎంతో శ్రద్ధగా మనసులోనే దేవుణ్ని తలచుకుని పూజలు చేసుకుంటున్నారు. ప్రార్ధనా మందిరాల్లో భక్తులు అగరత్తులతో దేవుడికి పూజలు చేసుకుంటున్నారు.

భక్తులంటే వయసు మీద పడిన వృద్ధులేనేమో అనుకుంటే పొరపడినట్లే. మెజారిటీ భక్తులు యువతీ యువకులే. దేవుణ్ని ఇంచుమించు తలచుకోని చైనాలో ఇలా దేవుడి వెంటపడి పూజలు చేయడమేంటి చైనీయులకు ఏమైంది అనేగా.
దానికి కారణం ఉంది. 2019లో కోవిడ్ మహమ్మారి చైనా నుండి ప్రపంచ దేశాలకు వ్యాపించి యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన సంగతి తెలిసిందే. మొదటి రెండు వేవ్ లలో చైనాలో కరోనా ఎంత నష్టాన్ని చేకూర్చిందో ఎంతమంది ప్రాణాలు తీసిందో చైనా ప్రభుత్వం అసలు లెక్కలు చూపడం లేదు. కాకపోతే మూడేళ్ల పాటు కరోనా సాకుచూపి లాక్ డౌన్ అమలు చేసింది డ్రాగన్ కంట్రీ. దాంతో లక్షలాది మంది గృహనిర్బంధాల్లో నరకయాతన పడ్డారు. రకరకాల మానసిక క్షోభలు అనుభవించారు. కరోనా కారణంగా మందగించిన ఆర్ధిక వ్యవస్థ పాపమా అని లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగ సమస్య అమాంతం 18 శాతానికి పెరిగిపోయింది. కొత్తగా పట్టాలు తీసుకున్న గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు రావడం లేదు. పీజీ కోర్సులు చేసినా రెండేళ్లకు పైగా నిరుద్యోగంతో ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక చైనాకే పరిమితమైన కన్యాశుల్కం సమస్య ఉండనే ఉంది. పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. ఇటు ఉద్యోగం లేక అటు పెళ్లి కాక జీవితంలో ఎలా సెటిల్ కావాలి దేవుడా అని యువత కనిపించని దేవుడితో యుద్ధం చేయాలనుకున్నారు. జీవితమంతా అశాంతిమయం అయిపోవడంతో ఏంచేయాలో పాలుపోలేదు. సరిగ్గా ఈ తరుణంలోనే అమాంతం దేవుడు కనిపించేశాడు.

కష్టాలు వచ్చినపుడే కదా దేవుడు గుర్తుకు వచ్చేది. చైనాలోని కామ్రేడ్లకూ దేవుడు కనిపించాడు. అంతేఅంతా దేవాలయాల వైపు పరుగులు పెట్టారు. రోజూ బుద్దిస్ట్ టావోయిస్టు దేవాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలతో తరలి వస్తున్నారు. దేవుడికి భక్తితో దండాలు పెట్టుకుని దేవుడా మా జీవితాలను నువ్వే రిపేర్ చేయాలి మా మనసుల్లోంచి మాయమైపోయిన శాంతిని నువ్వే వెతికి తెచ్చి పెట్టాలి మొత్తానికి మమ్మల్ని నువ్వే చల్లగా చూడాలి అని ప్రాధేయపడుతున్నారు. కొంతకాలం క్రితం వరకు చైనాలో ప్రతీ ఒక్కరూ కూడా పనిపైనే దృష్టి పెట్టేవారు వేరే డైవర్షన్లు ఉండేవి కావు. అయితే జీవితాల్లో పెరుగుతోన్న మానసిక ఒత్తిడి మనసులో అశాంతిని పెంచేస్తోంది. అది నరకాన్ని చూపిస్తోంది. దీంతో యూత్ రూట్ మార్చేసింది. మడిసన్నాకా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్కే చేస్తూపోతే ఇక మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటాది అనుకున్నారు. మనసుని కూసింత కూల్ గా ఉంచుకుంటేనే జీవితం ప్రశాంతంగా ఉంటుందని  భావించారు. అంతే ప్రశాంతత బయటి మార్కెట్లోనే ఆన్ లైన్ షాపింగుల్లోనో దొరకదు కాబట్టి దాన్ని వెతుక్కుంటూ దేవాలయాల బాటపట్టారు. ఇది వరకు అయితే వీకెండ్స్ లో ఎక్కడికైనా పిక్నిక్ లకో లాంగ్ టూర్ లకో వెళ్లేవారు. విహార యాత్రలతో రీఛార్జ్ అయ్యేవారు. ఇపుడు వాటిని కాదని దేవాలయాల్లో పూజలుచేస్తూ భక్తిలో మునిగిపోయి ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో బిజీ అయిపోయి మానసిక ఆనందాన్ని పొందుతున్నారు. దేశ రాజధాని బీజింగ్ లో అత్యంత పురాతనమైన బుద్దిస్ట్ టెంపుల్ కి గత మార్చ్ ఒకటో తేదీ నుండి భక్తుల తాకిడి అమాంతం పెరిగిపోయింది. నిత్యం కనీసం 40 వేల మందికి తక్కువ కాకుండా భక్తులు ఈ దేవాలయానికి తరలి వస్తున్నారు.

హోంగ్జూస్ లోని మరో ప్రముఖ దేవాలయం లింగ్యిన్ టెంపుల్ కి కూడా నిత్యం భక్తుల రద్దీ పెరగింది.
కోవిడ్ నిబంధనలు సడలించిన తర్వాతి నుంచి బుద్ధిస్ట్ టావోయిస్టు దేవాలయాల్లో భక్తులు కిట కిట లాడుతూనే ఉన్నారు. దేవాలయానికి వెళ్లి పూజిస్తే అదృష్టం కూడా కలిసి వస్తుందని వారు నమ్ముతున్నారు. చైనాలో బుద్ధిజమ్ టావోయిజమ్ లతో పాటు కన్ఫ్యూషనిజం ఆచరణలో ఉన్నాయి. వీటిని ఒక విధంగా చైనీయులు తత్వాలుగానే చూస్తారు.
దేవాలయాలను సందర్శించి పూజలు చేసి తరించడంతో పాటు అక్కది షాపుల్లో ఉంచిన కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేసి తమని అదృష్టం వరిస్తుందని మురిసిపోతున్నారు. పూసల కంకణాలు బ్రేస్ లెట్లు కడియాల వంటివి విక్రయిస్తున్నారు. వాటిని కొన్న వారు వాటితో సెల్ఫీలు దిగి వాటిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు కూడా. డబ్బులేని వారు వీటిని కొని ధరిస్తే సంపన్నులు అవుతారని చదువుకునే విద్యార్ధులు పరీక్షల్లా పాస్ అవుతారని పాస్ అయిన వారికి ఉద్యోగాలు వస్తాయని ఉద్యోగులకు పెళ్లిళ్లు అవుతాయని రకరకాల నమ్మకాలతో వీటిని కొనేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఈధోరణి చూసి చైనాలోని కమ్యూనిస్టు పాలకులు అమాంతం ఉలిక్కి పడ్డారు. ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేసే పత్రికలు అయితే అపచారం జరిగిపోయినట్లు కంగారు పడుతున్నాయి. యువత కష్టపడి పనిచేసి తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవాలే తప్ప ఇలా ఆలయాల వెంటపడి దేవుళ్లను వెంబడించి పూజలు చేస్తే ప్రయోజనం ఏమీ ఉండదని పత్రికల్లో కతలుకతలుగా రాసుకొస్తున్నారు. ఇలాంటి పూజలు మన ఇంటా వంటా ఉన్నాయా అని ఆరాలు తీస్తూ కౌన్సెలింగ్ ఇచ్చినంత పనిచేస్తున్నారు. వీళ్లని ఇలాగే వదిలేస్తే దేశమంతా ఆస్తికత్వం వైపు అడుగులు వేస్తుందేమోనని కామ్రేడ్లు కంగారు పడిపోతున్నారు. ఈ సమస్య నుండి దేశాన్ని గట్టెక్కించమని వారు దేవుణ్ని కోరలేరు. కావాలంటే మావోనే తలచుకుని ఏంటి సామీ ఇది ఏం చేయమంటారు అని అడగ్గలరంతే.