అక్షయ తృతీయ సందడి ప్రారంభమవుతోంది. అక్షయ తృతీయ వచ్చిందంటే చాలామందికి సెంటిమెంట్. ఆ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందన్న నమ్మకం అందరిలో ఉంది. అందుకే ఆరోజు తమకున్ స్థోమత కొద్దీ కనీసం గ్రాము బంగారం అయినా కొనాలని మహిళలు అనుకుంటారు. అయితే పిసరంతైనా బంగారం కొందామంటే పసిడి దరలు కొండెక్కి కూర్చున్నాయి. పట్టుకోండి చూద్దాం అన్నట్లు ఆకాశమే హద్దుగా బరబరా పెరుగుతోంది బంగారం ధర. 61వేలు దాటి రంకెలేస్తోంది. భారతదేశంలో బంగారం కొనాలనుకునే వారికి దాని రేటుతో చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంనుంచీ అంటే ఏప్రిల్ 1 నుంచి బంగారం ధర రికార్డు స్థాయిలో పెరుగుతూపోతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 61 వేలు దాటి ఇంకా పెరుగుతానన్నట్లు పైపైకే పోతోంది. ఈ స్పీడ్ ఇలాగే కొనసాగితే 10గ్రాముల బంగారం ధర సమీప భవిష్యత్తులో 80నుంచి 90 వేలకు చేరుకోడానికి ఎంతో టైం పట్టేలా లేదు. కాస్త తగ్గితే చూద్దామనుకుంటున్న పసిడి ప్రియులకుధరలు చెమటలు పట్టిస్తున్నాయి.
2020లో ఏడాది పాటు స్థిరంగా ఉన్నా తర్వాత బంగారం ధరలు వేగం పుంజుకున్నాయి. అంతకు ముందయితే ఏటా సగటున 3 వేల చొప్పున పెరుగుతూ పోయింది బంగారం ధర. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. చివరికి ఆల్‌టైం హై రికార్డుకు చేరాయి. బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం డాలర్ రోజురోజుకు బలహీనపడటమే ప్రధాన కారణమని చెబుతున్నారు. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ ధర ఎక్కువగానే ఉన్నా ప్రస్తుతం మార్కెట్లో బ్యాంకింగ్ సంక్షోభంతో మదుపరులు బంగారంలో పెట్టుబడులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పసిడికి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వు మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే ప్రచారం కూడా పసిడిపై ప్రభావం చూపుతోంది. నిజానికి డాలర్ బలపడితే బంగారం ధర తగ్గుతుంది. బ్యాంకింగ్ సంక్షోభంతో డాలర్‌పై నమ్మకం సన్నగిల్లటంతో మదుపరులు బంగారంవైపు మొగ్గుచూపుతున్నారు. ఇక తమ స్థోమత కొద్దీ ఆడపిల్లల పెళ్లిళ్లకు ఎంతోకొంత బంగారం కొనాల్సి వచ్చే మధ్యతరగతి జీవులు పసిడిరేటుతో పరేషాన్ అవుతున్నారు. ఒకప్పుడు లక్ష పెడితే వచ్చే బంగారానికి ఇప్పుడు ఏడెనిమిది లక్షలు పెట్టాల్సి వస్తోంది. షాపులకు వెళ్లి షో కేసుల్లో చూసుకుని మురిసిపోవడం తప్ప పసిడిని ఇప్పట్లో కొనాలంటే కష్టమేమరి.