ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్నది పాత నానుడి. మనం అవతలి వాళ్లకి ఏం ఇచ్చామో మనకి అదే రిటర్న్ గిఫ్ట్ గా వస్తుందన్నది నవీన సామెత. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదే జరుగుతోంది. పాలక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ లో అసంతృప్తిగా ఉన్నవారిని ప్రలోభ పెట్టో ఆఫర్లు ఇచ్చో టిడిపిలో చేర్చుకోవాలని చూస్తోంది విపక్ష నాయకత్వం. అదే సమయంలో టిడిపిలో అసంతృప్తితో ఉన్న సీనియర్లు వైసీపీ వైపు ఆశగా చూస్తోన్నట్లు రాజకీయ కోళ్లు అదే పనిగా కూస్తున్నాయి. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి నలుగురు పాలక పక్ష ఎమ్మెల్యేలు తిరుగుబావుటీ ఎగరేశారు. అందులో ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర రెడ్డి చాలా ముందుగానే తాము వైసీపీ నాయకత్వం పట్ల సంతృప్తితో లేనే లేమని చెప్పేశారు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేస్తానని కోటంరెడ్డి చాలా ముందుగా శ్రావ్యంగా కూశారు. ఈ నెల్లూరు కోయిలకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని భరోసా కూడా ఇచ్చారని అంటున్నారు. ఇక ఈ ఇద్దరూ కాకుండా క్రాస్ ఓటింగ్ చేసిన టిడిపి రహస్య మిత్రులు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు ఉండవల్లి శ్రీదేవి కాగా మరొకరు నెల్లూరుకే చెందిన మేకపాటి చంద్రశేఖర రెడ్డి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేకపోయినా క్రాస్ ఓటింగ్ కారణంగా టిడిపి అభ్యర్ధి పంచుమర్తి అనూరాధ ఎమ్మెల్సీ అయిపోయారు. ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడమే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినంత అన్నట్లుగా చంద్రబాబు నాయుడితో పాటు టిడిపి నేతలు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి పండగ చేసుకున్నారు. ఈ పండక్కి కారణం కేవలం ఒక ఎమ్మెల్సీ సీటు గెలవడం ఒక్కటే కాదు. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపి వైపు వచ్చేశారన్న ఆనందమే పండక్కి కారణం. ఈ ఎన్నికల్లో గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ నేతలు వైసీపీ నుండి ఈ నలుగురు ఎమ్మెల్యేలే కాదు మరో నలభై మంది తమతో టచ్ లో ఉన్నారని అంటూ వచ్చారు. అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున టికెట్ రాకపోవచ్చునన్న అనుమానంతో ఉన్న నేతలంతా టిడిపి లో చేరతారన్నది చంద్రబాబు నమ్మకం. ఎందుకంటే వైసీపీ తరపున వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నదానిపై ఇప్పటినుంచే జగన్ మోహన్ రెడ్డి సర్వేలు చేయిస్తున్నారు. ఆయన కోసం పనిచేసే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన 151 నియోజకవర్గాలతో పాటు టిడిపి గెలిచిన నియోజకవర్గాల్లోనూ సర్వేలు నిర్వహించారు. పాలక పక్ష ఎమ్మెల్యేల్లో ఎవరిపట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఏం చేస్తే ఆ వ్యతిరేకతను అధిగమించే అవకాశం ఉంది.
టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ గెలవాలంటే ఏయే అభ్యర్ధులకు టికెట్లు ఇవ్వాలి వంటి అంశాలపై విస్తృతంగా సర్వేలు నిర్వహిస్తున్నారు. అది నిరాటంక ప్రక్రియ. ఈ సర్వే నివేదికను పీకే పాలక పక్షానికి సమర్పించక ముందే టిడిపి నేతలు వారి అనుకూల మీడియాలు వైసీపీలో వచ్చే ఎన్నికల్లో 40 మందికి టికెట్లు ఇవ్వరట అని ప్రచారం మొదలు పెట్టేశారు. అలా చేయడం ద్వారా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలను ఆందోళనకు గురి చేసి వారు పార్టీ మారేలా ప్రలోభ పెట్టవచ్చునన్నది వ్యూహంగా చెబుతున్నారు. ఒక వేళ నిజంగానే వైసీపీ అధినేత కొంతమందికి టికెట్లు ఇవ్వలేదనుకుందాం. అటువంటి నేతలను చంద్రబాబు నాయుడు తమ పార్టీలో చేర్చుకున్నారనే అనుకుందాం. వారికి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు టికెట్లు ఇచ్చారనే అనుకుందాం. ఆ ఎన్నికల్లో వారు గెలిచే అవకాశాలు ఏ మేరకు ఉంటాయి ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రజలు వారి పనితీరు పట్ల అసంతృప్తితో ఉండడం వల్లనే కదా జగన్ మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వకూడదని అనుకునేది. మరి ప్రజల్లో అంత వ్యతిరేకత ఉన్న వారిని పిలిచి టిడిపి టికెట్లు ఇవ్వడం వల్ల జరగబోయేది ఏంటి ఈ ఎమ్మెల్యేలపై ఎలాగూ వ్యతిరేకత ఉంది కాబట్టి వారు గెలిచే పరిస్థితి ఉండదు. వీరి స్థానంలో వైసీపీ నవ నాయకులను బరిలో దింపుతుంది కాబట్టి ప్రజలు వారిని గెలిపించే అవకాశాలే ఎక్కువ. అంటే వైసీపీకి మేలు చేయడానికే చంద్రబాబు నాయుడు వైసీపీ అసంతృప్త నేతలను తమ పార్టీలో చేర్చుకుని తమ గోతిని తామే తవ్వుకున్నట్టు అవుతుందని రాజకీయ పండితులు అంటున్నారు.
పొరుగింటి పుల్ల కూరలా పరాయి పార్టీ నేతలను తీసుకుని బాగుపడిన రాజకీయ పార్టీలు లేనే లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉదాహరణకు 2014 ఎన్నికల్లో తెలంగాణా ఆంధ్రప్రదేశ్ లలో కలుపుకుని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 70కి పైగా స్థానాలు గెలుచుకుంది. అందులో 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు బెదిరించో బతిమాలో మంత్రి పదవుల ప్రలోభాలు పెట్టో డబ్బు సంచుల ఆఫర్లు ఇచ్చో టిడిపిలో చేర్చుకున్నారు. అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఈ 23 మందిలో ఒక్క గొట్టి పాటి రవి మినహా మిగతా 22 మంది ఓడిపోయారు. కారణం వారి వారి నియోజకవర్గంలో ప్రజలు వారి పార్టీ ఫిరాయింపును వ్యతిరేకించారు కాబట్టి. పక్క పార్టీల నేతలను చేర్చుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదనే విషయం అనుభవంలోకొచ్చినా చంద్రబాబు నాయుడు కానీ టిడిపి నేతలు కానీ గుణపాటం నేర్చుకోవడం లేదు. మళ్లీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం పైనే దృష్టి సారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు పశ్చిమ బెంగాల్ లోనూ ఇలానే జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ లో ఎన్నికలకు ముందు బిజెపి నాయకత్వం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 34 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలతో తమ పార్టీలో చేర్చుకున్నారు.
ఇంకేముంది దీదీ పార్టీ పని అయిపోయిందని ప్రచారం చేశారు. బెంగాల్ లో అధికారంలోకి రాబోయేది తామేనని చెప్పుకున్నారు. అంత హడావిడి చేసి గోడదాటిన వారిలో కొందరికే టికెట్లు ఇచ్చారు. చివరకు సీన్ కట్ చేస్తే టి.ఎం.సి. నుండి బిజెపి లో చేరిన 34 మందిలో తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టింది నలుగురంటే నలుగురే. ఆంధ్రప్రదేశ్ లో 2024లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఓటమి చెందితే టిడిపి మనుగడే ప్రశ్నార్ధకం అవుతుంది. ఆ కారణంగానే చంద్రబాబు నాయుడు ఏ చిన్న అవకాశాన్నీ విడిచి పెట్టకూడదనుకుంటున్నారు. వైసీపీని ఎలా బలహీన పర్చాలా అని చూస్తున్నారు. అయితే ఆ క్రమంలో తమ పార్టీలో ఏం జరుగుతోందో చూసుకోవడం లేదు. ఆ మధ్య మహానాడులో చంద్రబాబు నాయుడు ఓ మాట అన్నారు. పార్టీ అధికారానికి దూరం కావడానికి కారణం యువతకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే అని బాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లతో పాటు పార్టీ పదవుల్లోనూ 40 శాతం అవకాశాలు యువతకే ఇస్తానని భరోసా ఇచ్చారు. ఇటీవలం ఉత్తరాంధ్ర పర్యటించినపుడు పార్టీ అధికారంలోకి రావాలంటే కొత్త అభ్యర్ధులను తెరపైకి తీసుకురావాలని అన్నారు. దానర్ధం ప్రస్తుతంఉన్న సీనియర్లలో కొందరికి టికెట్లు రావని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
ఉత్తరాంధ్రలో గంటా శ్రీనివాస్ అయ్యన్న పాత్రుడు కళా వెంకట్రావుల పట్ల చంద్రబాబు అంత సానుకూలంగా లేరంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరి నియోజకవర్గాల్లో యువతను బరిలో దింపుతారని అంటున్నారు. ఇదే పరిస్థితి మరి కొందరు సీనియర్ల నియోజకవర్గాల్లోనూ ఉందంటున్నారు. నియోజకవర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోని దేవినేని ఉమా మహేశ్వరరావు పత్తి పాటి పుల్లారావు వంటి వారికి కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్లు అనుమానమే అంటున్నారు. ఇలా బాబు పక్కన పెట్టేస్తే ఈ సీనియర్లు కూడా టిడిపి కి గుడ్ బై చెప్పి మరో పార్టీని ఆశ్రయించే అవకాశాలు ఉంటాయి కదా అంటున్నారు రాజకీయ పండితులు. చంద్రబాబు నాయుడు ఇంత చిన్న లాజిక్ ను ఎలా మిస్ అయ్యారబ్బా అని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పరాయి పార్టీల నేతలపై మనం కన్నేస్తే మన నేతలు పరాయి పార్టీపై కన్నేయరా అని వారు లాజిక్ లాగుతున్నారు. కాకపోతే మనం తీసుకోబోయే నేతలు గెలుపు గుర్రాలు కాకుండా మనం కోల్పోయే నేతలు అవతలి వారికి రేసు గుర్రాలుగా మారితే మొదటికే మోసం వస్తుంది కదా అని వారంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఏం ఆలోచిస్తున్నారో ఆయనకే తెలియాలని వారంటున్నారు.