అహంకారం తనకు ఆభరణం అనుకుంటారాయన. ఫైర్ బ్రాండ్ రాజకీయాలు బాగా కలిసొస్తాయనుకుంటారు. తిట్ల దండకంతోనే వార్తల్లో వ్యక్తిగా ఉండాలని కోరుకుంటారాయ. నేను తప్పితే ఎవరూ ఉండకూడదన్న ధోరణిలో ప్రతీ అడుగు వేస్తారు. అదే ఇప్పుడు సింహపురి వైసీపీలో ఆయనకు ప్రత్యర్థుల సంఖ్యను పెంచేస్తోంది. ఒక్క నేతకు కూడా ఆయనతో పొసగడం లేదు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కొంతకాలం మంత్రిగా చేశారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఆయన పదవి పోయింది. కాకాని గోవర్థన్ రెడ్డికి ఆ పదవి దక్కింది. మంత్రిగా అనిల్ కొన్ని నియోజకవర్గాల్లోకి అడుగు పెట్టలేకపోయారంటే అది కాకాని వ్యతిరేకత వల్లేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాకాణికి మంత్రి పదవి వచ్చాక బహిరంగంగానే ఆయన్ను వ్యతిరేకించారు. తనకు ఎదురైన అగౌరవాలన్నీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ ప్రకటనలు చేశారు. అయితే అధిష్టానం ఆదేశంతో కొంత చల్లబడ్డారు. రెండు మూడు రోజుల్లోనే ఇద్దరూ ఒకరికొకరు శాలువాలు కప్పుకున్నారు. లోలోన విభేదాలు మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి.
జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అనిల్ కుమార్ అంటే అస్సలు పడటం లేదట. ముఖ్య అనుచరుడిగా ఉన్న నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాధ్ సొంత బాబాయి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ లూ కూడా ఆయనకు దూరమయ్యారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనిల్ కుమార్ అన్నదమ్ముల్లా ఉండేవారు. అనిల్ మంత్రిగా ఉన్నప్పుడే కోటంరెడ్డితో మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఎంపీ ఆదాలతో విభేదాలు మొదలయ్యాయి. చివరికవి చిలికి చిలికి గాలీవానలా మారుతున్నాయి. కోటంరెడ్డి నేరుగా అధిష్టానంతోనే గొడవపడి వైసీపీని వీడి వెళ్లిన తర్వాత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి పార్టీ రూరల్ బాధ్యతలు అప్పగించింది. మొదట్లో ఆదాల అనిల్ కుమార్ లు కలిసి ప్రెస్ మీట్లు పెట్టారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారం రోజులు తిరగక ముందే రూరల్ లో అనిల్ కుమార్ అనుచరులు బంధువులు రెచ్చిపోవడం మొదలెట్టారు. ఆదాలపైనా విమర్శలు చేయడం ఆరంభించారు. అనిల్ కుమార్ రూరల్ నుంచి పోటీచేయబోతున్నారని ప్రచారం చేయించారు. పైగా అక్కంపాడులో ఆదాల అనుచరుడి భూముల్లో అనిల్ కుమార్ బంధువులు పాగా వేసే ప్రయత్నం చేశారు.
పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా వారిని విడిపించేందుకు ఏకంగా అనిల్ కుమార్ రంగంలోకి దిగారు. ఆమంచర్లలో 12 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అందులో మూడు ఎకరాల భూమిని అనిల్ కుమార్ అనుచరుడు ఆక్రమించి లే అవుట్ వేశారు. పూర్వం ఆ భూములన్నీ దళితులకి పట్టాలిచ్చారని పలువురు దళితులు 9 ఎకరాల్లో గుడిసెలు వేశారు. అనిల్ కుమార్ అవన్నీ తీయించేశారు. అనిల్ కుమార్ ఆ భూమిలోనూ రియల్ ఎస్టేట్ లే అవుట్లు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ దళిత నేతలు ఆరోపించారు. ఆయన అనుచరుడు మూడు ఎకరాలు ఆక్రమించి లే అవుట్ వేస్తే చర్యలు ఎందుకు తీసుకోరంటూ ప్రశ్నించారు. దళిత ద్రోహి అనిల్ కుమార్ అంటూ ఆందోళనలు చేపట్టారు. రాబోయే ఎన్నికల్లో అనిల్ కుమార్ ఎక్కడి నుంచి పోటీచేసినా ఆయన ఓటమికి పనిచేస్తామని హెచ్చరించారు. పలువురు దళిత నేతల అరెస్టులూ జరిగాయి. ఈ వ్యవహారం కూడా ఆదాలకి తలనొప్పి తెచ్చిపెట్టింది. రూరల్ లో అనిల్ కుమార్ జోక్యం ఎక్కువైందని ఇలాగైతే తాను ఇన్ ఛార్జిగా వ్యవహారించలేనని పార్డీ పెద్దలకి ఆదాల తెగేసి చెప్పినట్టు చర్చలు సాగాయి.
ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు నేరుగానే అనిల్ పై ఆరోపణలు చేస్తున్నారు. అల్లీపురంలో ఇరిగేషన్ ప్రభుత్వ భూములను ఆక్రమించి లే అవుట్ వేశారని ఆరోపిస్తున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ అక్రమ లే అవుట్ పై కలెక్టర్ కి రెండు పేజీల లేఖ రాశారు. కలెక్టర్ వెంటనే విజిలెన్స్ జేసీ ఆర్డీవో మున్సిపల్ కమిషనర్ నుడా వీసీలని వెంటనే విచారణ జరిపి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. దానితో అనిల్ కుమార్ కి చెక్ పెట్టినట్టు అయింది. ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగాయి. పంచాయతీ కాస్తా సీఎం పేషీకి చేరింది. ఈ మధ్యనే జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే కావలిలో షాడో ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన సుకుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఏకంగా జిల్లా కేంద్రంలోనే నేతల మధ్య విభేదాలు రాజుకోవడం పార్టీ శ్రేణులని అయోమయానికి గురిచేస్తున్నాయి. నిజానికి అనిల్ కుమార్ పెద్ద స్కేచ్చే వేశారు. మంత్రి పదవి పోయిన తర్వాత క్షేత్రస్థాయిలో తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించారు. జిల్లాపై పట్టు సాధిస్తే 2024లో మంత్రి పదవి ఖాయమని భావించారు. అందు కోసం వెయ్యి కోట్లయినా ఖర్చు పెడతానని తన అనుచరుల వద్ద ఆయన చెప్పుకున్నారు. ఆ క్రమంలోనే తనకెవ్వరూ ప్రత్యర్థులు ఉండకూడదనుకుని అందరిపైనా పెత్తనం చేసేందుకు ప్రయత్నించారు. అక్కడే సమస్య మొదలైంది. నెల్లూరు పెద్దారెడ్లు ఆయనకు చెక్ పెడుతున్నారు. అనిల్ అవినీతిని రోజు వారీ బయటకు తీస్తున్నారు. మరి నెల్లూరు ఫైర్ బ్రాండ్ వాటిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.