ఏపీ నేతలతో కెసీఆర్ సంప్రదింపులు

By KTV Telugu On 4 October, 2022
image

* ఏపీ రాజకీయాలవైపు కేసీఆర్‌ చూపు
*  పాతతరం కాంగ్రెస్‌, టీడీపీ నాయకులకు ఫోన్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చూపు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల వైపు మళ్లింది. బీఆర్‌ఎస్‌ పేరుతో నేషనల్‌ పార్టీ ప్రకటించిన వెంటనే జాతీయ రాజకీయాల్లో తన ఉనికి చాటుకునేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఏపీ రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున అభ్యర్తులను పోటీకి దించాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఏపీలో కేసీఆర్‌ను అభిమానించేవారు చాలామందే ఉన్నారు. గతంలో కేసీఆర్‌కు ఫ్లెక్సీలు కట్టి, పాలభిషేకాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రాష్ట్రంలో తనకున్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని అక్కడ బీఎర్‌ఎస్‌ తరపున పోటీకి దిగితే విజయావకాశాలు ఎలా ఉంటాయనే విషయంపై తనకు పరిచయం ఉన్న కొందరు ఏపీ నాయకులతో కేసీఆర్‌ చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే తనతో టచ్‌లో ఉన్న కొందరు పాతతరం కాంగ్రెస్‌, టీడీపీ నాయకులతో ఆయన ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం కేసీఆర్‌ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో చర్చలు జరిపారు. అయితే తనకు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఉండవల్లి స్పష్టం చేశారు.
దాంతో బీఆర్‌ఎస్‌ కు ఏపీలో ప్రాతినిధ్యం వహించబోయేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్‌ జగన్‌ మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. అయితే ఉన్నట్లుండి ఇటీవల మంత్రి హరిశ్‌రావ్‌ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పటినుంచి రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి గంగుల కమలాకర్‌ ఒక అడుగు ముందుకేసి త్వరలో తాము ఏపీలో పాగా వేస్తామని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పేరుతో ఏపీతో పాటు గుజరాత్‌, కర్ణాటకలోనూ సత్తా చాటుతాం అని ఆయన అన్నారు. ఒకవేళ బీఆర్‌ఎస్‌ ఏపీలో పోటీ చేస్తే ఎవరి ఓట్లు చీలుస్తుంది…ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తుందనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది