కరోనా తర్వాత నలిగిపోయిందెవరు వెలిగిపోతోందెవరు

By KTV Telugu On 18 April, 2023
image

కరోనా మహమ్మరి ప్రపంచంపై చూపిన ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరి స్థాయిలో వారిని నష్టపరిచింది ముఖ్యంగా ఆర్థికంగా. ఆర్థికంగా ఇబ్బందులు తట్టుకోలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ దేశంలో కనిపిస్తున్న పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి లగ్జరీకి డిమాండ్ పెరుగుతోంది. ఆర్థికంగా బాగున్న వాళ్లు ఇంకా బాగుపడుతున్నారు మరి పేదలు ఏమవుతున్నారు మరింత చితికిపోతున్నారు ఇలా ఎలా సాధ్యమవుతోంది.

కోవిడ్‌ దేశంలో స్పష్టమైన విభజన తీసుకు వచ్చింది. దేశ ప్రజల్లో ధనికులు మరింత విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. దేశంలో ధనికులు కుబేరులతో పాటు ఎగువ మధ్య తరగతికి చెందిన వారు తమకు కావాల్సిన వస్తువుల కొనుగోలుపై భారీగానే ఖర్చు చేస్తున్నారు. టీవీలు రిఫ్రిజిరేటర్లు ల్యాప్‌టాప్స్‌ స్మార్ట్‌ఫోన్లు లగ్జరీ బూట్ల కొనుగోలు ఎక్కువ చేస్తున్నారు. వీటి అమ్మకాలు 2022-23లో 18 శాతం పెరిగాయి. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే వీటి ధరలు కూడా పెరిగాయి. పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తుల అమ్మకాలు చూస్తే 50 రూపాయల కంటే తక్కువ ధర ఉన్న ప్యాక్‌ అమ్మకాలు 6.8 శాతం తగ్గాయి. లగ్జరీ ఇళ్లకే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఢిల్లిలోని అత్యంత ఖరీదైన రోలెక్స్‌ వాచ్‌ షోరూమ్‌లో ఆర్డర్‌కు తగిన విధంగా సప్లయ్‌ చేయలేకపోతున్నారు. లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్‌ బెంజ్‌ కూడా 2022-23 ఆర్ధిక సంవత్సరంలో రికార్డ్‌ స్థాయి సేల్స్‌ను నమోదు చేసింది. భారత్‌లో ఉన్న ధనికులు బిలియనీర్లు ఉత్పత్తులపై భారీగా ఖర్చు చేస్తున్నారు. కార్లు వాచీలు, హ్యాండ్‌ బ్యాగ్‌లపై లక్షలు కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరో వైపు అత్యంత విలాసవంతమైన నివాస గృహాలను వందల కోట్లతో కొనుగోలు చేస్తున్నారు.

కోవిడ్ తర్వాత ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఈ పెరుగుదల వల్ల లాభపడింది పూర్తిగా ఎగువ మధ్యతరగతి వారు. పేదలు మధ్య తరగతి ప్రజలు పెరుగుతున్న జీవన వ్యయంతో జీవన ప్రమాణాలను మరింతగా కోల్పోతున్నారు. ఈ కారణంగా ఖర్చులు తగ్గించుకుంటున్నారు. దేశంలోని వినియోగదారుల్లో 63 శాతం మంది తమకు అవసరంలేని వాటిపై ఇతర సేవలపై ఖర్చును తగ్గించుకుంటున్నారని అనేక సర్వేల్లో వెల్లడయింది. కోవిడ్‌ తరువాత గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పడిపోయింది. సంపన్న వర్గాలు నుంచి కొనుగోళ్లు పెరిగాయి. కోవిడ్‌ సమయంలో పేద మధ్య తరగతి ఆదాయాలకు భారీగా గండిపడింది. దీని ప్రభావంతో ఈ వర్గాలు వారు ఎక్కువ ఖర్చు చేయకుండా మరింత పొదుపు చేయాలని భావిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారు స్పష్టం చేశారు. కోవిడ్‌ సమయంలో సరైన షాపింగ్‌ చేయలేకపోయిన ధనికవర్గం మాత్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో చెలరేగిపోతున్నది. షాపింగ్‌ పై భారీగా ఖర్చు చేస్తున్నారని గణాంకాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

పేదలు ఇంకా కోవిడ్‌ ప్రభావం నుంచి కోలుకోలేకపోతున్నారు. వీరు మరింత పేదరికంలోకి జారి పోతున్నారు. దీని ప్రభావం వినియోగదారుల మార్కెట్‌ శైలిపై కూడా పడింది. ఏదైనా కొనుగోలు చేసేందుకు పేద మధ్య తరగి వారు ఇంకా ధైర్యంగా ఖర్చు చేయలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. టూ వీలర్స్‌ రూరల్‌ సేల్స్‌ 16 శాతం పడిపోయాయి. ఎఫ్‌ఎంసీజీ మార్కెట్‌ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అశాజనంగా లేదు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రానున్న త్రైమాసికాల్లో పరిస్థితి మెరగువుతుందని ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల కంపెనీలు ఆశాభావంతో ఉన్నాయి. అదే సమయంలో దేశంలోని ధనికవర్గం మాత్రం తమకు నచ్చిన వాటిని హైఎండ్‌ లగ్జరీ వస్తువులను ఎంత ఖరీదైనా కొనుగోలు చేసేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. కరోనా తర్వాత ఆర్థిక అంతరాలు పెరిగిపోయాయని చాలా నివేదికలు స్పష్టంగా చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో ధనిక పేద మధ్య తేడాలు ఎక్కువగా ఉంటాయి. ఇది దేశంలో అస్థిరతకు కారణమయ్యే ప్రమాదం ఉంది.