దాదాపు 20మంది పోలీసులున్నారు. ఆ ఇద్దరూ కరడుగట్టిన నేరస్తులన్న విషయం అందరికీ తెలుసు. వారు నోరుతెరిస్తే నేర ప్రపంచంలో సంచలన విషయాలు బయటపడతాయన్నది బహిరంగరహస్యం. అంత కీలకమైన నిందితులు పోలీసుల రక్షణలో ఉండగానే దారుణహత్యకు గురయ్యారు. పాతికేళ్లు కూడా లేని ముగ్గురు భావి గ్యాంగ్‌స్టర్ల చేతుల్లో క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. భావి అని ఎందుకనాల్సి వచ్చిందంటే వాళ్లు సంచలన హత్యలతో గ్యాంగ్‌స్టర్లుగా ఎదగాలనుకున్నారని పోలీసులే చెబుతున్నారు. ఆ ముగ్గురి రూపంలో యూపీ నేరసామ్రాజ్యంలో నవశకం మొదలైందని అనుకోవాలేమో.
అతీక్‌అహ్మద్ అష్రఫ్‌ల హత్యతో యోగి సర్కారు సంకటంలో పడింది. నేరస్తులను మట్టిలో కలిపేస్తామని ఉక్కుపాదంతో అణచివేస్తామని బహిరంగంగానే ప్రకటిస్తూ వచ్చింది యూపీ ప్రభుత్వం. అతీక్ అహ్మద్ నేరసామ్రాజ్యం దాదాపుగా అంతమైనట్లే. మరి ఈ కొత్త నేరస్తుల మాటేంటన్న ప్రశ్న తెరపైకొస్తోంది. అతీక్ బ్రదర్స్ మర్డర్ తర్వాత చేతులెత్తి లొంగిపోయిన ముగ్గురినీ అత్యంత చాకచక్యంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్లిచ్చిన సమాచారంతో మరో నలుగురిని అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌స్టర్లుగా ఎదగాలనో అతీక్‌అహ్మద్ సోదరులపై ఏదో కోపంతోనో వారు హత్యలు చేశారని ఎవరూ అనుకోవడంలేదు దీని వెనుక భారీ కుట్రే ఉంది. కోరలు పీకేశాక అతీక్‌అహ్మద్‌లు నోరిప్పితే కొందరి పునాదులు కదిలేలా ఉన్నాయి. రాష్ట్రాలే కాదు దేశసరిహద్దులు దాటిన అతని నేరసామ్రాజ్యంలో కొన్ని నిజాలను రహస్యంగా ఉంచేందుకే పోలీసుల సమక్షంలో ఈ హత్యలు జరిగినట్లు కనిపిస్తోంది.
తమను హత్యచేస్తారని అతీక్‌అహ్మద్ సోదరులు ముందే అనుమానించారు. ఎన్‌కౌంటర్ చేస్తారని అతీక్ భయపడితే జైలు నుంచి బయటికి తీసుకొచ్చి చంపేస్తారని అతని సోదరుడు అష్రఫ్ యూపీ సీఎం యోగి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ముందే రాసిన లేఖ పెనుదుమారం రేపుతోంది. 15 రోజుల్లో హతమారుస్తామని ఓ సీనియర్ పోలీసు అధికారి బెదిరించినట్టు అష్రఫ్ ఆ లేఖలో పేర్కొన్నాడు సరిగ్గా అదే జరిగింది. నేరస్తులు ఏ బొరియలో దాక్కున్నా వదలరని చెప్పే యూపీ పోలీసుల ఘోర వైఫల్యంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఆ సమయంలో అతీక్ సోదరులకు సెక్యూరిటీగా ఉన్న 19 మంది పోలీసులను విధులనుంచి తప్పించారు వారిని విచారిస్తున్నారు. పోలీసులు ఈ దారుణానికి సహకరించారా లేదా అన్నదానికంటే తెరవెనుక జరిగిన భారీ కుట్ర ఉత్తరప్రదేశ్‌లో నేరసామ్రాజ్యం ఎంత బలంగా ఉందో చాటిచెప్పింది.
నిందితులు ముగ్గురూ చిన్నవయసువాళ్లే. కానీ వయసుకు మించిన నేరాలతో ఇప్పటికే పోలీసు రికార్డుల్లో ఉన్నారు. వారు నేరసామ్రాజ్యంలో మాస్టర్స్ డిగ్రీ చేసే అవకాశాన్ని ఈ వ్యవస్థే ఇచ్చింది. నిందితులనుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న పిస్టల్ మేడ్ ఇన్ టర్కీ. ఇప్పటిదాకా పాకిస్తాన్ చైనా ఆయుధాలు సరిహద్దుల్లో దొరికాయిగానీ టర్కీ ఆధునిక తుపాకీ ఇప్పుడే చూడటం. అతీక్ అహ్మద్‌కి ఐఎస్‌ఐతో పాటు లష్కరే తోయిబా ఉగ్రవాదసంస్థతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలున్నాయి. ఇప్పుడు నిందితుల దగ్గర దొరికిన టర్కీ పిస్టల్‌తో ఈ హత్యల వెనుక ఐఎస్‌ఐ హస్తం ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయి.
అతీక్ అష్రఫ్‌ల మీద వందకు పైగా క్రిమినల్ కేసులున్నాయి. ఇప్పటికే శిక్షపడ్డా విచారించాల్సిన కేసులు చాలా ఉండటంతో వాటిలో పెద్ద తలలు బయటపడతాయన్న భయంతోనూ వారిని టార్గెట్ చేసుకుని ఉండొచ్చు. పాయింట్‌బ్లాంక్‌లో హత్యచేయడానికి వచ్చారంటే దొరికిపోతామనో ఎదురుకాల్పులు జరిగితే ప్రాణాలు పోతాయనో తెలీసే తెగించి వచ్చారు. అంటే గ్యాంగ్‌స్టర్లుగా ఎదగాలనుకున్నామన్న వాదన అబద్ధమన్నమాట. దాదాపు 10లక్షల విలువైన టర్కీ పిస్టల్ వాడారంటే వెనుక పెద్ద తలలే ఉన్నాయ్. ఆ కుట్రను ఛేదించేదాకా ఎంతమంది ఆకు రౌడీల్ని వేసేసినా నేరసామ్రాజ్యానికి చీమ కుట్టినట్లయినా ఉండదు. బుల్లెట్ తల్లో దిగేముందు అతీక్ నోటివెంట వచ్చిన ఆ గుడ్డూ ముస్లిం ఎవరో అతని వెనుక ఇంకెన్ని రహస్యాలున్నాయో యోగికి మరో ఐదేళ్లకు సరిపడా పని మిగిలేఉంది.