వివేకా మర్డర్ కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. ఎంపీ తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి రాజకీయంగా సెగ పుట్టించిన సీబీఐ అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేసింది. చూస్తుంటే వివేకా హత్య కేసులో మరిన్ని సంచలన అరెస్టులు జరిగేలా ఉన్నాయి. ఈ వారం పదిరోజుల్లో కేసును కొలిక్కి తేవాలనుకుంటోంది కేంద్ర దర్యాప్తు సంస్థ. తండ్రిని అరెస్ట్ చేయగానే కొడుక్కి నోటీసులిచ్చింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అవినాష్‌రెడ్డికి ముందురోజు నోటీసులిచ్చారు సీబీఐ అధికారులు. తీరా సీబీఐ ఆఫీసుకు వచ్చిన ఎంపీ అవినాష్‌రెడ్డి నిమిషాల్లోనే అక్కడినుంచి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం అవినాష్‌రెడ్డి వేసిన పిటిషన్ అదే సమయంలో హైకోర్టులో విచారణకు రావటంతో ఆ సమయంలో సీబీఐ ఆయన్ని విచారించలేకపోయింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడైన వివేకా హత్యకేసు కీలక అరెస్టులతో ఊహించని మలుపు తిరుగుతోంది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ కొన్ని రోజులకే ఎంపీ తండ్రిని అరెస్ట్ చేసి 14రోజుల రిమాండ్‌తో చంచలగూడ జైలుకు తరలించింది. భాస్కర్‌రెడ్డిని 10రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ అధికారులు పిటిషన్ వేశారు. అవినాష్‌రెడ్డిని కూడా అదుపులోకి తీసుకుంటామని సీబీఐ అధికారులు కోర్టుకు చెప్పటంతో ఆయన అరెస్ట్ కూడా తప్పేలా లేదు. 30లోగా వైఎస్ వివేకా హత్యకేసు విచారణ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించటంతో సీబీఐ అదే పనిలో ఉంది. అరెస్ట్ చేయకుంటే విచారణకు హాజరయ్యేందుకు ఎంపీ సిద్ధమంటున్నారు ఆయన లాయర్లు. ఎప్పుడు విచారణకు పిలిచినా కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారని సీబీఐ అధికారులు ఆగ్రహిస్తున్నారు.
ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చే ఆదేశాలను బట్టి సీబీఐ ముందుకువెళ్లబోతోంది. ముందస్తు బెయిల్ నిరాకరించిన పక్షంలో భాస్కర్‌రెడ్డి తర్వాతి అరెస్ట్ ఎంపీ అవినాష్‌రెడ్డిదే కావచ్చు. వైసీపీ సొంత మీడియాలో సీబీఐపై ఓ రేంజ్‌లో దండయాత్ర జరుగుతోంది. అసలు విషయాల్ని మరుగునపెట్టి తమకు నచ్చినట్లు దర్యాప్తుసంస్థ విచారణను ఫ్రేమ్ చేస్తోందని వైసీపీ అనుకూలవర్గం ఆరోపిస్తోంది. వైఎస్ వివేకా స్త్రీలోలుడన్నట్లు ఓ సెక్షన్ మీడియా చిత్రీకరిస్తోందని ఆయన కుటుంబం ఆవేదన చెందుతోంది. ఎంక్వయిరీ ఎలాచేయాలో ఆధారాలు ఎలా ఫ్రేమ్ చేయాలో సీబీఐకి ఎవరూ చెప్పాల్సిన పన్లేదు. ఒకవేళ దర్యాప్తు అస్తవ్యస్తంగా సాగితే సరైన ఆధారాలు లేకపోతే ఏ కేసు కూడా నిలవదు. అయినా వైఎస్ వివేకా కూతురు సునీత టీడీపీ కలిసి సీబీఐని తప్పుదోవ పట్టిస్తున్నాయన్న ప్రచారం అసంబద్ధంగా ఉంది. రాజకీయం కోసం బాబాయ్ హత్యను కూడా సీరియస్‌గా తీసుకోలేదన్న అపనిందలు జగన్‌కి తప్పేలా లేవు. అందుకే సీబీఐ దర్యాప్తుపై వైసీపీ విపరీతంగా టెన్షన్‌పడుతోంది. ముందస్తు బెయిల్ వస్తే కొన్నాళ్లు చట్టపరమైన రక్షణ దొరుకుతుందేమోగానీ వైఎస్ వివేకా హత్యకేసు వైసీపీ ఎంపీ కుటుంబాన్ని వదిలేలా లేదు.