ఓటీటీల్లో అడ‌ల్డ్ కంటెంట్.. హ‌ద్దులు మీరుతోందా

By KTV Telugu On 19 April, 2023
image

సీరియ‌స్‌గా ఓ థ్రిల్ల‌ర్‌ క్రైమ్ సిరీసో చూస్తుంటాం లేదా రోమ్ సామ్రాజ్యానికి సంబంధించిన ఏ హిస్టారిక‌ల్ కంటెంట్‌నో వీక్షిస్తుంటా. స‌డెన్‌గా మ‌ధ్య‌లో ఒంటిమీద నూలుపోగు లేని దృశ్యాలు చూడాల్సి వ‌స్తుంది. ఏ నీలిచిత్రం ముక్క‌నో మ‌ధ్య‌లో అతికించిన‌ట్లుంటుందా దృశ్యం. పొర‌పాటున ఆ స‌మ‌యంలో టీవీ ముందు కుటుంబ‌స‌భ్యుల‌తో ఉన్నామంటే కొంప‌కొల్లేరే. వెండితెర‌మీదికి రిలీజ్ చేసే సిన్మాల‌కు స‌వాలక్ష రూల్స్ ఉంటాయి. అశ్లీల‌ అభ్యంత‌క‌ర దృశ్యాల‌కు సెన్సార్ క‌త్తెర త‌ర్వాతే ఏ సిన్మా అయినా జ‌నం ముందుకు వ‌స్తుంది. కానీ ఓటీటీలు వ‌చ్చాక వాటికి అడ్డుఅదుపులేకుండా పోయింది. ఓన్లీ అడ‌ల్డ్స్ అనో 18ప్ల‌స్ అనో మొద‌ట్లో ఓ డిక్లైమ‌ర్ వేస్తే చాలు ఏద‌న్నా చూపించేయొచ్చు.

ఓటీటీల్లో మితిమీరుతున్న అశ్లీల కంటెంట్‌ నియంత్రణపై కేంద్రం దృష్టి పెట్టింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై లెక్కలేనన్ని ఫిర్యాదులు వస్తుండటంతో వాటిపై దృష్టి సారించింది. ఫిర్యాదుల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థను రూపొందించింది. ఓటీటీల్లోని అశ్లీల అసభ్యకర కంటెంట్‌ నిషేధానికి క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మిస్తోంది కేంద్ర‌ప్ర‌భుత్వం. ఓటీటీ కంటెంట్‌పై కమ్యూనికేషన్స్ అండ్ ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో దీనిపై సీరియ‌స్ చర్చ జరిగింది. సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సహా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఓటీటీలో అశ్లీలం అదుపుపై సుదీర్ఘంగా చ‌ర్చించారు.

ఓటీటీ కంటెంట్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కన్నేసింది. ఓటీటీ వెబ్ సిరీస్‌లలో అశ్లీలం పెరిగిపోవడంపై కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటీటీల్లో పెరుగుతున్న అశ్లీలత భారతీయ సంస్కృతిపై దుష్ప్రభావం చూపుతోందన్న అభిప్రాయానికి వారొచ్చారు. ఓటీటీ కంటెంట్‌ విషయంలో సోనీ లివ్‌పై 4,063 అమెజాన్ ప్రైమ్‌పై 3,203 నెట్‌ఫ్లిక్స్‌పై 401 ఫిర్యాదులు అందాయి. ఈసారి స‌మావేశంలో నెట్‌ఫ్లిక్స్ అమెజాన్ సోనీ లివ్ వంటి పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను పిలిచి మాట్లాడాల‌ని పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ భావిస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కూడా సెన్సార్‌షిప్ లేదంటే మరింత నియంత్రణ ఉండాలని స్టాండింగ్ కమిటీ భావిస్తోంది. మొత్తంమీద కాస్త ఆల‌స్యంగానైనా ఓటీటీల్లోని అశ్లీల కంటెంట్‌కు చెక్‌ పెట్టడ‌మైతే ఖాయంగానే కనిపిస్తోంది.