షైస్తా పర్వీన్. యూపీలో డాన్ బ్రదర్స్ అతీఖ్ అహ్మద్ అష్రఫ్‌ల మర్డర్ తర్వాత ఈమె కోసమే పోలీసులు జల్లెడ పడుతున్నారు. పర్వీన్ అతీఖ్ అహ్మద్ భార్య. కొడుకు ఎన్కౌంటర్ అయినా భర్త మరిది హత్యకు గురైనా షైస్తా పర్వీన్ అడ్రస్ లేదు. ఓ సాధారణ గృహిణి అయ్యుంటే ఆమె గురించి ఇంత చర్చ జరిగేదే కాదు. అతీఖ్ అహ్మద్ నేరాల్లో ఆమె పాత్ర కూడా కీలకమని అనుమానిస్తున్నారు పోలీసులు. అందుకే ఆమెను లేడీ డాన్‌గా చూస్తున్నారు. షైస్తా పర్వీన్ ఆచూకీ చెప్పినవారికి 50వేల నజరానా ప్రకటించారు. భర్త హత్య తర్వాత ఒంటరైన పర్వీన్ మరో మార్గం లేక లొంగిపోతుందని పోలీసులు అనుకున్నారు. కానీ మిసెస్ అతీఖ్ అహ్మద్ ఇంకా అజ్ఞాతంలోనే ఉండటంతో ఆమెకోసం గాలింపు ముమ్మరం చేశారు.
అతీఖ్ అహ్మద్ నేరసామ్రాజ్యాన్ని నడపడంలో శాయిస్తా పర్వీన్ కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. అతీఖ్ జైల్లో ఉండగా మాఫియాతో అక్రమ దందాలన్నీ ఆమె కనుసన్నల్లోనే నడిచాయని పోలీసులు చెబుతున్నారు. దీంతో యూపీ పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో అతీఖ్ భార్య పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతీఖ్ అష్రఫ్ జైలుకు వెళ్లిన ప్రతిసారీ 50 ఏళ్ల షైస్తానే తెరవెనుక వ్యవహారాలన్నీ చక్కబెట్టేదని అనుమానిస్తున్నారు. ఇంటర్ చదువుకున్న షైస్తా మొదట్లో ఇంటి పనులకే పరిమితమైంది. 1996లో అతీఖ్ని ఆమె పెళ్లాడింది వీరికి ఐదుగురు కొడుకులున్నారు. వారిలో ఒకడైన అసద్ తండ్రి హత్యకు రెండ్రోజుల ముందు పోలీసు ఎన్కౌంటర్లో చనిపోయాడు.
షైస్తా రిటైర్డ్ పోలీసు కానిస్టేబుల్ కూతురు. ఆమె చిన్నతనమంతా ప్రభుత్వ పోలీసు క్వార్టర్స్‌లో గడిచింది. అలాంటి మహిళ ఇప్పుడు గ్యాంగ్ స్టర్ భార్యగా అజ్ఞాతంలో ఉండటం విచిత్రం. గుజరాత్‌లోని సబర్మతి జైలులో భర్త అతీఖ్ ఉన్నప్పుడు షైస్తా ఆయన్ని కలుసుకుంది. బీఎస్పీ ఎమ్మెల్యే హత్యకేసు సాక్షి ఉమేష్ పాల్ని చంపడం గురించి వాళ్లిద్దరి మధ్య చర్చ జరిగిందని అనుమానిస్తున్నారు. జైల్లో ఉన్న భర్తకు ఓ పోలీస్ ద్వారా షైస్తా సిమ్‌కార్డు, ఆతర్వాత ఫోన్ పంపిందని చెబుతున్నారు. షూటర్లతో అతీఖ్ ఆ ఫోన్‌తోనే మాట్లాడాడని పోలీసులు గుర్తించారు. షైస్తా తనను డబ్బుకోసం చాలాసార్లు ఫోన్లో బెదిరించిందని ఓ ప్రాపర్టీ డీలర్ ఫిర్యాదు కూడా చేశాడు. ఉమేష్‌పాల్ హత్య తర్వాత తప్పించుకున్న షైస్తా కొడుకు భర్త మరణం తర్వాత కూడా ఆచూకీ చిక్కలేదు. హత్యకేసుతో పాటు మూడు చీటింగ్ కేసులు ఆమెపై నమోదయ్యాయి.
భర్తలాగే రాజకీయాల్లో రాణించాలనుకుంది గ్యాంగ్ స్టర్ అతీఖ్ భార్య షైస్తా పర్వీన్. రెండేళ్లక్రితం ఆమె మజ్లిస్ పార్టీలో చేరింది. ఈ ఏడాది జనవరిలోనే బీఎస్పీలో చేరిపోయింది. మేయర్ ఎన్నికల కోసం బీఎస్పీ టిక్కెట్ కోసం ఆమె ప్రయత్నించింది. అయితే ఉమేష్ పాల్ హత్య తర్వాత పార్టీ ఆమెని దూరం పెట్టింది. మేయర్ అభ్యర్థుల జాబితా నుంచి షైస్తా పర్వీన్ పేరు తొలగించింది. అయినవాళ్లను పోగొట్టుకున్న షైస్తా మిగిలిన సంతానంకోసమైనా లొంగిపోతుందా లేదంటే భర్త నేరసామ్రాజ్యానికి కొత్త వారసురాలిగా తెరవెనుకే ఉండి వ్యవహారాలు నడిపిస్తుందా అన్నది చూడాలి. ఒకటి మాత్రం నిజం. కొడుకు భర్తలాగే జీవితం విషాదంగా ముగియకూడదనకుంటే లొంగుబాటే షైస్తా ముందున్న ఒకే ఒక మార్గం.