కర్టాటక రాజకీయం మఠాల చుట్టూ తిరుగుతోంది. సినిమా స్టార్స్‌ని తన చుట్టూ తిప్పుకుంటోంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కర్నాటకలో ప్రచారం కొత్త సిన్మా ప్రమోషన్లా సాగుతోంది. దేశంలో ఎక్కడా లేనంత సందడి కనిపిస్తోంది కన్నడనాట. రెక్కలు కట్టుకుని హెలికాప్టర్లలో తిరిగేస్తున్నారు ప్రధానపార్టీల నేతలు. దాదాపు 150 హెలికాప్టర్లను కర్నాటక ప్రచారంలో వాడుతున్నారు. ప్రచారానికి సినీ గ్లామర్‌ని వాడుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. కొంత మంది స్టార్లు కొన్ని పార్టీలకు ప్రచారం చేస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కిచ్చా సుదీప్ బీజేపీలో చేరారని ప్రచారం జరిగింది. సీఎం బసవరాజ్ బొమ్మైతో సుదీప్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే బీజేపీలో చేరుతున్నానన్న ప్రచారాన్ని సుదీప్ ఖండించారు. బొమ్మై తనకు చాలా సహాయం చేశారని అందుకే ఆయనకే తన మద్దతంటూ క్లారిటీ ఇచ్చారు సుదీప్.
బస్వరాజ్ బొమ్మై సుదీప్ ఎపిసోడ్‌పై కాంగ్రెస్ వైపు నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఆరున్నర కోట్ల కన్నడిగుల మద్దతుతోనే అధికారం సాధ్యమని సుదీప్ లాంటి స్టార్లు కాదంటూ కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఎస్టీ సామాజికవర్గానికి చెందిన సుదీప్‌కు కన్నడలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కల్యాణ కర్ణాటక ప్రాంతంలో ఆయన సామాజికవర్గం నాయక పెద్ద సంఖ్యలో ఉంది. అందుకే బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా సుదీప్‌ను బరిలోకి దించబోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ బొమ్మై అంటే తనకు వ్యక్తిగత అభిమానం ఉందని బీజేపీకి తాను మద్దతు ఇవ్వడం లేదని సుదీప్ చెబుతున్నాడు. అయితే తనకు మద్దతిస్తున్నాడంటే బీజేపీకి సపోర్ట్ చేసినట్లేనన్నది సీఎం బస్వరాజ్ బొమ్మై మాట.
మరో కన్నడ హీరో దర్సన్ కూడా బీజేపీకే మద్దతు పలుకుతున్నాడు. గత ఎన్నికల్లో మాండ్య జిల్లా నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన సుమలతకు బహిరంగంగానే మద్దతు తెలిపి ప్రచారం చేశాడీ హీరో. ఇటు సుమలత కూడా ఈమధ్య బీజేపీవైపే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ఆమె మోడీ పాలనపై బహిరంగ వేదికలమీదే ప్రశంసల జల్లు కురిపించారు. వచ్చే ఎన్నికల్లో సుమలత బీజేపీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన కాంతారా స్టార్ రిషబ్ శెట్టి మద్దతు కూడా తమకేనంటోంది బీజేపీ. ఉడిపిలో సీఎంతో రిషబ్‌శెట్టి భేటీతో పాటు వాళ్లిద్దరూ కలిసి కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని దర్శించుకోవడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. అయితే నో పొలిటికల్ కలర్ అంటున్నాడు రిషబ్‌శెట్టి. కాంతారా హీరోర తనకు మంచి సన్నిహితుడని తామిద్దరి భావజాలం ఒకటేనంటున్నారు బీజేపీ సీఎ బొమ్మై.
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో కర్నాటకలో కొన్ని చోట్ల ప్రచారంచేయించాలన్న ఆలోచనతోఉంది బీజేపీ. పవన్‌కళ్యాణ్ ముందుకొస్తారో లేదోగానీ ఆయన ఓకే అంటే తెలుగువారు ఎక్కువగా ఉన్నచోట ఆయన ప్రచారం కూడా పెట్టాలన్న ప్లాన్‌తో ఉంది. వీళ్లే కాకుండా మరికొందరు సెలబ్రిటీలు కూడా ప్రచారరంగంలోకి దూకబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశమంతా చిరపరిచితుడైన కన్నడనటుడు ప్రకాష్‌రాజ్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. తరచూ ట్వీట్లతో ఆయన విరుచుకుపడుతూనే ఉన్నారు. బీజేపీకి సుదీప్ మద్దతివ్వడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. సిల్వర్ స్క్రీన్ మీద రాణించిన చాలా మంది రాజకీయాల్లో తమ ముద్రవేసే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కర్నాటక రాజకీయాల నేపథ్యంలో మళ్లీ సెలబ్రిటీలకు పొలిటికల్ రంగు అంటుకుంటోంది. దీంతో కన్నడనాట ప్రచారం ఆసక్తికరంగా మారిపోయింది.