మేకపాటి కుటుంబం ఒకప్పుడు జగన్ కు డై హార్డ్ ఫ్యాన్స్. ఇప్పుడు సీఎం స్వయంగా వారిని దూరం పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబం ప్రాబల్యాన్ని తగ్గించేందుకు జగన్ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన తనయుడు జగన్ సీఎం పదవిని ఆశిస్తే ఆయనకు మద్దతిచ్చిన వారిలో మేకపాటి కుటుంబం కూడా ఉంది. జగన్ దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి చిన్ననాటి స్నేహితులుగా చెబుతారు. ఇద్దరి మధ్య కొంతమేర వ్యాపార లావాదేవీలు కూడా ఉండేవి. దానితో జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి మేకపాటి కుటుంబం ఆయన వెంట నడించింది. 2014ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఎంపీ సీటు చంద్రశేఖర్ రెడ్డికి ఉదయగిరి ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డికి ఆత్మకూరు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. కట్ చేసి చూస్తే మేకపాటి కుటుంబాన్ని గత ఎన్నికల్లో రెండు ఎమ్మెల్యే సీట్లుకే పరిమితం చేశారు.
కాలచక్రంలో ఐదేళ్లు గిరిగిరా తిరుగుతున్న నేపథ్యంలో మేకపాటి కుటుంబాన్ని ఈ సారి కేవలం ఆత్మకూరు ఎమ్మెల్యే సీటుకే పరిమితం చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. రాజమోహన్ రెడ్డి మూడు సార్లు జగన్ కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అయినా ఆయన్ను పక్కన పెట్టేశారు. ఆశించిన టీటీడీ ఛైర్మన్ పదవి కూడా ఇవ్వలేదు. అందుకే భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఒక ఎమ్మెల్యే పదవి కూడా ఇవ్వరన్న వాదన వినిపిస్తోంది. ఏరుదాటాక తెప్పతగలేసిన చందంగా జగన్ తీరు తయారైందని నెల్లూరు రెడ్డి సామాజికవర్గం ఆగ్రహం చెందుతోంది..
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఓ చక్రంతిప్పిన మేకపాటి కుటుంబ రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా మారింది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దానితో ఆయన తన రెండవ భార్య శాంతమ్మని పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఇటీవల పరిణామాల నేపధ్యంలో జగన్ వద్ద మార్కులు కొట్టేయడానికి తమ రాజకీయ భవిష్యత్తు పదిలం చేసుకునేందుకు రాజమోహన్ రెడ్డి ఆయన కుమారుడు విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే అనారోగ్యం పాలైన చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ శేఖరన్న ఇంటికే పరిమితమయ్యారు.
గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత రాజమోహన్ రెడ్డి తన మరో కుమారుడు ఫృద్వీరెడ్డిని లేదంటే సోదరుడు కుమార్తె రచనారెడ్డిని ఉదయగిరి నుంచి రాజకీయాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మేకపాటి వారు మొదటి నుంచి ఆత్మకూరు ఉదయగిరి రెండు నియోజకవర్గాలు తమకి రెండు కళ్లని చెబుతుండేవారు. ఇటీవల రాజమోహన్ రెడ్డి విక్రమ్ రెడ్డిని వెంటపెట్టుకుని సీఎం జగన్ వద్దకి వెళ్లారట. ఉదయగిరి టిక్కెట్టు చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె రచనారెడ్డికి ఇవ్వాలని కోరారట. అయితే జగన్ నుంచి సరైన సమాధానం రాలేదని చెబుతున్నారు.
నెల్లూరు జిల్లాలో కొత్త రాజకీయ క్రీడాకారులు వచ్చేశారు. దానితో ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి వారి పట్టు తప్పుతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఆయన అనుచరులు గ్రూపులుగా విడిపోయి తమ ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. గల్లీ లీడర్లు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఉదయగిరి టికెట్ తనకేనని వంటేరు వేణుగోపాల్ రెడ్డి చెప్పుకుంటూ తిరుగుతున్నారు. జిల్లా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ మెట్టుకూరి ధనుంజయ్ రెడ్డి కూడా టవల్ వేశారు.
ఆశావహులు ఎక్కువ కావడంతో మేకపాటి కుటుంబంలో టెన్షన్ పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి విజయం సాధించకపోతే తమ రాజకీయాల్లో గడ్డు రోజులు తప్పవని మేకపాటి కుటుంబం భావిస్తోంది. పైగా విక్రమ్ రెడ్డికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఆయన ఎక్కడికి వెళ్లినా వందల సమస్యలు ప్రస్తావించి జనం నిలదీస్తున్నారు. సొంత నిధులతో బస్టాండ్ నిర్మించాలన్న ప్రయత్నం బెడిసికొట్టారు. పనులు జరగకపోగా కాంట్రాక్టుల కోసం నాటకం ఆడారని ప్రత్యర్థులు ఆరోపించారు. కంప సముద్రం గ్రామాన్ని మేకపాటి దత్తత తీసుకోగా అక్కడ జరిగిన అభివృద్ధి కనిపించలేదు. ఏదేమైనా మేకపాటి కుటుంబానికి వచ్చే ఎన్నికలు పెద్ద పరీక్షే అవుతాయనడంలో సందేహం లేదు.