రాజకీయం ఉత్కంఠ రేకెత్తిస్తున్న “మహా” సంక్షోభం

By KTV Telugu On 19 April, 2023
image

మహారాష్ట్ర రాజకీయం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. తుపాను ముందు ప్రశాంతతలా కనిపిస్తోంది NCP పరిస్థితి. ఇంతకీ అజిత్ పవార్‌ బీజేపీలో చేరుతున్నారా. పవార్ పార్టీలో ఏం జరుగుతోంది. మహారాష్ట్ర  పాలిటిక్స్‌లో మళ్లీ సంక్షోభ వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. శరద్ పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక రాబోతోందంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. NCP కీలక నేత మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు సంచలనంగా మారాయి. అయితే ఇదంతా అబద్ధం అని కొట్టిపారేశారు అజిత్ పవార్. తను NCPలోనే ఉన్నా, ఎప్పటికీ ఉంటా అని స్పష్టంచేశారు. అజిత్ పవార్ పార్టీ మార్పుపై గత కొంతకాలంగా విస్తృత వినిపిస్తున్నాయి. గతవారం అజిత్‌ అన్ని షెడ్యూల్స్ రద్దుచేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లడంపై చర్చనీయాంశం అయ్యింది. తాజాగా మరోసారి ఇవే వార్తలు హల్‌చల్ చేశాయి. ప్రఫుల్ పటేల్‌, చగన్ భుజ్‌బల్‌, ధనుంజయ్ ముండే సహా 40మంది ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ బీజేపీలో చేరుతున్నారని ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ముంబైలో తన వర్గం ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం అజిత్ పవార్‌ గవర్నర్‌ను కలుస్తారనే ప్రచారం జరిగింది. NCP పింప్రి ఎమ్మెల్యే మాణిక్‌రావ్ కోకటే సహా పలువురు ఎమ్మెల్యేలు అజిత్ పవార్‌కు బహిరంగ మద్దతు ప్రకటించడం ఈ వార్తలకు బలం చేకూర్చినట్టైంది.

అయితే NCP అధినేత శరద్ పవార్‌ సైతం అజిత్ పవార్ తిరుగుబాటు వార్తలను ఖండించారు. ప్రస్తుతం అజిత్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారని మీడియా కథనాల్లో నిజం లేదని స్పష్టంచేశారు. ఇది మహా వికాస్ అఘాడీని బలహీనపరిచే కుట్ర అని ఆరోపించారు శివసేన ఉద్ధవ్ ఠాక్రే నేత సంజయ్ రౌత్. మొత్తానికి అజిత్ పవార్‌ ప్రకటనతో NCP సంక్షోభానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టైంది. 2022లో ఉద్ధవ్ థాకరేను గద్దె దించడానికి శివసేనలో రెబెల్ గా ఉన్న ఏక్ నాథ్ షిండేను చేరదీసి శివసేనలో బిజెపి చిచ్చు రేపిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. థాకరే తమను ఖాతరు చేయకపోవడమే కాకుండా కాంగ్రెస్ తో జట్టు కట్టడం బిజెపికి నచ్చలేదు. థాకరేకు గుణపాఠం చెప్పడానికి అదను కోసం ఎదురు చూసిన కమలనాథులు ఏక్ నాథ్ షిండేకి ముఖ్యమంత్రి పదవి ఎర వేసి ఉద్దవ్ థాకరే ఉద్యోగం ఊడబీకారు. ఇపుడు అజిత్ పవార్ కలిసొస్తే షిండేని పక్కన పెట్టి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది కమలనాథుల వ్యూహంగా చెబుతున్నారు. అపుడు అజిత్ పవార్ ను కొంత కాలం ముఖ్యమంత్రిగా కాలక్షేపం చేసే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.

అయితే ఇది శరద్ పవార్ కు తెలియకుండానే జరుగుతోందా అన్నది అనుమానమే. ఎందుకంటే చాలా సందర్భాల్లో శరద్ పవార్ బిజెపి ప్రభుత్వానికి మద్దతుగానే ఉంటున్నారు. ఇటీవల మోదీపై రాహుల్ గాంధీ ఆదానీ కంపెనీలో అక్రమాలపై విరుచుకు పడ్డప్పుడు ఆదానీ అంబానీ కంపెనీలపై ఊరికే విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని   అన్నారు పవార్. పవార్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకోవడంతో విపక్షాలు బిక్కమొగం వేశాయి. అప్పుడు పవార్ ఆదానీలను కాపాడ్డానికి అలా అన్నారా లేక ఆదానీ డొల్ల కంపెనీల్లో 20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది మోదీయే అన్న రాహుల్ విమర్శను తిప్పికొట్టడానికే అలాఅన్నారా అన్నది ఇపుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఇక మహారాష్ట్ర పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ కూడా దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో మరాఠాలో పాగా వేయాలంటే శరద్ పవార్ పార్టీతో పాటు ఉద్ధవ్ థాకరే తమకి అండగా ఉంటారని కాంగ్రెస్ నమ్మకం పెట్టుకుంది.

అటువంటిది ఇపుడు అజిత్ పవార్ బిజెపితో టచ్ లో ఉండడం వెనుక శరద్ పవార్ వ్యూహం ఏమన్నా ఉందా అని కాంగ్రెస్ వ్యూహకర్తలు అనుమానిస్తున్నారు. ఎందుకంటే శరద్ పవార్ ను ఏ క్షణంలోనూ నమ్మలేం అంటారు కాంగ్రెస్ నేతలు. విపక్షాలన్నింటినీ ఒక్క తాటిపైకి తీసుకు రాడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న తరుణంలో శరద్ పవార్ చేజారుతారా అన్న అనుమానాలు కాంగ్రెస్ నాయకత్వాన్ని కలవర పెడుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలను తన దారికి తెచ్చుకోవడంలో మోదీ విజయవంతమయ్యారు. గులాం నబీ ఆజాద్ ను అలాగే తన దారికి తెచ్చుకున్నారు. ఇపుడు అనుభవజ్ఞుడైన శరద్ పవార్ కు కూడా మోదీ గేలం వేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. అయితే మహారాష్ట్రలో ఇప్పటికే శివసేనను చీల్చిన బీజేపీ మరో కొత్త భాగస్వామి కోసం ఎందుకు ఎదురుచూస్తోంది అన్నది ఆసక్తికరం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.