పదే పదే అబద్ధాలు చెప్పడం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మీ బిడ్డకు ఎవరూ అండ లేరు అని చెప్పుకుని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నట్లుగా ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నదేమిటి జనానికి ఒరిగిందేమిటీ అని ప్రశ్నించే వాళ్లకి సమాధానాలు దొరకడం లేదు. జగన్ మాత్రం రాష్ట్రానికి ఏదో చేస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చి తప్పించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో గ్రీన్ ఫీల్గ్ పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఈ పోర్టుకు 4 వేల 600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని రెండు సంవత్సారాల్లో పోర్టు పూర్తి చేస్తామని 30 వేల ఉద్యోగాలు వస్తాయంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగంలో చెప్పారు. ఆయన మాటలు వినడానికి బాగున్నా సమ్మశక్యంగా లేవన్న వాదన బలపడుతోంది.
రాష్ట్రంలో ఈ నెలలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటోవ తేదీన వేతనాలు పెన్షనర్ లకు పెన్షన్ లు పడలేదు. 5వ తేదీ నుంచి దశల వారీగా 12వ తేదీ వరకూ వేతనాలు పడుతూనే ఉన్నాయి. రాష్ట్రం అప్పులు పదిలక్షల కోట్లు దాటిపోయాయి. మద్యం ఆదాయాన్ని కూడా ముందే అప్పుగా వాడేసుకున్న ఏపీ సర్కారు ఒకటో తేదీ నాటికి ఏ ఖాతాలో డబ్బులున్నా లాగేసుకుంటోంది. కాంట్రాక్టర్లకు డబ్బులివ్వలేకపోతోంది. సంక్షేమ కార్యాక్రమాల్లో భాగంగా మూడు రోజుల క్రితం అనంతపురం జిల్లాలో జరగాల్సిన వసతిదీవెన కార్యక్రమానికి నిధులు లేక వాయిదా వేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే ప్రకటించారు. ఈ దశలో ముఖ్యమంత్రి 4 వేల 600 కోట్లు పోర్టు నిర్మాణానికి ఇస్తామని ప్రకటించడం ఆచరణ సాద్యం కాదని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.
నిజానికి ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. గత ఆర్ధిక సంవత్సరంలో అనుమతించిన దానికంటే ఎక్కువ డబ్బు వాడుకున్న ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ కొత్త అప్పు కోసం ఎదురుచూస్తోంది. కేంద్రం బ్యాంకులు సాయం చేయకపోతే సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపలేమని ఉన్నతాధికారులే చెబుతున్నారు. దీనికితోడు జగనన్న వసతిదీవెన కార్యక్రమాన్ని నిధులు లేక వాయిదా వేశామని సాక్ష్యాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి ప్రకటించారు. వేరు మార్గంలో నిధులు తెచ్చి రెండు మూడు నెలలు గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. విభజన హామీల పై ముఖ్యమంత్రి కోరిన వెంటనే ప్రధాని ఒక కమిటీని నియమించారని ఆ కమిటీ వద్దకు తన నేతృత్వంలో కార్యదర్శుల బృందం వెళుతున్నామని సిఎస్ ప్రకటించారు. సుమారు 10 వేల కోట్ల రూపాయలు తక్షణమే రావాల్సి ఉందని ఆయన చెప్పినప్పటికీ ఇంతవరకు ఎటువంటి స్పందన కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. ఇప్పుడు తాజాగా కార్యదర్శుల బృందం వెళ్లి ఏం చేస్తుందనేది వేచి చూడాలి. అవసరమైతే జగన్ కూడా ఢిల్లీ వస్తారని సీఎస్ చెప్పడంతో ఆర్థిక అంశాల్లో సీఎం ఎంత లాబీయిస్టో అర్థం చేసుకోవచ్చు. నిధుల కొరతతో అల్లాడుతున్న ఏపీ ప్రభుత్వానికి 2023-24 ఆర్ధిక సంవత్సరానికి నేటి వరకూ ఎఫ్ఆర్బిఎం కింద ఎటువంటి అనుమతులు ఇవ్వకపోవడం మరోవైపు బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఆర్ధికంగా అల్లాడుతోంది. ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడం అందిన చోటల్లా అప్పు తీసుకురావడంతోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని ప్రతిపక్షాలు ఆర్ధిక నిపుణులు అంటున్నారు.
అర్థిక సమస్యలను ప్రజల దృష్టి మళ్లించేందుకే జగన్ అబద్ధాలు చెబుతున్నారన్న ప్రచారమూ ఉంది. అందుకే ఎప్పటిలాగే ముఖ్యమంత్రి బుధవారం కూడా శ్రీకాకుళం సభలో అబద్దాలను అలవోకగా చెప్పేశారు. తనకు ఎవరి అండా లేదని తాను ఒంటరి పోరాటం చేస్తున్నానని చెప్పుకుంటూ సింపథీ పోగేసుకునేందుకు ప్రయత్నించారు. తను అబద్ధాలు చెప్పే అలవాటు లేదని చెబుతూనే అబద్దాలను వండి వార్చారు. దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నాయి. సీఎం తరచూ విశాఖ వచ్చి వెళ్తున్నట్లుగా షో చేస్తున్నారని అంటున్నాయి. విశాఖలో తాను సెప్టెంబరు నాటికి కాపురం పెడతానని జగన్ చెప్పుకోవడం కూడా శుద్ధ అబద్ధమే అవుతుందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నారు ఇప్పుటికి 16 ముహుర్తాలు ఫిక్స్ చేశారని ఇంతవరకూ ఒకటి అమలు కాలేదని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపిస్తున్నారు.