కన్నడ ఎన్నికల ప్రచారానికి తెలుగు స్టార్ పొలిటిషియన్లు

By KTV Telugu On 20 April, 2023
image

తెలుగు ప్రముఖులంతా కర్నాటక వైపు చూస్తున్నారు. కన్నడ నాట ఎన్నికల నేపథ్యంలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులంతా ప్రచారానికి వెళ్లనున్నారు. తమ తమ  పార్టీల విజయాల కోసంవారు  కృషి చేస్తారు. కన్నడ ఎన్నికల్లోనే తన సత్తా ఏంటో బిజెపికి చూపించాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి అయిదేళ్లకొక సారి వచ్చే ఎన్నికల పుణ్యమా అని కన్నడ తెలుగు ప్రజలు తమ ప్రాంతానికి చెందిన నేతలను చూడబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణా రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటోన్న కర్నాటక రాష్ట్రంలో తెలుగు వారు పెద్ద సంఖ్యలోనే నివసిస్తున్నారు. కోలార్ జిల్లాలో అయితే 76 శాతం మంది ప్రజలు తెలుగు వారే కావడం విశేషం. బెంగళూరు గ్రామీణలో 65 శాతం రాయచూరు లో 64 శాతం ఉమ్మడి బళ్లారిలో 63 శాతం మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. అంటే ఈ జిల్లాల్లో తెలుగువారిదే పూర్తి ఆధిపత్యం. బెంగళూరు నగరం కొప్పళ చిక్ బళ్లాపూర్ జిల్లాల్లో అయితే 43 నుండి 49 శాతం మంది తెలుగు వారే ఉంటున్నారు.

మొత్తం మీద 40 నియోజకవర్గాల్లో అయితే 40శాతానికి పైగా తెలుగు ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. వ్యవసాయం ఐటీ ఉద్యోగాలు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉపాధి కోసం పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు కర్నాటకు వలస పోయారు. దశాబ్ధాలుగా వారు అక్కడే స్థిరపడిపోయారు. వారి ఆధిపత్యాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వాల్లోనూ వారికి   ప్రాధాన్యత దక్కుతోంది. అక్కడ స్థిరపడ్డ తెలుగు వాళ్లు ఎన్నికల బరిలోనూ దిగుతున్నారు. అయితే పార్టీల పరంగా తెలుగు ప్రజల ఓటర్లను ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ బిజెపిలు రెండూ కూడా తమదైన వ్యూహాలతో దూసుకు పోతున్నాయి. ఈ మధ్యనే బిజెపిలో చేరిన మాజీ కాంగ్రెస్ నేత ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కర్నాటకలోని తెలుగు ప్రాంతాల్లో ప్రచార బాధ్యతలు అప్పగించింది బిజెపి నాయకత్వం. వై.ఎస్.ఆర్. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గాల్లో కీలక మంత్రి పదవులు నిర్వర్తించిన సీనియర్ కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా తన గ్రామంలో ఆలయ నిర్మాణంలో బిజీగా ఉన్నారు. ఇపుడు ఆయన తాను తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తున్నానన్నారు. మునుముందుగా కర్నాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకుంటానన్నారు రఘువీరారెడ్డి. రఘువీరారెడ్డికి కన్నడ నాట బంధు మిత్ర సపరివారం చాలా పెద్దదే ఉంది. ప్రముఖ కన్నడ సినిమా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రఘువీరా రెడ్డి బంధువే. ఇద్దరి ఇంటిపేర్లూ నీలకంఠాపురమే. అందుకే కన్నడ నాట తెలుగు ప్రజలను తాను ప్రభావితం చేయగలనని రఘువీరారెడ్డి భావిస్తున్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తర్వాత రాజకీయాల్లో తాను యాక్టివ్ గా లేకపోవడం కరెక్ట్ కాదనుకున్నానని అందుకే మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చానని రఘువీరా రెడ్డి ప్రకటించారు.

ఇక మరో కాంగ్రెస్ మాజీ మంత్రి డి.కె. అరుణ కర్నాటక ఎన్నికల్లో బిజెపి తరపున  స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం లో పాల్గొంటారు. ఆ మధ్య బిజెపి సభలో మెరిసిన మాజీ ఎంపీ సినీ నటి జయప్రద సినీ నటుడు నరేష్ లు కూడా బిజెపి తరపున ప్రచారం చేసే అవకాశాలు ఉండచ్చంటున్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. కర్నాటక ఎన్నికలను ఓవేదికగా చేసుకుని తన బలం ఏంటో బిజెపికి చాటి చెప్పాలని కసిగా ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కర్నాటకలో ఒకప్పటి తన కుడి భుజం రేవంత్ రెడ్డికి అండగా నిలవాలని నిర్ణయించినట్లు సమాచారం. కర్నాటకలో టిడిపి అభిమానులు అనుచరులతో పాటు తమ సామాజిక వర్గాన్ని పరోక్షంగా రేవంత్ రెడ్డికి అండగా ఉండేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారని అంటున్నారు. అంటే అక్కడ కాంగ్రెస్ విజయానికి చంద్రబాబు ప్రయత్నిస్తారన్నమాట. కాంగ్రెస్ ను గెలిపించడం ద్వారా బిజెపి ఓటమిలో తాను కూడా ఒక భాగం కావాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారని భోగట్టా. తన సత్తా ఏంటో తెలుసుకుంటే అయినా బిజెపి అగ్రనాయకత్వం తన దారికి వచ్చి ఏపీలో టిడిపితో పొత్తుకు సై అంటుందేమోనని చంద్రబాబు ఆశగా చెబుతున్నారు.
2018 లో జరిగిన కర్నాటక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్-జేడీఎస్ లతో జట్టు కట్టి బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

ఎందుకంటే టిడిపితో పొత్తుకు జనసేన ఓకే చెప్పింది కానీ బిజెపి మాత్రం టిడిపితో కలిసి వెళ్లే ప్రసక్తి లేదని పవన్ కళ్యాణ్ కు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కర్నాటక ఎన్నికలను ఓ ప్రయోగశాలగా చేసుకుని తన బలాన్ని పరీక్షించుకుని దాన్ని బిజెపి పెద్దలకు చూపించాలన్నది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. అయితే అది  ఎలాంటి ఫలితాలనిస్తుందో చెప్పలేం. కర్నాటకలో బిజెపి పరిస్థితి ఎలాగూ బాగా లేదు. కచ్చితంగా ఓటమి చెందే అవకాశాలున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో తాను కూడా  ఓరాయి వేస్తే బిజెపి ఎలా ఓడినా కూడా తాను ఓడించి పంతం నెగ్గించుకున్నట్లు అవుతుందని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉండచ్చు. కాకపోతే ఇటువంటి వ్యూహాలు బెడిసికొడతాయంటున్నారు. రేపు కర్నాటకలో బిజెపి ఓడితే అందులో చంద్రబాబు పాత్ర లేకపోయినా కూడా చంద్రబాబు ఉద్దేశం బిజెపిని ఓడించడమే కాబట్టి బిజెపి నాయకత్వం చంద్రబాబును అంత తేలిగ్గా వదిలి పెట్టదని రాజకీయ పండితులు అంటున్నారు.

కన్నడ ఎన్నికల తర్వాత ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణా ఎన్నికల్లో అయినా బిజెపి తమతో పొత్తు పెట్టుకునేలా చేసేందుకే కర్నాటకలో బిజెపికి తన సత్తా చాటాలని బాబు భావిస్తున్నారట. ఏపీ తెలంగాణాలో ఎక్కడా కూడా టిడిపితో కలిసి వెళ్లకూడదన్నది బిజెపి నిర్ణయం. అందుకే పవన్ పదే పదే టిడిపితో కలిసి పోదాం అని పట్టుబట్టినా బిజెపి అగ్రనేతలు ఒకటే స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో టిడిపిని వదిలేస్తే ఆ ఎన్నికల తర్వాత ఇక ఆ పార్టీయే చరిత్రలో మిగలదని బిజెపి నేతలు అన్నారట. 2029 నాటికి ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన నిలబడేలా తాము చూస్తామని కూడా భరోసా ఇచ్చారట. అయితే టిడిపితో కలిసి పోవడానికే జనసేన ఆసక్తి కనబరుస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై క్లారిటీ ఇవ్వాల్సింది పవన్ కళ్యాణే తప్ప ఇంకెవరూ కాదు. ఇక బిజెపి మిత్ర పక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్నాటకలోనూ తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. లెక్కకు మించిన అభిమానులు ఉన్నారు. అంచేత పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పవన్ ప్రచారం చేస్తే కచ్చితంగా యూత్ పై దాని ప్రభావం ఉంటుందని అది ఆయన ప్రచారం చేసిన పార్టీకి కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.