ఉత్తర ప్రదేశ్ లో అత్యంత భయంకరమైన ఆతిక్ అహ్మద్ నేర సామ్రాజ్యం కుప్ప కూలింది

By KTV Telugu On 20 April, 2023
image

వందకు పైగా కౄరమైన నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటోన్న ఆతిక్ అతని సోదరుడు ఆష్రాఫ్ లను గుర్తు తెలియని దుండగులు పబ్లిగ్గా కాల్చి చంపేయగా ఆతిక్ తనయుడు అసద్ ఝాన్సీలో పోలీస్ ఎన్ కౌంటర్ లో మరణించాడు. నాలుగున్నర దశాబ్ధాల నేర చరిత్ర కలిగిన ఆతిక్ ను ఏ ప్రభుత్వమూ బోను లో నిలబెట్టి శిక్ష పడేలా చర్యలు తీసుకోలేకపోయింది. యోగి సిఎం అయ్యాక యూపీలో నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఓ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిని దారుణంగా హతమార్చిన కేసులో ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన గ్యాంగ్ స్టర్ ఆతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రాఫ్ లను పోలీసులు ప్రయాగ్ రాజ్ లో వైద్య పరీక్షలు చేయించి తీసుకు వస్తున్నారు పోలీసులు. అనంతరం మీడియాతో ఆతిక్ అష్రాఫ్ లు మాట్లాడుతున్న సమయంలో జర్నలిస్టుల ముసుగులో వచ్చిన ముగ్గురు అగంతకులు ఆతిక్ అష్రాఫ్ లను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారు.

అంతా కూడా అందరూ చూస్తుండగానే పోలీసులు ఉన్నారు. మీడియా ఉంది. ఇద్దరూ చూస్తూ ఉండగానే హంతకులు చాలా క్యాజువల్ గా జంట హత్యలకు తెగబడ్డారు. ఆతిక్ అష్రాఫ్ లను హతమార్చిన వెంటనే హంతకులు జై శ్రీరాం అన్న నినాదాలు చేశారు. దుండగుల కాల్పుల్లో ఆతిక్ అష్రాఫ్ లు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీనికి కొద్దిరోజుల ముందు ఝాన్సీలో ఆతిక్ తనయుడు అసద్ తో పాటు అతని అనుచరుడు గులామ్ లను ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారు. ఓ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ హత్య కేసులో అసద్ ప్రధాన ముద్దాయి. 2005లో బిఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ ను ఆతిక్ అహ్మద్ గ్యాంగ్ హతమార్చింది. రాజు పాల్ భార్య జయా పాల్ ఆతిక్ అహ్మద్ అష్రాఫ్ కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజు పాల్ హత్యకు ఉమేష్ పాల్ సాక్షిగా ఉన్నాడు. అందుకే ఉమేష్ పాల్ ని కూడా లేపేశారు ఆతిక్ అహ్మద్ ముఠా. ఈ హత్య ఘటనకు అసదే నాయకత్వం వహించాడు. అసద్ ను హతమార్చిన రోజునే పోలీసులు ఆతిక్ అహ్మద్ ను ఝాన్సీ కోర్టుకు తీసుకువచ్చారు. అప్పుడు తన కుమారుడి మరణ వార్త విని ఆతిక్ అహ్మద్ కన్నీటి పర్యంతమయ్యాడు.

ఆతిక్ అహ్మద్ మామూలు నేరగాడు కాదు. 17 ఏళ్ల వయసు నుండే నేరాలకు అలవాటు పడ్డాడు. 19వ ఏట ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు వందకు పైగా నేరాల్లో ఆతిక్ ప్రధాన ముద్దాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. జైల్లో ఉన్నా కూడా అనుకున్న చోట నేరాలు చేయించడం ఆతిక్ ప్రత్యేకత. అంత కరడు గట్టిన నేరస్థుడు కాబట్టే యూపీ ప్రభుత్వం కూడా ఆతిక్ ను సీరియస్ గా తీసుకుంది. అయితే గుర్తు తెలియని దుండగుల చేతుల్లో ఆతిక్ మరణించాడు. అయితే ఇది కూడా యోగి ప్రభుత్వ హత్యాకాండల్లో ఒకటని అంటున్నారు.
ఉమేష్ పాల్ హత్య జరిగిన తర్వాత రెండు నెలల వ్యవధిలోనే హత్యతో సంబంధం ఉన్న ఆరుగురు హత్యలకు గురయ్యారు. ఆతిక్ అహ్మద్ అష్రాఫ్ లతో పాటు అసద్, గులాం, ఉస్మాన్, అర్బాజ్ లు స్వల్ప వ్యవధిలో హత్యలకు గురయ్యారు. ఇటు ఆతిక్ అహ్మద్, అష్రాఫ్ ల దారుణ హత్యాకాండతో పాటు అసద్, గులామ్, అర్బాజ్ ల ఎన్ కౌంటర్ ఘటనలన్నీ కూడా అనుమానస్పద కేసులే అంటున్నారు హక్కుల నేతలు. అయితే హత్యలకు గురైన వారిపై ఎక్కడా సానుభూతి రావడం లేదు. ఎవరూ కూడా వీరిని ఎందుకు చంపారని ప్రశ్నించడం లేదు. చివరకు రాజకీయ పార్టీలు సైతం ఆతిక్, అష్రాఫ్ ల పేర్లు ప్రస్తావించకుండా రూల్ ఆప్ లా పాటించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నాయంటే ఉత్తర ప్రదేశ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం అవుతుంది. ఇటువంటి ఎన్ కౌంటర్లు ఉత్తర ప్రదేశ్ లో కొత్త కాదు. చాలా రొటీన్ కూడా. వీటికి ప్రజల నుండి కూడా మద్దతు లభించడమే అన్నింటినీ మించిన ప్రమాదకరమైన విశేషం. తాజా హత్యా కాండతో యూపీ దేశ వ్యాప్తంగా వార్తల్లో తేలుతోంది. అంతా యూపీలో లా అండ్ ఆర్డర్ గురించే చర్చించుకుంటున్నారు.

ఉత్తర ప్రదేశ్ లో 2017 ఎన్నికల్లో బిజెపి అఖండ విజయాన్ని సాధించింది. 312 స్థానాల్లో విజయం సాధించింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఎవ్వరికీ తెలీని యోగి ఆదిత్యనాథ్ ను బిజెపి నాయకత్వం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది.
రావడం రావడమే సురక్షా నినాదాన్ని ఇచ్చారు యోగి. అంటే రాష్ట్రంలో మాఫియా ముఠాలనూ గ్యాంగ్ స్టర్లను ఉపేక్షించే ప్రసక్తే లేదని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గ్యాంగ్ స్టర్లకు హెచ్చరికలు జారీ చేశారు. నేరగాళ్ల విషయంలో చాలా కఠినంగా ఉంటానన్నారు. వాళ్ల ఆస్తులను బుల్ డోజర్లతో కూల్చి వేస్తామన్నారు. చాలా మందిలానే ఈయన కూడా ఏదో అంటున్నారులే అని అంతా అనుకున్నారు. కాకపోతే మిగతా పాలకులు వేరు యోగి వేరు అని తెలియడానికి ఎక్కువ కాలం పట్టలేదు. పోలీస్ బాస్ ను పిలిచి స్పెషల్ ఆపరేషన్ కట్టబెట్టిన యోగి రోజుకి కనీసం నాలుగు ఎన్ కౌంటర్లైనా లేకపోతే నిద్ర పట్టదు అన్నట్లుగా దూకుడు పెంచారు.

దశాబ్ధాలుగా యూపీలో నేర సామ్రాజ్యాలను ఏకఛత్రాధిపత్యంతో ఏలుకుంటూ ప్రజలను కాల్చుకు తింటోన్న గ్యాంగ్ స్టర్లకు సెగ తగిలింది. గ్యాంగ్ స్టర్ కనిపిస్తే చాలు కాల్చి పారేయమన్న ఆదేశాలిచ్చారు యోగి. అంతే పోలీసులు పట్టపగ్గాల్లేకుండా రెచ్చిపోయారు. తుపాకుల బూజులు దులిపారు ఎవరడ్డొస్తే వారిని కాల్చి పారేశారు ఆరేళ్ల వ్యవధిలోనే 10,900 ఎన్ కౌంటర్లు చేశారంటే ఉత్తర ప్రదేశ్ పోలీసులు గ్యాంగ్ స్టర్ల పై ఎంత దూకుడు ప్రదర్శించారో అర్ధం చేసుకోవచ్చు. చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు చేయలేని పనిని యోగి ఆదిత్య నాథ్ ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే చేసి చూపించారని జనం మెచ్చుకున్నారు. ప్రత్యేకించి గ్యాంగ్ స్టర్ల దాష్టీకాలు కబ్జాలతో సర్వం కోల్పోయిన బాధిత ప్రజలు యోగిని హీరోగా చూశారు. ఎప్పుడొచ్చాం అన్నది కాదు భయ్యా బులెట్ దిగిందా లేదా అని యోగి గ్యాంగ్ స్టర్ల కేసి చూసి ఓ నవ్వు నవ్వారు.

నిజానికి పోలీసులు ఇష్టారాజ్యంగా ఎన్ కౌంటర్ల ముసుగులో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని లేపేయడం అనేది ఆమోదయోగ్యమైన పద్ధతి కాదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు. కాకపోతే దశాబ్ధాలుగా నేరగాళ్లు పేట్రేగిపోతూ ఉన్నా ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోవడం వల్లనే ఇన్ స్టెంట్ జస్టిస్ కోసం ప్రజలు ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. 2014 లో గుజరాత్ మోడల్ తెస్తామని బిజెపి ఎన్నికల నినాదం చేసుకుంది. ఇపుడు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ బిజెపి నేతల నోట వినిపిస్తోన్న కొత్త నినాదం యోగి మోడల్. ఉత్తర ప్రదేశ్ తరహాలో బుల్ డోజింగ్ పాలన తెస్తామని బిజెపి నేతలు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. దీనికి యోగి బ్రాండ్ రూల్ అని కూడా అంటున్నారు.

2022 ఎన్నికల సమయంలో నిజానికి యోగి అయిదేళ్ల పాలన పట్ల కొంత వ్యతిరేకత ఉంది. మరోసారి బిజెపి రాదేమో అని అంతా అనుకున్నారు. బిజెపిలోనూ యోగిని మారుస్తారన్న ప్రచారం జరిగింది. సమాజ్ వాది పార్టీ తమదే విజయం అని ధీమా ఉండింది. కానీ అందరి అంచనాలూ తల్లకిందులు చేస్తూ బిజెపి గెలవడం యోగి రెండో సారి ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. ఆయన రెండో సారి ముఖ్యమంత్రి కావడంలో కీలక పాత్ర పోషించింది లా అండ్ ఆర్డర్ అంశం ఒక్కటే అంటున్నారు మేథావులు. గ్యాంగ్ స్టర్ల విషయంలో యోగి రాజీలేని పోరాటం చేయడాన్ని ప్రజలు స్వాగతించారు. యోగి ఉంటేనే తమ జీవితాలు ప్రశాంతంగా ఉంటాయని నమ్మారు. అందుకే యోగికి పట్టం కట్టారని రాజకీయ పండితులు అంటున్నారు.