కన్నడ నాట కాంగ్రెస్-బిజెపి హోరా హోరీ

By KTV Telugu On 20 April, 2023
image

కర్నాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు ఒకరికొకరు తీసిపోకుండా దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ శ్రేణుల్లో  తెలీని ఉత్సాహం కనపడుతోంది. కమలనాథులు పట్టుదలగా ప్రచారం చేసుకుపోతున్నారు. కాంగ్రెస్ బిజెపిలు ఎదురొచ్చినా పాత మైసూరు ప్రాంతమే తమని గట్టెక్కిస్తుందని జేడీఎస్ నాయకులు ధైర్యంగా ఉన్నారు. కాంగ్రెస్ బిజెపిలు స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపడానికి సిద్ధమయ్యాయి. తమకి వేరే స్టార్ క్యాంపెయినర్లు అవసరం లేదని దేవెగౌడ పేరే తమకి బలమని ఆ పార్టీ నేతలంటున్నారు. కర్నాటకలో నామినేషన్ల ఘట్టం ముగింపుకొచ్చింది. నామినేషన్ల దాఖలకు వెళ్లే నేతలు తాము ఎన్నికల్లో గెలిచేసి అధికారంలోకి వచ్చేసినట్లు ప్రమాణ స్వీకార పర్వానికి తరలి వెళ్తున్నట్లు భారీ ఊరేగింపులతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉరకలు వేస్తూ కదం తొక్కుతూ ముందుకు సాగుతున్నారు. మే 10న జరగబోయే ఎన్నికలు రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్-బిజెపిలు రెండింటికీ కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవి. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతోన్న ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా అది ఏడాది పొడవునా ఆ పార్టీకి ఊపు వస్తుంది.
అందుకే కాంగ్రెస్ బిజెపి నాయకత్వాలు ఈ ఎన్నికలకు సర్వశక్తులూ ఒడ్డి పోరాడ్డానికి సిద్ధమైపోయాయి.

అయిదేళ్లుగా కర్నాటకలో అధికారంలో ఉన్నది బిజెపియే. అయితే చాలా కాలంగా బిజెపి పాలన పట్ల కర్నాటకలో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఏ పని చేయాలన్నా 40 శాతం కమిషన్ ఇవ్వాల్సిందే అని కర్నాటక పాలకులు లంచాలు దండుకుంటున్నారన్న అవినీతి ఆరోపణలు బిజెపికి పెద్దమచ్చగా మారాయి. దాన్ని అధిగమించడానికి బిజెపి అవినీతి ఆరోపణలు వచ్చిన వారికి టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టింది. అయితే అంత మాత్రాన ప్రజలు బిజెపి అవినీతికి పాల్పడలేదని చెప్పి మరోసారి గెలిపిస్తారా అంటే చెప్పలేని పరిస్థితి. ఆ నేతలంతా బిజెపి నాయకత్వంపై కోపంతో పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. బిజెపి ప్రజల్లో ఉన్న ఉన్న వ్యతిరేకతకు తోడు పార్టీలో తిరుగుబాటు జెండా ఎగరేసిన రెబెల్స్ తో కాషాయం పార్టీకి నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు. ఇది తమకి కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.
కాంగ్రెస్-బిజెపిలలో ఎవరికీ పూర్తి స్థాయి మెజారిటీ రాని పక్షంలో మళ్లీ తామే ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తామని జేడీఎస్ భావిస్తోంది.

మొత్తానికి కాంగ్రెస్ బిజెపి జేడీఎస్ లు మూడూ కూడా ఎన్నికల ప్రచారంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నాయి.
కొంతకాలం క్రితం నిర్వహించిన సర్వేలతో పాటు ప్రస్తుతం కర్నాటకలో నెలకొన్న పరిస్థితులు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. బిజెపిలో టికెట్ రాకపోవడంతో మాజీ మంత్రి జగదీశ్ శెట్టర్ నలభై ఏళ్ల కు పైగా బిజెపితో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని కాంగ్రెస్ లో చేరిపోయారు. శెట్టర్ నిష్క్రమణతో లింగాయత్ ఓట్లకు గండి పడుతుందేమోనని భయపడుతోన్న కమలనాధులు లింగాయత్ లకు చెందిన మఠాల చుట్టూ తిరుగుతూ స్వాముల ఆశీస్సులు తీసుకుంటున్నారు. ధార్వాడ్ జిల్లాలోని శ్రీ మూరుసవీర మఠ్‌ను సందర్శించారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. గురుసిద్ధ రాజయోగీంద్ర స్వామి ఆశీర్వాదం అందుకున్నారు. ఆ తర్వాత సిద్ధరూధ మఠ్‌ను సందర్శించారు జేపీ నడ్డా. ఇవి రెండూ లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన మఠాలే. జేడీఎస్ కు పాత మైసూరు కంచుకోట. దాన్ని బద్దలు కొట్టగలిగితేనే బిజెపి అయినా కాంగ్రెస్ అయినా అధికారాన్ని చేజిక్కించుకోలుగుతాయి. లేదంటే జేడీఎస్ చక్రం తిప్పే అవకాశాలుంటాయి. ఎవరూ ఎవరికీ తీసిపోరు. ప్రచారంలో ఎవరి శైలి వారిదే.  ఓటు బ్యాంకు రాజకీయాల్లోనూ ఎవరి గోల వారిదే. ప్రత్యర్ధులపై బురద జల్లడంలోనూ షేమ్ టూ షేమ్. మొత్తానికి యమ రసవత్తరంగా సాగిపోతోంది కన్నడ ఎన్నికల ప్రచార పర్వం.

పరిస్థితులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అయితే పైకి కనిపించేంత ఈజీ ఏమీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం క్యాడర్ ఉన్న కొద్ది పాటి రాష్ట్రాల్లో కర్నాటక ఒకటి. అటువంటి సానుకూల రాష్ట్రంలో బిజెపి పట్ల ఉన్న వ్యతిరేకత కలిసొచ్చే అంశమే అవుతుంది. ప్రజల్లోనూ కాంగ్రెస్ కు పట్టు ఉంది. 1994 నుండి ఇప్పటి వరకు కర్నాటకలో జరిగిన ప్రతీ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ 35 శాతానికి తక్కువ కాకుండా ఓట్లు సంపాదిస్తూనే ఉంది. ఈ సారి ఓటు షేర్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రకరకాల సర్వేలు చూస్తే ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చేపరిస్థితులు లేవని చెబుతున్నాయి. కాకపోతే  మే 10న పోలింగ్ జరిగే లోపు సమీకరణలు ఎలాగైనా మారచ్చంటున్నారు రాజకీయ పండితులు. అవినీతిపై యుద్ధమే తమ లక్ష్యమని చెప్పుకునే భారతీయ జనతా పార్టీకి కర్నాటకలో వచ్చినంత చెడ్డ పేరు ఎక్కడా రాలేదు. బొమ్మయ్ ప్రభుత్వం అంటేనే ఫార్టీ పెర్సంట్ కమిషన్ గవర్నమెంట్ అని ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణలతోనే బిజెపి ఇమేజ్ దెబ్బతింది. ఇది కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు.

కమలనాథులు అంతా పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. ఇలా బిజెపి వలస నేతలను చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు రాజకీయ పండితులు. దానికి పశ్చిమ బెంగాల్ ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు వారు. బెంగాల్ ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న 34 మందిని బిజెపి తమ పార్టీలో చేర్చుకుంది కానీ వారిలో నలుగురు మాత్రమే తర్వాతి ఎన్నికల్లో గెలిచారు. కర్నాటకలో కూడా అదే జరిగతే భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని అంటున్నారు. కాంగ్రెస్ బిజెపిలు అధికారం కోసం ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ఉంటే జేడీఎస్ మాత్రం స్ప్రైట్ తాగినట్లు చాలా కూల్ గా పాత మైసూర్ లో మైసూర్ పాక్ తిన్నట్లు తియ్యగా ప్రచారం చేసుకుంటూ ధీమాగాఉంది. ఎవరికీ మెజారిటీ రాదన్నది జేడీఎస్ లెక్క. అప్పుడు తానే కింగ్ అని కుమారస్వామి లాజిక్. కర్నాటకలో కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం ఉంది. దాన్ని దెబ్బతీయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డి.కె.శివకుమార్ పై ఐటీ దాడులు చేయించి కేసులు కూడా పెట్టారు.

అయితే ఇటువంటి చర్యల వల్ల ప్రత్యర్ధి పార్టీలను బలహీన పర్చడం అనేది సాధ్యం కాదని కర్నాటక ఎన్నికలు రుజువు చేయబోతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దర్యాప్తు సంస్థలు ప్రజల తీర్పును మార్చనే లేవని వారంటున్నారు.
నామినేషన్ల ఘట్టం ముగియక ముందే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి కోసం రేసు మొదలైపోయింది. సిద్ధరామయ్య వర్సెస్  డి.కె.శివకుమార్ వార్ కొనసాగుతోంది. సిద్ధరామయ్య అవకాశాలను దెబ్బతీయడానికి డి.కే. శివకుమార్ ఓ అడుగు ముందుకు వేసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సంచలన ప్రకటన చేశారు. అంటే ఖర్గేకి సిఎం పదవి ఇవ్వండి కానీ సిద్ధరామయ్యకు ఇవ్వద్దు అని పరోక్షంగా చాటి చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ బిజెపిల్లో ఎవరు అధికారంలోకి వస్తారన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం అంటున్నారు రాజకీయ పండితులు. ఓటర్లు ఏమనుకుంటున్నారన్నది ఎప్పుడూ గుట్టుగానే ఉంటుందని వారంటున్నారు. కొన్ని సర్వేలు కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పినా రోజు రోజుకీ సమీకరణలు మారే అవకాశాలు  కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలంటున్నారు మేథావులు. పోలింగ్ రోజున ఓటరు ఏం డిసైడ్ అయ్యాడో ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నాడో వారే అంతిమ విజేతగా నిలుస్తారని వారంటున్నారు.