తిప్పరా మీసం మోగించరా ఢమరుకం అనుకునేంత ఘనతనా అంటా అవుననీ చెప్పలేం. కాదని మనల్ని మనం చిన్నబుచ్చుకోలేం. కాకపోతే తొడగొట్టి చెప్పుకోవచ్చు మేం మగాళ్లంరా బుజ్జీ అని. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్. రాత్రికి రాత్రి మిగిలినరంగాల్లో అద్భుతాలు జరిగాయా అని ఆశ్చర్యపోకండి. మనం ప్రపంచంలో అగ్రస్థానానికి ఎగబాకింది ఎందులోనో తెలుసా జనాభా విషయంలో. అవును మొన్నటిదాకా నన్ను మించినోడు లేడనుకున్న చైనాని ఆ విషయంలో మనం దాటేశాం. ఇప్పుడు భారత్ జనాభా 142.86 కోట్లు. నాలుగురోజులు కళ్లు మూసుకుంటే 143 కోట్లు రౌండ్ ఫిగర్ అయిపోతుందంతే. చైనా కంటే భారత్ జనాభా సుమారు 29 లక్షలు ఎక్కువగా ఉంది. చైనా ఎంత కిందామీదా పడ్డా కాస్త పుంజుకునేసరికి మనం దానికి అందనంత దూరానికి వెళ్లిపోతాం. అందులో డౌటేంలేదు. భారత్ జనాభా 142కోట్ల 86లక్షలుగా తేల్చింది ఐక్యరాజ్యసమితి. అదే సమయంలో చైనా జనాభా 142కోట్ల 57లక్షలుగా అంచనావేసింది. ఐరాస 1950లో జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టాక ప్రపంచ జనాభా జాబితాలో మన దేశానికి ఫస్ట్ ప్లేస్ ఇప్పుడే దక్కింది. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు-2023 పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్స్ నివేదికను విడుదలచేసింది. భారత్ చైనాల తర్వాత ప్రపంచంలో మూడోస్థానంలో ఉంది అమెరికా. అమెరికా జనాభా 34కోట్లు. పేరుకు మూడోస్థానమే అయినా మొదటి రెండు ప్లేసుల్లో ఉన్న దేశాల జనాభాతో పోలిస్తే నాలుగోవంతు కూడా లేదు అగ్రరాజ్య జనాభా. ఈ ఏడాది ఫిబ్రవరిదాకా ఉన్న సమాచారాన్ని బట్టి ఐక్యరాజ్యసమితి ఈ లెక్కలు తేల్చింది.
33 ఏళ్లలో జనాభా విషయంలో భారత్ అనూహ్య ప్రగతి సాధించింది. 1990లో చైనా జనాభా 114.4 కోట్లుంటే అప్పుడు మన దేశ జనాభా కేవలం 86.1కోట్లు మాత్రమే. 2022 నాటికి భారత్ జనాభా 141.2కోట్లకు చేరితే చైనా జనాభా 142.6కోట్ల దగ్గరే ఉంది. భారత్‌లో జనాభా విస్ఫోటనం చూస్తుంటే 2050 నాటికి దేశ జనాభా 166.8 కోట్లకు పెరుగుతుందన్న అంచనాలున్నాయి. కానీ అదే సమయంలో చైనా జనాభా 131.7కోట్లకు పడిపోతుందట. అంటే ఇక మన నెంబర్ వన్ ప్లేస్‌కి ఎవరూ దరిదాపుల్లో లేనట్లేనన్నమాట. జనాభా పెరిగిందన్న ఆందోళనకంటే రక్తం ఉరకలేసే యువతరం మన జనాభాలో సింహభాగం ఉండటం భవిష్యత్తుకు భరోసా ఇస్తోంది. దేశ జనాభాలో 25శాతం మంది 14 ఏళ్ల లోపువారే. 15 నుంచి 24ఏళ్ల మధ్య యువత సంఖ్య 25.4 కోట్లు. 65ఏళ్లకు పైబడినవారు 7శాతం ఉన్నట్లు అంచనా. భారత్‌లో ఆయుర్దాయం పురుషుల్లో 71ఏళ్లు కాగా మహిళలకు 74ఏళ్లుగా ఉంది. ప్రపంచ జనాభా 804.5 కోట్లుగా అంచనా వేశారు. అందులో మూడింట ఒకటో వంతు జనాభా కేవలం భారత్ చైనాలోనే ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు 60 శాతం ఆసియాలో ఉన్నారు. జనాభాలో టాప్‌ఫైవ్‌లో నాలుగుదేశాలు ఆసియాలో ఉన్నాయి. 2011 నుంచి భారత జనాభా సరాసరి 1.2శాతం పెరుగుతూ వస్తోంది. అంతకుముందు పదేళ్లు మాత్రం ఈ పెరుగుదల 1.7శాతం ఉంది. చైనా గణాంకాల ప్రకారం ఆరు దశాబ్దాల్లో తొలిసారి పోయినేడాది జనాభా భారీగా క్షీణించింది. జనాభాలో సింహభాగం చైనీయులు ఆరుపదుల వయసులో ఉన్నారు. వాళ్లకు సరిపడా యువకులు లేకపోవటం చైనాకు మైనస్ పాయింట్ అయితే మన జనాభాలో ఎక్కువమంది యువతరమే. ఇంకెందుకు ఆలస్యం మనం జబ్బలు చరిచేసుకోవచ్చు.