మాజీ ఎంపీ అని వదిలేయలేదు అతని కొడుకుని కూడా ఉపేక్షించలేదు. ఉత్తరప్రదేశ్‌లో అతీఖ్అహ్మద్ సోదరుల హత్యతో పాటు అంతకుముందు ఉమేష్‌పాల్ హంతకుల ఎన్కౌంటర్ నేర ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్నే ఇచ్చింది. ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా యోగి సర్కారు ఎవరినీ వదిలిపెట్టదన్న విషయం కరడుగట్టిన నేరస్తులందరికీ అర్ధమైంది. ఒకప్పుడు రాజకీయాన్ని రౌడీయిజాన్ని మిల్క్ షేక్‌లా కలిపేసి జుర్రుకున్న అతీఖ్ అహ్మదే కుక్కచావు చచ్చాక మనమెంత అనుకుంటున్నారు పెద్ద పెద్ద నేరగాళ్లు కూడా. అతీక్ అహ్మద్ సోదరుల హత్యతో యూపీలో ఇంకెంత చెత్తను శుభ్రం చేయాల్సి ఉందో యోగికి అర్దమైంది. అందుకే కొమ్మలు నరకడం కాదు కూకటివేళ్లతో నేరసామాజ్రాన్ని పెకిలించాలనుకుంటోంది అక్కడి బీజేపీ ప్రభుత్వం.
అతీఖ్ అహ్మద్ సోదరుల హత్య ఆయన కొడుకు తదితరుల ఎన్‌కౌంటర్‌తో ఒక వర్గాన్నే బీజేపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని అసదుద్దీన్ లాంటి వాళ్లు గగ్గోలు పెట్టారు. మిగతా సముదాయంలో నేరగాళ్లు లేరా అన్న ప్రశ్న లేవనెత్తారు. నేరగాళ్ల కులగోత్రాలు పుట్టుమచ్చలు చూసేపరిస్థితుల్లో యూపీ ప్రభుత్వం లేదు. దశాబ్ధాలుగా చట్టం న్యాయం అనేది లేకుండా పేట్రేగిపోయిన నేరగాళ్లను ఏరిపారేయడమొక్కటే లక్ష్యంగా పెట్టుకుంది అక్కడి ప్రభుత్వం. అతీఖ్ అహ్మద్ సోదరుల మర్డర్ వెనుక ఎవరున్నారో కూపీ లాగుతూనే 61మంది మాఫియా నేరస్తులతో మరో జాబితా రెడీచేసింది యోగి సర్కారు. వారికి సంబంధించిన ఆస్తులను కూడా అటాచ్ చేస్తూ ఒత్తిడి పెంచుతోంది.
యూపీ ప్రభుత్వ కొత్త టార్గెట్ లిస్ట్‌లో కొందరు ఆరోపిస్తున్నట్లు ఏ ఒక్క వర్గమో లేదు. ఆ మాటకొస్తే అందులో వాళ్లు నాలుగోవంతు కూడా లేరు. బీఎస్పీ ఎమ్మెల్యేను హత్యచేయడం తప్పు. ఆ తప్పును కప్పుపుచ్చుకోడానికి శిక్షనుంచి బయటపడటానికి సాక్షిని హతమార్చడం మరో తప్పు. ఇంత దూరమొచ్చాక కూడా చట్టం తనపని తాను చేసుకోకుండా ఎందుకుంటుంది. అతీఖ్ అహ్మద్ వ్యవహారంలో అదే జరిగింది. ఇప్పుడు యూపీ పోలీసులు రూపొందించిన లిస్టులో స్మగ్లర్లు మాఫియా కరడుగట్టిన నేరస్తులు అంతా ఉన్నారు. అందులో ఇప్పటికే జైలు ఊచలు లెక్కపెడుతున్నవారు కూడా ఉండటంతో వారి జీవితాలకు కౌంట్‌డౌన్ మొదలైనట్లే కనిపిస్తోంది. ఇక పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్నవారు ఈ లిస్ట్ డర్‌తో సరెండర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.