బాబుకు పవన్ బిగ్ షాక్ ఇవ్వబోతున్నాడా

By KTV Telugu On 22 April, 2023
image

ఒకటే హృదయం కోసం ఇరువురి పోటీ దోషము అన్నాడో సినీకవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇపుడు ఇలాంటి సిట్యుయేషనే కనిపిస్తోంది. కాకపోతే వారికి ఈ పాట గురించి తెలియక పోవడంతో ఇద్దరూ ఒక్కరినే ప్రేమించుకుపోతున్నారు. ఆ ముగ్గురినీ చూస్తోన్న వారు మాత్రం పగలబడి నవ్వుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పోటీ నడుస్తోంది. ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉన్న తరుణంలో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ఎవరు ఎవరితో కలిసి వెళ్లాలి అన్నది విపక్షాల మధ్య రక రకాల పోటీలు పెడుతోంది. 2019 ఎన్నికల అనంతరం సినీ నటుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోవాలి కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏంటి అని కొందరు వెటకారాలాడారు కూడా. అయితే అప్పట్నుంచీ జనసేన బిజెపిల మధ్య స్నేహ బంధం అలానే ఉంది. కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రేనేతలతో వరుస భేటీలు నిర్వహించి వచ్చారు. ఇతర నేతలతోనే కాదు అంతకు ముందు విశాఖలో సాక్ష్యాత్తూ ప్రధాని నరేంద్ర మోదీతోనే పవన్ కళ్యాణ్ వన్ టూ వన్ భేటీ లో పాల్గొన్నారు కూడా.

పవన్ కళ్యాణ్ ను అత్యంత విలువైన మిత్రుడిగానే బిజెపి నాయకత్వం భావిస్తోంది. ఇక 2014లో బిజెపితో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో లబ్ధిపొందింది తెలుగుదేశంపార్టీ. అయితే 2018 ఎన్నికలకు ఏడాది ముందు 2018లో కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు వచ్చేసింది టిడిపి. బిజెపితో తెగతెంపులు చేసుకున్న చంద్రబాబునాయుడు 2019 ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి ఓడిపోతుందని అంచనా వేశారు. ఓడిపోయే పార్టీతో కలిసి ఉండడం ఎందుకని ఆయన బయటకు వచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించి ఢిల్లీ వెళ్లి సోనియా రాహుల్ గాంధీలను కలిసి విచిత్రంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. నిజానికి టిడిపిని ఎన్టీయార్ స్థాపించిందే కాంగ్రెస్ వ్యతిరేకతలోంచి అటువంటిది చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనలా కోసం సిద్ధాంతాన్ని పక్కన పెట్టేశారన్న విమర్శలు వచ్చాయి. టిడిపిలో ఎన్టీయార్ హయాం నుంచీ ఉన్న సీనియర్లు అయ్యన్న పాత్రుడు వంటి వారు అయితే కాంగ్రెస్ తో సంబంధంపై నిప్పులు చెరిగారు కూడా. బిజెపిని ఓడిస్తానని శపథాలు చేశారు చంద్రబాబు. నరేంద్రమోదీపై వ్యక్తిగత దూషణలకూ తెగబడ్డారు. అయితే ఆ ఎన్నికల్లో అనూహ్యంగా నరేంద్ర మోదీ ఘన విజయం సాధించడం రెండో సారి ప్రధాని కావడం జరిగిపోయాయి.

దాంతో నాలిక్కర్చుకున్న చంద్రబాబు అనవసరంగా బిజెపికి దూరం అయ్యామే అని బాధపడ్డారు. అప్పట్నుంచీ బిజెపితో తిరిగి జట్టుకట్టడానికి రకరకాల విన్యాసాలు చేశారు. మోదీ దృష్టిని ఆకర్షించడానికి తమ రాజ్యసభ సభ్యులు నలుగురిని వెండి పళ్లెంలో పెట్టి బిజెపికి కానుకగా ఇచ్చేశారు చంద్రబాబు. అయితే అది వర్కవుట్ కాలేదు. బిజెపి చంద్రబాబును దగ్గరకు రానివ్వడం లేదు. ఆ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా తిరిగి బిజెపి ప్రాపకం పొందాలని ప్లాన్ చేశారు. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ మోదీతో భేటీ అయ్యారు. టిడిపి-జనసేన-బిజెపిలు కలిసి పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని పవన్ ప్రతిపాదించగానే ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడితో అంటకాగే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు. దాంతో చంద్రబాబు నీరుగారి పోయారు. అయితే పవన్ మాత్రం ఏపీలో వైసీపీని ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని అనుకుంటున్నారు. అందుకోసం టిడిపితో కలిసి వెళ్లాలని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తుకు సానుకూలంగా ఉన్నట్లు తెలియగానే టిడిపిలో హుషారు వచ్చింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధుల విజయాలతో మళ్లీ టిడిపి నేతల్లో మేకపోతు గాంభీర్యం వచ్చింది. జనసేనతో పొత్తు లేకపోయినా టిడిపి ఒంటరిగా అధికారంలోకి వస్తుందని భావించడం మొదలు పెట్టారు. జనసేనతో సీట్ల షేరింగ్ అనేది ఉండనే ఉండదని టిడిపి నేతలు ప్రకటించారు కూడా.

అయితే తాజా సర్వేలు ఏపీలో వైసీపీ రోజురోజుకీ బలోపేతం అవుతోన్నట్లు తేలడంతో టిడిపిలో టెన్షన్ మొదలైంది. దీంతో తాజాగా పవన్ కళ్యాణ్ తమతో కలుస్తాడని బిజెపికి కంగారుగా ఉందని టిడిపి నేత పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్య చేశారు. జనసేనను ఎంతకాలం టిడిపితో కలవకుండా ఆపుతారో మేమూ చూస్తాం అని కూడా ఆయన అన్నారు.
ఆ వెంటనే బిజెపి ఎంపీ జి.వి.ఎల్. నరసింహారావు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జనసేన పార్టీ తమతో పొత్తులో ఉందని గుర్తు చేశారు. మా మిత్ర పక్షాల మధ్య చిచ్చు రేపాలని టిడిపి చూస్తోంది కానీ వారి ఆటలు సాగవు అని జివిఎల్ నరసింహారావు అన్నారు. అటు టిడిపి ఇటు బిజెపి రెండూ కూడా జనసేన ప్రేమలో నిండా మునిగిపోయాయి. జనసేన తమతోనే ఉండాలని ఎవరికి వారు కోరుకుంటున్నారు. జనసేన తమకి దూరం అవుతుందేమోనన్న అనుమానం రాగానే కంగారు పడిపోతున్నారు. ఆ క్రమంలోనే పవన్ మా వాడంటే మావాడంటూ ఇద్దరూ దెబ్బలాడుకుంటున్నారు. ఈ ముక్కోణపు ప్రేమను చూసి రాజకీయ విశ్లేషకులు నవ్వుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఆ లోపు మూడు పార్టీల ఆలోచనల్లోనూ మార్పులు రావచ్చునంటున్నారు రాజకీయ పండితులు. టిడిపితో పొత్తు వద్దే వద్దు అని జనసేనకు నూరిపోసిన బిజెపి నాయకత్వం ఒక గట్టి హామీ ఇచ్చినట్లు సమాచారం.

2024 ఎన్నికల్లో టిడిపిని దూరం పెట్టి జనసేన బిజెపి కలిసి ఎన్నికలకు వెళ్దామన్నది బిజెపి సూచన. అపుడు టిడిపి ఎలాగూ ఎన్నికల్లో ఓటమి చెందుతుంది కాబట్టి ఇక ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుందన్నది బిజెపి నేతల అంచనా. అపుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్ధిగా జనసేన మిగులుతుందని వారి వాదన. 2029 ఎన్నికల వరకు జనసేనాని ప్రజలతో మమేకం అవుతూ నిత్యం ప్రజాసమస్యలపై పోరాడుతూ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తే 2029 ఎన్నికల్లో జనసేన-బిజెపి కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టే అవకాశాలున్నాయని బిజెపి నేతలు అన్నట్లు సమాచారం. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా సాక్షాత్తూ నరేంద్ర మోదీయే ప్రకటిస్తారని ఆశ కూడా పెట్టారట కమలనాథులు. ఆ మాటలు పవన్ కళ్యాణ్ మదిలో ఎలాంటి ఆలోచనలు తెస్తాయో తెలీదు కానీ ఏదో ఒక పరివర్తన అయితే రావచ్చునంటున్నారు రాజకీయ పండితులు. కొంత కాలంగా పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి అయితే మాట్లాడ్డం లేదు. బిజెపి మాటలు వింటే ముఖ్యమంత్రి కావాలన్న జనసైనికుల ఆకాంక్ష నెరవేరుతుందని పవన్ శ్రేయోభిలాషులు కూడా అంగీకరిస్తున్నారట. అందులోనూ టిడిపిని కానీ చంద్రబాబు నాయుణ్ని కానీ నమ్మి బాగుపడ్డ వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరని పవన్ కళ్యాణ్ కు సన్నిహితులైన మేథావులు కూడా హెచ్చరించినట్లు సమాచారం.

దీంతో పవన్ కళ్యాణ్ ఆలోచనలో పడ్డారంటున్నారు. రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయాలు తీసుకు వచ్చి ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానని చెప్పిన పవన్ ప్రజలకోసం పాతికేళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగడానికి నిర్ణయించుకునే వచ్చానని కూడా చాలా సార్లు చెప్పారు. ఒక వేళ టిడిపితో పొత్తు పెట్టుకుంటే ఇద్దరి పొత్తు కలిసొచ్చి కూటమికి మెజారిటీ వస్తే కచ్చితంగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారు తప్ప పవన్ కు ఆ పదవిని ఇవ్వరు. చంద్రబాబును సిఎంని చేయడం కోసం అనవసరంగా జనసేన ఎందుకు నష్టపోవాలన్నది జనసైనికుల ప్రశ్న. బిజపి నేతలు కూడా ఇదే చెప్పారట. అందుకే దీనిపై ఏం చేయాలో నిర్ణయించుకోడానికి పార్టీలోని సీనియర్లతో పాటు మేథావులతోనూ సమాలోచనలు జరపాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్ తమ చేజారిపోతాడేమోనన్న అనుమానంతోనే టిడిపి నేతల్లో కలకలం మొదలై పవన్ టిడిపితో కలవకుండా ఎవరూ ఆపలేరని అంటోన్నట్లుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.