ఏది ఉచితం..ఏది అనుచితం?

By KTV Telugu On 5 October, 2022
image

– అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తే అడుక్కోవడమే!
– ఉచిత హామీల స్పీడ్‌కి సుప్రీం బ్రేకులు

పక్షులకైనా రోజూ ఒకేచోట గుప్పెడు గింజలేస్తే అవి ఎగరడం మర్చిపోతాయి. జంతువులను కూర్చోబెట్టి మేపితే వేటాడి ఆహారాన్ని సంపాదించే అలవాటుకు దూరమవుతాయి. కాయకష్టంచేసి సంపాదించుకున్నదాంతో కలోగంజో తాగితేనే మనిషికైనా సంతృప్తి. కానీ ఓట్లు తప్ప ప్రజల భవిష్యత్తు పట్టని పాలకులు అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ అంటున్నారు. కడుపులో చల్ల కదలకుండా కూర్చోమంటున్నారు. తమకు ఓట్లేయాలేగానీ తినేకష్టంకూడా లేకుండా నోటికి గురుముద్దలు అందిస్తామంటున్నారు.

ప్రతీవ్యక్తికీ స్వాభిమానంతో బతికే హక్కుంది. అణగారిని వర్గాలు అన్నిరంగాల్లో స్వయంసమృద్ధి సాధించేలా పాలకులు చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. కానీ దేశంలో ఇప్పుడు జరుగుతున్నదేమిటి? ప్రతీ సంక్షేమం రాజకీయ ప్రయోజనాలతో ముడిపడుతోంది. అన్ని కులాలు, మతాలను దువ్వేలా ఉచిత హామీలు ముంచేస్తున్నాయి. సాధ్యమా అసాధ్యమా అన్నదాంతో పన్లేదు. ఓట్లే పరమావధి అన్నట్లుంది ఉచితహామీల పరిస్థితి. సముద్రం లేకపోయినా ఫర్లేదు. నమ్మేవాళ్లుంటే ఓడరేవు ఏర్పాటుచేస్తామని నమ్మబలుకుతోంది నేటి రాజకీయం.

అనుచితంగా మారుతున్న ఉచితాలపై అత్యున్నత న్యాయస్థానం జోక్యం స్వాగతించదగ్గ పరిణామం. ఎడాపెడా హామీలిచ్చేస్తే సరిపోదు. రాజకీయపార్టీలు తమ వాగ్దానాల అమలుకు నిధులు ఎలా సమకూరుస్తాయో స్పష్టత ఇవ్వాలని సుప్రీం అభిప్రాయపడింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో సవరణలు ప్రతిపాదించాలని నిర్ణయించింది. దీని ప్రకారం వాగ్దానాల అమలుకు అయ్యే ఖర్చెంత, దానివల్ల ఎంతమందికి ప్రయోజనం కలుగుతుంది, ఆర్థిక వనరులను సమకూర్చుకునే మార్గాలేంటన్న వివరాలను ఎన్నికల కమిషన్‌ సేకరించబోతోంది.

చాలా రాష్ట్రాల్లో ఆదాయవ్యయాలకు పొంతన లేకుండాపోతోంది. ప్రభుత్వాల ఉచితహామీల భారం బడ్జెట్‌ని మించిపోతోంది. అప్పుచేసి పప్పుకూడు తినిపించేందుకు కొన్ని ప్రభుత్వాలు ఉత్సాహపడుతున్నాయి. సుప్రీం జోక్యంతోనో, ఈసీ సంస్కరణలతోనో ఉచితాలు ఆగిపోతాయని కాదు. కానీ అడ్డగోలు నిర్ణయాలు తీసుకోకుండా, ఉచితాల ప్రవాహంలో ప్రభుత్వాలు కొట్టుకుపోకుండా చూసేందుకు ఈప్రయత్నం కొంతైనా ఉపయోగపడుతుంది.